తల్లిదండ్రులు దూరమైన బిడ్డలు.. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు.. ఆత్మీయులను పోగొట్టుకున్న అభాగ్యులు.. పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో దయనీయ గాథ. మూడు రోజులుగా ఎటు చూసినా మనసును కలచివేసే దృశ్యాలే. ఆదివారం కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం మృతుల కుటుంబాలకు గుండె కోతను మిగిల్చింది. బాధిత కుటుంబసభ్యుల రోదనలు ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు. గుండెలవిసేలా విలపిస్తున్న వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యపడటం లేదు. మృతుల బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ విషాదఛాయలు తొలగిపోలేదు. ఈ గాయం మానడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ప్రమాదం నుంచి బయటపడిన వారు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: బోటు ప్రమాద దుర్ఘటన నుంచి ప్రకాశం జిల్లా ఇంకా తేరుకోలేదు. కృష్ణానదిలో ఆదివారం జరిగిన దుర్ఘటనలో మొత్తం 22 మంది మరణించగా జిల్లాకు చెందిన 18 మంది మృత్యువాతపడ్డారు. అధిక శాతం మంది ఒంగోలు నగరవాసులే కావడం గమనార్హం. కుటుంబ సభ్యులను పోగొట్టుకొన్న కుటుంబాలు శోకసంద్రంలోనే ఉండిపోయాయి. మృతుల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. మూడో రోజు కూడా ఎంగిలిపడలేక వేదనతో కుమిలిపోతున్నారు.
అందరినీ పోగొట్టుకొని..
ఒంగోలు పబ్లిక్ స్కూలు ప్రాంతానికి చెందిన లీలావతి యాత్రకు వెళ్లారు. బోటు ప్రమాదంలో నీట మునిగి చనిపోయింది. కూతురు మృతదేహాన్ని చూసి ఆమె తల్లి లక్ష్మీకాంతమ్మ గుండె ఆగి మరణించింది. తండ్రి చిన్నప్పుడే మరణించాడు. తల్లి లీలావతి ప్రమాదంలో మృతి చెందింది. తల్లిని చూసిన తల్లడిల్లిన అమ్మమ్మ చనిపోయింది. ఒంటరిగా మిగిలిన లీలావతి కూతురు మనస్విని ఆవేదన వర్ణనాతీతం. గుండె పగిలేలా విలపిస్తోంది. ఆమెను ఓదార్చడం సాధ్యపడటం లేదు.
ఆ బిడ్డ అందరినీ పోగొట్టుకున్నాడు..
గద్దలగుంటకు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి కళ్లగుంట ఆంజ నేయులు, ఆయన సతీమణి వెంకాయమ్మలు ఇద్దరు ప్రమాద ఘటనలో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా ఒక కుమారుడు ఇప్పటికే మరణించాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న మిగిలిన ఒక్క కుమారుడి బాధ వర్ణనాతీతం.
తోడు పోయి... అంతా శూన్యమై...
గాంధీరోడ్డు బొందిలివీధికి చెందిన పెండ్యాల శ్రీనివాసరావు భార్య సుజాతతో కలిసి బోటు ప్రమాదంలో చిక్కుకున్నారు. మత్స్యకారులు రక్షించడంతో తాను బతికి బయటపడ్డాడు. భార్య చనిపోయింది. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు భార్యను పోగొట్టుకున్న తన బతుక్కి అర్థం లేదని, పగవాడికీ ఇలాంట బాధ వద్దంటూ ఆవేదన చెందుతున్నాడు. దాదాపు మృతుల కుటుంబాలు అన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ప్రమాదం నుంచి బయటపడిన వారు జరిగిన ఘటన తలుచుకొని భీతిల్లుతున్నారు. ఒంగోలు వాకర్స్ క్లబ్ ప్రమాద దుర్ఘటన నుంచి బయటపడలేకపోతోంది. రోజూ కలిసి నడిచే స్నేహితులు, హితులు, సన్నిహితులు కనిపించకుండాపోవడం వారిని కలచివేస్తోంది.
కొవ్వొత్తుల ర్యాలీలు..
బోటు ప్రమాద మృతులకు నివాళులర్పిస్తూ మంగళవారం రాత్రి పలువురు నాయకులు, వాకర్స్ క్లబ్ సభ్యులు కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శనలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment