బనగానపల్లె రూరల్: తల్లిదండ్రులను చూసేందుకు భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ బిడ్డతో సహా దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన బనగానపల్లె – ప్యాపిలి రహదారిలోని దద్దణాల సమీపంలో చోటు చేసుకుంది. బనగానపల్లె ఎస్‌ఐ రామిరెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్యాపిలి మండలం అలేబాద్ గ్రామానికి చెందిన ఎస్.మనోహర్, లక్ష్మి దంపతులకు కుమార్తె మానస (2) ఉంది. కాగా లక్ష్మి తల్లిదండ్రులు రాంపుల్లయ్య, రామేశ్వరి బనగానపల్లెలో ఉన్నారు. వారిని చూసేందుకు సోమవారం చిన్నారిని వెంట పెట్టుకుని దంపతులిద్దరూ బైక్‌పై బయల్దేరారు.
మార్గమధ్యలో దద్దణాల సమీపంలో బనగానపల్లె నుంచి గుత్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ప్రమాదశాత్తూ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిన లక్ష్మి, చిన్నారి మానసపై బస్సు టైర్లు వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మనోహర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామిరెడ్డి వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా మృతుల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ వద్ద ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను తమకు అప్పగించాలని కొద్ది సేపు నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ చేరుకుని బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామిరెడ్డి తెలిపారు. తల్లి, కూతురు ఒకేసారి ఇలా రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో బంధువు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment