
జి.కొండూరు (మైలవరం): మైలవరం శివారులోని దర్గా సమీపంలో జాతీయరహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సేగిరెడ్డిపాడు గ్రామానికి చెందిన మందా రాజేశ్వరి (19) అక్కడికక్కడే మృతి చెందగా ఆమె తల్లి మందా రూతమ్మ (40) విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచింది. తల్లీకూతురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల వేదనలు మిన్నంటాయి.
మృతదేహాలు సందర్శించిన గ్రామస్థులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. రూతమ్మ, రాజేశ్వరి మృతదేహాలను వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. మండల పరిషత్ అధ్యక్షుడు వేములకొండ తిరుపతిరావు, పార్టీ మండల కన్వీనర్ మందా జక్రధరరావు (జక్రి), తదితర నాయకులు నివాళులర్పించారు.