Mother and daughter died
-
బైక్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు తల్లీ కూతుళ్ల మృతి
బనగానపల్లె రూరల్: తల్లిదండ్రులను చూసేందుకు భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ బిడ్డతో సహా దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన బనగానపల్లె – ప్యాపిలి రహదారిలోని దద్దణాల సమీపంలో చోటు చేసుకుంది. బనగానపల్లె ఎస్ఐ రామిరెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ప్యాపిలి మండలం అలేబాద్ గ్రామానికి చెందిన ఎస్.మనోహర్, లక్ష్మి దంపతులకు కుమార్తె మానస (2) ఉంది. కాగా లక్ష్మి తల్లిదండ్రులు రాంపుల్లయ్య, రామేశ్వరి బనగానపల్లెలో ఉన్నారు. వారిని చూసేందుకు సోమవారం చిన్నారిని వెంట పెట్టుకుని దంపతులిద్దరూ బైక్‌పై బయల్దేరారు. మార్గమధ్యలో దద్దణాల సమీపంలో బనగానపల్లె నుంచి గుత్తికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ప్రమాదశాత్తూ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కింద పడిన లక్ష్మి, చిన్నారి మానసపై బస్సు టైర్లు వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మనోహర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రామిరెడ్డి వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా మృతుల కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ వద్ద ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను తమకు అప్పగించాలని కొద్ది సేపు నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐ చేరుకుని బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. తల్లి, కూతురు ఒకేసారి ఇలా రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో బంధువు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
తల్లీ కూతుళ్ల ఆత్మహత్య
సంగారెడ్డి రూరల్: ఆర్థిక సమస్యలతో తల్లీ కూతుళ్లు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్లగూడెంలో చోటుచేసుకుంది. చెర్లగూడెంలో ఉంటున్న అలకుంట గంగమ్మ (70), మాశెట్టి నాగమ్మ (40) తల్లీ కూతుళ్లు. గంగమ్మ, నాగమ్మ భర్తలు గతంలోనే మృతి చెందారు. గంగమ్మకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉండగా..నాగమ్మకు ఓ కుమార్తె ఉంది.నాగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు సరిపడా డబ్బులు లేకపోవడంతో మనస్తాపం చెంది చనిపోతానని తరచూ చెబుతుండేది.ఈ క్రమంలో నాగమ్మ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురి మరణాన్ని తట్టుకోలేక తల్లి గంగమ్మ కూడా అదేరోజు అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంత్యక్రియలకు వస్తుండగా ఆటో బోల్తా.. శనివారం ఆత్మహత్య చేసుకున్న గంగమ్మ, నాగమ్మ ల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నర్సాపూర్ నుంచి వస్తున్న బంధువుల ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మృతిచెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో చోటుచేసుకుంది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నర్సాపూర్ నుంచి మహేశ్ తన కుటుంబ సభ్యులతో ఆటోలో బయలుదేరారు. ఆటో ఇస్మాయిల్‌ఖాన్‌పేటకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న చిన్నారి దుర్గ (8) అక్కడికక్కడే మృతి చెందింది. పాప తల్లి కనకమ్మ, మాశెట్టి రాధమ్మలకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
కూలి బతుకులపై పిడుగు
