
ఉదయ్‌పూర్ కిచెన్ క్వీన్ శశికళ మనదేశంలో కంటే విదేశాల్లో బాగా ఫేమస్. ఆమె గరిట తిప్పిందంటే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఆమె వంట చేస్తే నలభీములు సైతం వంక పెట్టలేరు.
పాకశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం ఆమె సొంతం. అందుకే ఆమె దగ్గర వంటలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి వస్తుంటారు. ఒకప్పుడు భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న శశికళ ఇప్పుడు ఎంతోమంది విదేశీయులకు వంటలు నేర్పిస్తూ, వ్యాపారవేత్తగానూ ఆదర్శంగా నిలుస్తుంది.
రాజస్థాన్‌కు చెందిన శశికళ జీవితం ఒకప్పుడు సాధాసీదాగానే ఉండేది. క్యాన్సర్ కారణంగా భర్తను కోల్పోయి చిన్నాచితక పనిచేసుకుంటూ ఒంటరిగా కాలం వెళ్లదీసేది. కానీ అనుకోకుండా ఆమె దశ తిరిగింది. ఒకప్పుడు ఒక్క ఇంగ్లీషు ముక్క కూడా రాని అతి సామాన్యురాలైన శశికళ ఇప్పుడు అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తుంది. ఆమె దగ్గర వంటలు నేర్చుకోవడానికి 30 దేశాలకు చెందిన వాళ్లు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటున్నారంటే ఆమె వండే వంటలు ఎంత స్పెషలో ఈపాటికే అర్థమైపోయింటుంది.
ఓసారి ఐరీష్ నుంచి వచ్చి దంపతులకు శశికళ మన భారతీయ వంటలు వండి వడ్డించింది. ఆ రుచికి ఫిదా అయిన ఆ దంపతులు వెంటనే శశికళతో కుకింగ్ క్లాసెస్ ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా మొదలైన ఆమె ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతుంది. మొదట్లో ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడేది శశికళ. కానీ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడుతూ అదరగొడుతుంది. శశికళ వద్ద కుకింగ్ పాఠాలు నేర్చుకునేందుకు విదేశాల నుంచి స్వయంగా ఉదయ్‌పూర్ వస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment