లాటరీ స్కీం విజేతలకు అందించే బహుమతులు
ఆదోని టౌన్: నిరుపేదల ఆశలను లక్ష్యంగా చేసుకొని కొందరు స్వార్థపరులు లాటరీల పేరుతో మోసం చేస్తున్నారు. లాటరీ, స్కీమ్‌లు నిర్వహించడం చట్ట విరుద్ధమైనా పోలీసుల అండతోనే అమాయకులను దోచుకుంటున్నారు. జిల్లాలో తరచూ స్కీమ్‌ల పేరుతో భారీగా వసూళ్లు చేసుకుని బోర్డు తిప్పేసిన సంఘటనలు కోకొల్లలు ఉన్నా ఆదోని పోలీసులు మాత్రం ఏమీ ఎరుగనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఆదోని పట్టణంలోని ఓ ఎంటర్‌ప్రైజస్ యజమాని నిర్వహిస్తున్న లాటరీ స్కీం వివాదాస్పదమైంది. నాలుగు నెలల గడువుతో ఏర్పాటు చేసిన లాటరీ స్కీంలో మొత్తం వెయ్యి మంది సభ్యులను చేర్చుకున్నారు. సభ్యత్వ రుసుం కింద రూ.వంద చొప్పున వసూలు చేశారు. స్కీంలో చేరిన సభ్యులతో నాలుగు నెలల పాటు నెలకు రూ.వెయ్యి చొప్పున రూ.40 లక్షలు కట్టించారు.
ప్రతి నెలా లాటరీ డిప్ ద్వారా పది మంది విజేతలను ఎంపిక చేసి వారికి మాత్రమే బహుమతులు అందించారు. నాలుగు నెలల్లో 40 మంది విజేతలు బహుమతులు పొందారు. అయితే మిగిలిన వారికి కన్సొలేషన్ బహుమతులు అందించారు. అయితే అవి చాలా తక్కువ ధర ఉండటంతో పాటు నాణ్యత లేక పోవడంతో కూడా పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కీమ్ నిర్వాహకులు మాత్రం నాలుగు నెలల్లో రూ.20 లక్షల వరకు లబ్ధి పొందినట్లు అంచనా. ఈ విషయమై స్కీంకు ఏజెంటుగా వ్యవహరించిన కౌతాళానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి ఇటీవల ఆదోని పట్టణంలోని 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. నిర్వాహకులకు పోలీసులు వంత పాడడంతో తానేమీ చేయలేక పోయానని స్కీంకు ఏజెంటుగా వ్యవహరించిన శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
మా దృష్టికి రాలేదు
ఆదోని పట్టణంలో ఎంటర్‌ప్రైజెస్ పేరుతో మోసం చేసినట్లుగా మా దృష్టికి రాలేదు. ఇప్పటి వరకు ఎవరూ మమ్మల్ని ఆశ్రయించలేదు. బాధితులు నష్టపోయినట్లు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– వాసుకృష్ణ, సీఐ, ఆదోని
Comments
Please login to add a commentAdd a comment