
కారు సీట్లో ఇరుక్కుపోయిన ఉదయప్రసాద్ మృతదేహం, హరిఉదయప్రసాద్ (ఫైల్)
సాక్షి, ఇబ్రహీంపట్నం(విజయవాడ) : వారం రోజల క్రితం భార్య పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో, కూతురును తొలిసారిగా చూసుకునేందుకు ఆతృతగా వస్తున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాను డ్రైవ్ చేసుకుంటూ వస్తూ వేరే వాహనాన్ని ఢీకొని కారు పల్టీకొట్టడంతో దుర్మరణం పాలయ్యాడు. ఇబ్రహీంపట్నం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌లోని కర్ణాటక బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న భవానీపురానికి చెందిన ఒమ్మి హరి ఉదయప్రసాద్ యాదవ్ (28) చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. బ్యాంకుకు శని, ఆదివారం సెలవులు రావటంతో ఉదయప్రసాద్ యాదవ్ తన కారులో శుక్రవారం ఇంటికి బయలు దేరాడు. మార్గమధ్యలో ముగ్గురు ప్రయాణికులను కూడా కారులో ఎక్కించుకున్నాడు. ఇబ్రహీంపట్నం సమీపంలోకి వచ్చే సమయానికి కారు గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి రోడ్డుపక్కన పల్టీ కొట్టింది.
ఈ ఘటనలో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఉదయప్రసాద్ యాదవ్ తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పక్క సీట్లో ఉన్న విశాఖపట్నంకు చెందిన కొడగల మునీంద్ర తలకు బలమైన గాయమైంది. వెనక సీట్లో కూర్చున్న అక్కిరెడ్డి శేఖర్ (విశాఖపట్నం), బెజ్జం నాగరాజు (గుంటూరు)కు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం విజయవాడ వైద్యశాలకు తరలించారు. మృతుడికి ఏడాది క్రితం వివాహమైంది. భార్య వారం రోజుల క్రితం ఆడ పిల్లకు జన్మనిచ్చింది. భార్య, కుమార్తెను చూసేందుకు వస్తుండగా ఉదయప్రసాద్ యాదవ్ మృత్యువాతకు గురి కావటంతో ఆ ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment