న్యూఢిల్లీ: ఎంటర్‌ప్రైజ్ మెసేజింగ్ సేవల సంస్థ రూట్ మొబైల్‌లో బెల్జియంకు చెందిన ప్రాక్సిమస్ గ్రూప్ 84 శాతం వరకు వాటాలను దక్కించుకోనుంది. ఇందులో భాగంగా ముందు దాదాపు 58 శాతం వాటాలను రూ. 5,922 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌తో నిబంధనల ప్రకారం.. 26 శాతం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి రానుండటంతో, ఆ మేరకు షేర్లన్నింటినీ కొనుగోలు చేస్తే మొత్తం 84 శాతం వరకూ వాటాలను పెంచుకునే అవకాశం ఉంది.
అయితే, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ వాటా కనీసం 25 శాతం ఉండాలనే నిబంధన మేరకు 12 నెలల్లోగా కొన్ని షేర్లను విక్రయించి తన వాటాను 75%కి తగ్గించుకోవాల్సి రానుంది. షేరు ఒక్కింటికి రూ. 1,626.40 చొప్పున అనుబంధ సంస్థ ప్రాక్సిమస్ ఓపల్ ద్వారా ప్రాక్సిమస్ గ్రూప్ తమ సంస్థలో 57.56% వాటాలను కొనుగోలు చేయనున్నట్లు రూట్ మొబైల్ తెలిపింది. లావాదేవీ పూర్తయ్యాక రూట్ మొబైల్ సీఈవో రాజ్‌దీప్ గుప్తా తన ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగుతూనే.. గ్రూప్ సీపాస్ (కమ్యూనికేషన్స్ ప్లాట్‌ఫాం యాజ్ ఎ సర్వీస్) కార్యకలాపాలకు సారథ్యం వహిస్తారు. రూట్ మొబైల్‌లో వాటాల కొనుగోలుతో అంతర్జాతీయంగా సీపాస్ విభాగంలో తమ స్థానం మరింత పటిష్టం కాగలదని ప్రాక్సిమస్ గ్రూప్ సీఈవో గిలామ్ బూటిన్ తెలిపారు.
ప్రాక్సిమస్ సంస్థలో పెట్టుబడి..
ఒప్పందం ప్రకారం రూట్ మొబైల్ వ్యవస్థాపక వాటాదారుల్లో కొందరు ప్రాక్సిమస్ ఓపల్‌లో అలాగే ప్రాక్సిమస్‌కు చెందిన మరో అనుబంధ సంస్థ టెలీసైన్‌లో మైనారిటీ వాటాలు తీసుకోనున్నారు. ఇందుకోసం 299.6 మిలియన్ యూరోలను వెచి్చంచనున్నారు. రూట్ మొబైల్ మరింత ముందుగానే బిలియన్ డాలర్ల ఆదాయ లక్ష్యాన్ని సాధించేందుకు టెలీసైన్‌తో భాగస్వామ్యం ఉపయోగపడగలదని గుప్తా ధీమా వ్యక్తం చేశారు.
సోమవారం బీఎస్‌ఈలో రూట్ మొబైల్ షేరు సుమారు 9% క్షీణించి రూ. 1,486 వద్ద క్లోజైంది.
Comments
Please login to add a commentAdd a comment