సాక్షి, సిటీబ్యూరో: జియో లాటరీ పేరుతో ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన ఓ వివాహిత నుంచి రూ.41,300 కాజేశారు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాంపల్లిలోని ఆగపుర ప్రాంతానికి చెందిన వివాహిత భార్గవికి ఈ నెల 9న +923008140684 నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తులు తాము జియో టెలికాం కంపెనీ నుంచి మాట్లాడుతున్నామంటూ చెప్పారు. తమ సంస్థ నిర్వహించిన ఉత్తమ కస్టమర్ల లక్కీడ్రాలో ప్రథమ బహుమతి వచ్చిందని, దీనికింద రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ డబ్బు తీసుకునేందుకు వివరాలు తెలపాలని కోరడంతో భార్గవి చెప్పారు.
ఆ మరుసటి రోజు జియో విన్నర్స్ సర్టిఫికెట్ పేరుతో ఓ ధ్రువీకరణ పత్రాన్ని పంపారు. దానిపై ఉన్న లోగో, ఇతర వివరాలు చూసిన భార్గవి వారిని పూర్తిగా నమ్మింది. ఆ తర్వాత అసలు వ్యవహారం ప్రారంభించిన నేరగాళ్లు లాటరీ సొమ్ము తీసుకోవడానికి జీఎస్టీ తదితరాలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అలా మూడు దఫాల్లో రూ.41,300 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. అయినా ఆగకుండా వివిధ కారణాలు చెబుతూ మరికొంత మొత్తం డిపాజిట్ చేయమని కోరారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. సాంకేతిక ఆధారాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment