ప్రైవేట్ 'ఎంటిటీ' కాదు 'ఎంటర్‌ప్రైజ్'!
న్యూఢిల్లీ: భూసేకరణ చట్టానికి చేపట్టిన సవరణలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. సవరణ బిల్లులో 'ప్రైవేటు ఎంటిటీ' అనే పదాన్ని 'ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్'గా మార్చేందుకు.. తద్వారా ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేపట్టే ప్రయివేటు వ్యవస్థ నిర్వచనాన్ని పరిమితం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విపక్షాలకు సర్కారు సంకేతమిచ్చింది. భూసేకరణ, పునరావాసం, పునరుద్ధరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు (సవరణ) బిల్లు సోమవారం పార్లమెంటులో పరిశీలనకు, ఆమోదానికి రానుంది. ఈ బిల్లులో ‘ప్రైవేట్ ఎంటిటీ’ (ఎంటిటీ అంటే ఎటువంటి వ్యవస్థ కానీ, వ్యక్తి కానీ ఏదైనా కావచ్చు) అన్న పదాన్ని వినియోగించటం వల్ల ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే భూసేకరణ చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
దీంతో.. ‘ప్రైవేట్ ఎంటిటీ’ పదం స్థానంలో.. ‘ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్’ (ప్రైవేట్ సంస్థ) పదాన్ని చేర్చేందుకు బిల్లుకు అధికారిక సవరణ తెస్తామని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్‌సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడులు ఆదివారం సమావేశమై చర్చించారని తెలిసింది. వీరు సోమవారం ఉదయం లోక్‌సభలోని రాజకీయ పక్షాల నేతలతో సమావేశమై చర్చిస్తారని సమాచారం. గత యూపీఏ సర్కారు 2013లో భూసేకరణ చట్టం చేసినపుడు.. అందులో ‘ప్రైవేట్ కంపెనీల’ కోసం భూసేకరణ చేపట్టవచ్చని పేర్కొంది. ఈ చట్టానికి ఎన్‌డీఏ సర్కారు ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన సవరణలోనూ, ఆ ఆర్డినెన్స్ స్థానంలో చట్టం చేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లులోనూ ‘ప్రైవేట్ కంపెనీ’ పదాన్ని 'ప్రైవేటు ఎంటిటీ'గా మార్చింది.
కార్పొరేట్ల కోసమే: జైరాం రమేశ్
కొచ్చి: కార్పొరేట్ల కోసమే భూసేకరణ చట్టానికి సవరణలు చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శించారు. రైతుల క్షేమం కోసం 2013లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి సవరణలు చేయడం దారుణమని అన్నారు.
నితీశ్ నిరశన... భూ సేకరణ ఆర్డినెన్స్, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ నెల 14న 24 గంటల నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ మేరకు జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ సింగ్ ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.