వెదురూరు(చాపాడు):ఓ వైపు పెనుగాలులు.. మరోవైపు భారీ వర్షం.. ఇంకో వైపు ఉరుములు.. మెరుపులు.. ఇంతలో ఉన్నట్లుండి పొలాల్లో పెద్ద శబ్దంతో పిడుగుపాటు.. కళ్లు మూసి తెరిచేలోగా పొలాల్లో పనులు చేసుకుంటున్న తల్లీకూతుళ్లు మాడి మసై పోయారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం వెదురూరు గ్రామానికి చెందిన చౌటపల్లె హుస్సేన్ పీరా భార్య చౌటపల్లె ఖాసీంబీ(33), కూతురు ఆయీషా(18)లు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు గురై మృతి చెందారు. ఖాజీపేట మండల మిడుతూరు రెవెన్యూ పొలంలో వెదురూరు గ్రామానికి చెందిన ఇక్బాల్ అనే రైతు పసుపు పంట సాగు చేశాడు. పసుపు నూర్పిళ్ల పనులకు వెదురూరు మహిళా కూలీలు వెళ్లారు. పనులు చేస్తున్న క్రమంలో సాయంత్రం 4.30గంటలకు భారీ వర్షంతో పెనుగాలులు వీచాయి. వీటి ధాటికి తట్టుకోలేక సమీపంలోని షెడ్డులోకి కూలీలందరూ వచ్చారు. వీరిలో ఖాసీంబీ, అయీషాలతో పాటు ముబీన్, శశి అనే కూలీలు వస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో ఆయీషాపై పిడుగు పడింది. దీని ధాటికి ఆయీషాతో పాటు పక్కనే ఉన్న తల్లి ఖాసీంబీ అక్కడికక్కడే మృతి చెందగా, ముబీన్, శశిలు స్పృహ తప్పి పడిపోయారు. అప్పటికే ఘటన గుర్తించి మిగిలిన కూలీలు సంఘటన స్థలంలోకి వెళ్లి స్పృహ తప్పిన వారికి సహాయక చర్యలు అందించారు. విషయం తెలుసుకున్న వెదురూరు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఖాసీంబీ భర్త కుటుంబ పోషణలో నిర్లక్ష్యంగా ఉండటంతో తల్లి కూతుళ్లే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఖాసీంబీకీ మాబుషరీష్(12), మహబూబ్‌బాషా(8) అనే కుమారులు ఉన్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, తహసీల్దారు, పోలీసులు పిడుగు పాటుకు గురై తల్లికూతుళ్లు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు తహసీల్దారు పార్వతి, రూరల్ సీఐ హనుమంత్‌నాయక్‌లు స్పందిం చి సహాయక చర్యలు అందించారు. ఘటనపై విచారణ జరిపి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అధికారులకు సూచించారు. -
అనుమానాస్పదంగా తల్లీ, కుమార్తె మృతి
మందస: శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని ఉద్దాన ప్రాంతమైన దుమ్మువాళ్లూరు గ్రామానికి చెందిన పందిరి స్వాతి, ఆమె నాలుగు నెలల కుమార్తె అనుమా నాస్పదంగా మృతి చెందారు. స్వాతికి సోంపేట మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన గేదెల మనోజ్‌కు ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. బీటెక్ పూర్తి చేసిన పందిరి స్వాతిని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గేదెల మనోజ్‌తో 2017వ సంవత్సరంలో వివాహం చేశారు. వృత్తిరీత్యా బెంగళూరులో మనోజ్ ఉండడంతో స్వాతి కూడా బెంగళూరు వెళ్లింది. వీరిద్దరికి నాలుగు నెలల చిన్నారి జశ్విత ఉంది. అయితే ఏమైందో ఏమో కానీ సోమవారం రాత్రి స్వాతి తన కుమార్తెను గొంతు నులిమి చంపేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. ముందుగా చిన్నారి మరణించిందని సమాచారం రావడంతో స్వాతి కుటుం బ సభ్యులు హుటాహుటీన బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడకు చేరుకున్న వారికి స్వాతి కూడా మరణించిందని తెలియడంతో వారంతా ఈ సమాచారాన్ని గ్రామంలోని బంధువులకు తెలియజేశారు. స్వాతి అనా రోగ్య కారణాల రీత్యా ఆత్మహత్య చేసుకుందా.. లేక ఇతర ఏమైనా కారణా లున్నాయా.. తెలియరావడంలేదు. కా గా, స్వాతి ప్రసవం సమయంలో అనా రోగ్యం వెంటాడడంతో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. అదే జరిగితే చిన్నారిని ఆమె హత్య చేసిందా.. లేక ఏం జరిగిందన్న విషయాలు పూర్తిస్థాయిలో తెలియడంలేదు. బెంగళూరులోనే మృతదేహాల కు పోస్టుమార్టం జరిగిందని అక్కడకు వెళ్లిన వారు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. మిస్టరీగా మారిన ఈ సం ఘటన స్థానికంగా విషాదం నింపింది. -
కూతురి చెంతకే కన్నతల్లి
జి.కొండూరు (మైలవరం): మైలవరం శివారులోని దర్గా సమీపంలో జాతీయరహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సేగిరెడ్డిపాడు గ్రామానికి చెందిన మందా రాజేశ్వరి (19) అక్కడికక్కడే మృతి చెందగా ఆమె తల్లి మందా రూతమ్మ (40) విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచింది. తల్లీకూతురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల వేదనలు మిన్నంటాయి. మృతదేహాలు సందర్శించిన గ్రామస్థులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. రూతమ్మ, రాజేశ్వరి మృతదేహాలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. మండల పరిషత్ అధ్యక్షుడు వేములకొండ తిరుపతిరావు, పార్టీ మండల కన్వీనర్ మందా జక్రధరరావు (జక్రి), తదితర నాయకులు నివాళులర్పించారు. -
కూతురు ఇక లేదని..
ఒంగోలు: విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. చిన్నప్పుడే తండ్రిని, నేడు తల్లిని కూడా కోల్పోయిన మనుమరాలి పరిస్థితిని తలుచుకుని రోదిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర సంఘటన స్థానిక మంగమూరు రోడ్డులోని ఒంగోలు పబ్లిక్ స్కూలు ఎదురుగా సోమవారం ఉదయం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం ఫెర్రీ బోల్తా పడిన ఘటనలో దేవభక్తుని లీలావతి(50) మృతి చెందారు. ఈమె మృతదేహం ఆదివారం రాత్రి ఇంటికి చేరుకుంది. కూతురు ఇక లేదని రోదిస్తూ తల్లి రాయపాటి లక్ష్మీకాంతమ్మ(77) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. వీరి స్వగ్రామం టంగుటూరు మండలం పొందూరు కాగా ఒంగోలులో నివాసం ఉంటున్నారు. మద్దిపాడు మండలం కొలచనకోటకు చెందిన దేవభక్తుని సుబ్బారావుతో లీలావతికి వివాహమైంది. సుబ్బారావు తెలంగాణలోని పాల్వంచలో ఫెర్రస్ అండ్ అల్లాయ్స్ కంపెనీలో పనిచేస్తూ క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. లీలావతి తన ఒక్కగానొక్క కుమార్తె మనస్వినిని చదివించుకునేందుకు పల్లవ గ్రానైట్స్‌లో 15 ఏళ్లుగా క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం మనస్విని తమిళనాడులోని విట్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదువుతోంది. తన అక్క కొడుకు ఇప్పటికే స్టేట్స్లో ఉండటంతో ఎలాగైనా కుమార్తెను కూడా స్టేట్స్కు పంపాలని లీలావతి భావించింది. కానీ ఇంతలోనే మృత్యువు ఆమెను బలితీసుకుంది. లక్ష్మీకాంతమ్మ ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాన్ని చూసి ఆమె బంధువు స్పృహ తప్పి పడిపోయాడు. తక్షణ వైద్య సాయం అందించడంతో ఆయన కోలుకున్నాడు. విదేశాల్లో ఉన్న అక్క కొడుకు వచ్చిన తర్వాత, మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు నిర్ణయించారు. తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేత బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావుతోపాటు కలెక్టర్ వాడరేవు వినయ్‌చంద్, ఎస్పీ సత్య యేసుబాబు లీలావతి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖ నుంచి తక్షణసాయంగా రూ.50 వేల నగదును మనస్వినికి అందించారు. చంద్రన్న బీమా పథకంలో సభ్యులుగా ఉన్నారో లేదో తెలియదనడంతో ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా కూడా తక్షణమే తెప్పించేందుకు అంటూ పలు కాగితాలపై మనస్వినితో రెవెన్యూ అధికారులు సంతకాలు చేయించుకున్నారు. -
కుటుంబ కలహాలకు తల్లీకూతురు బలి
మామునూరు: భర్త పట్టించుకోకపోవడం.. అత్త, ఆడబిడ్డ వేధింపులు, కుటుంబ కలహాలతో మనోవేదనకు గురైన ఓ వివాహిత ఇద్దరు కూతుళ్లతో పాటు తనపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి, చిన్న కూతురు మృతిచెందారు. పెద్ద కూతురు గాయాలతో బయటపడింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లికి చెందిన భవానీ (25), భూమ శివశంకర్ (27)లు దంపతులు. శివశంకర్ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. వీరికి అమృత వర్షిణి(3), మౌనిక వర్షిణి (18 నెలల) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నాళ్లుగా శివశంకర్ మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు అత్త, అడబిడ్డ సూటిపోటిమాటలతో భవానీ తీవ్ర మనస్తాపా నికి గురైంది. దీంతో ఆదివారం రాత్రి తన ఇద్దరు బిడ్డలు సహా తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొంది. మృతురాలి పెదకుమార్తె అమృత వర్షిణి చిన్నపాటి కాలిన గాయాలతో బయటికిరాగా, తల్లి భవానీ, చిన్నకూతురు మౌనిక వర్షిణి(14 నెలలు) 80శాతం కాలిపోయారు. స్థానికులు వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ఆ తల్లి, బిడ్డలు చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఇద్దరూ మృతిచెందారు. -
రైలు కింద పడి తల్లీకూతుళ్ల మృతి
చుండూరు(గుంటూరు): కుటుంబకలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి సుస్మిత(35), కూతురు(5) మృతి చెందగా.. కుమారుడు(3) తీవ్రగాయాల పాలయ్యాడు. అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుంటూరు జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లిలో బుధవారం అర్దరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు సుస్మిత(35)ది హైదరాబాద్ కాగా, ఆమె భర్త గుజరాత్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
తల్లీకూతుళ్లపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
-
తల్లీకూతుళ్లపై నుంచి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పైన ఉన్న తల్లికూతుళ్లు కిందపడ్డారు. ఆ వెనకనే వస్తున్న ఆర్టీసీ బస్సు వారిపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లికూతుళ్లు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం వారి మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాగు ఒడ్డునే పురుడు:తల్లీబిడ్డ మృతి
వరంగల్: గ్రామాలలో వైద్య సదుపాయం లేక అనేక మంది చనిపోతున్నారు. ఈ రోజు కూడా అటువంటి సంఘటనే వరంగల్ జిల్లాలో జరిగింది. వైద్యం అందుబాటులో లేకపోవడంతో నిండు గర్భిణి బహిరంగ ప్రదేశంలోనే ప్రసవించింది. తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందారు. వరంగల్ జిల్లా గోవిందరావుపేట-ముత్తాపురం మధ్య దెయ్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నిండు గర్భిణి అయిన రాజేశ్వరికి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళుతున్నారు. మధ్యలో వాగు ఉద్ధృతంగా ఉంది. వారు వాగు దాటలేకపోయారు. ఆమె వాగు ఒడ్డునే పురుడు పోసుకుంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తల్లితోపాటు అప్పుడే పుట్టిన ఆడపిల్ల కూడా మృతి చెందింది. -
మెదక్ జిల్లాలో తల్లీకూతురు సజీవ దహనం
మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్ పేటలో అగ్నిప్రమాదం సంభవించింది. గుడిసెకు నిప్పంటుకొని తల్లీకూతురు సజీవ దహనమైయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకునే సరికే తల్లీకూతురు సజీవ దహనమైయ్యారు. తల్లీకూతురు మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా ఆ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు స్థానికులను విచారిస్తున్నారు.