పోలీసుస్టేషన్ వద్ద బాధితులు
కుషాయిగూడ (హైదరాబాద్): ఉపాధి చూపుతానంటూ ముగ్గులోకి దించి అందిన కాడికి దండుకొని బోర్డు తిప్పేసిన ఘటన సోమవారం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. రావులకొల్లు రమేశ్ అనే వ్యక్తి ఏఎస్ రావునగర్‌లో ఆర్‌ఆర్ ఎంటర్‌ప్రైజెస్ (గ్రోయింగ్ టుగెదర్) కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. వత్తులు, బొట్టుబిల్లలు తయారు చేసే మిషన్లు సరఫరా చేస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. మిషన్లు కొనుగోలు చేసేవారికి అవసరమైన ముడిసరుకు తానే సరఫరా చేస్తానని, తయారు చేసిన వత్తులు, బొట్టుబిల్లలను కూడా తానే కొనుగోలు చేసి ఉపాధి చూపుతానంటూ నమ్మించాడు.
ఆకర్షితులైన వారు వత్తుల మిషన్‌కు రూ.1.50 లక్షలు, బొట్టు బిల్లల మిషన్‌కు రూ.2.20 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేసి వత్తులు, బొట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. వారి వద్ద నుంచి కిలో వత్తులకు రూ.300, కిలో బొట్లకు రూ. 600 చెల్లిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో గొలుసు కట్టు మాదిరిగా ఆంధ్ర, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల వారూ మిషన్లు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. ఇలా వేల మంది యంత్రాలు కొనుగోలు చేయడంతో దాదాపు రూ.30 కోట్లు ఆర్జించాడు.
కొన్నిరోజులుగా తయారీదారుల నుంచి వత్తులు, బొట్టుబిల్లలు తీసుకుంటున్నారే తప్ప డబ్బులు చెల్లించడం లేదు. ఈ క్రమంలో నాగర్జుననగర్ కాలనీకి చెందిన రుద్రరాజు రామసీత అనే మహిళకు చెందిన యంత్రాలు రిపేర్‌కు వచ్చాయి. ఆఫీసుకు వెళ్లగా ఆమెలా ఇబ్బందులు పడుతున్న చాలామంది అక్కడ కనిపించారు. దీంతో తాము మోసపోయా మని గ్రహించిన వారు.. వారం రోజులుగా ఆ ఆఫీసుకు వెళ్తున్నా రమేష్ అందుబాటులోకి రాలేదు. దీంతో బాధితులంతా కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment