ఒంగోలు: విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. చిన్నప్పుడే తండ్రిని, నేడు తల్లిని కూడా కోల్పోయిన మనుమరాలి పరిస్థితిని తలుచుకుని రోదిస్తూ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర సంఘటన స్థానిక మంగమూరు రోడ్డులోని ఒంగోలు పబ్లిక్ స్కూలు ఎదురుగా సోమవారం ఉదయం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం ఫెర్రీ బోల్తా పడిన ఘటనలో దేవభక్తుని లీలావతి(50) మృతి చెందారు. ఈమె మృతదేహం ఆదివారం రాత్రి ఇంటికి చేరుకుంది. కూతురు ఇక లేదని రోదిస్తూ తల్లి రాయపాటి లక్ష్మీకాంతమ్మ(77) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. వీరి స్వగ్రామం టంగుటూరు మండలం పొందూరు కాగా ఒంగోలులో నివాసం ఉంటున్నారు. మద్దిపాడు మండలం కొలచనకోటకు చెందిన దేవభక్తుని సుబ్బారావుతో లీలావతికి వివాహమైంది.
సుబ్బారావు తెలంగాణలోని పాల్వంచలో ఫెర్రస్ అండ్ అల్లాయ్స్ కంపెనీలో పనిచేస్తూ క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. లీలావతి తన ఒక్కగానొక్క కుమార్తె మనస్వినిని చదివించుకునేందుకు పల్లవ గ్రానైట్స్‌లో 15 ఏళ్లుగా క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం మనస్విని తమిళనాడులోని విట్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదువుతోంది. తన అక్క కొడుకు ఇప్పటికే స్టేట్స్‌లో ఉండటంతో ఎలాగైనా కుమార్తెను కూడా స్టేట్స్‌కు పంపాలని లీలావతి భావించింది. కానీ ఇంతలోనే మృత్యువు ఆమెను బలితీసుకుంది. లక్ష్మీకాంతమ్మ ఒక్కసారిగా కుప్పకూలిన దృశ్యాన్ని చూసి ఆమె బంధువు స్పృహ తప్పి పడిపోయాడు. తక్షణ వైద్య సాయం అందించడంతో ఆయన కోలుకున్నాడు. విదేశాల్లో ఉన్న అక్క కొడుకు వచ్చిన తర్వాత, మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు నిర్ణయించారు.
తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేత
బోటు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావుతోపాటు కలెక్టర్ వాడరేవు వినయ్‌చంద్, ఎస్పీ సత్య యేసుబాబు లీలావతి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖ నుంచి తక్షణసాయంగా రూ.50 వేల నగదును మనస్వినికి అందించారు. చంద్రన్న బీమా పథకంలో సభ్యులుగా ఉన్నారో లేదో తెలియదనడంతో ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా కూడా తక్షణమే తెప్పించేందుకు అంటూ పలు కాగితాలపై మనస్వినితో రెవెన్యూ అధికారులు సంతకాలు చేయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment