ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలోని గద్దలగుంట రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న నున్నా కృష్ణమూర్తి ఇంట్లో విషాదం అలముకుంది. కృష్ణా నదిలో ఆదివారం నాటి బోటు ప్రమాదంలో కృష్ణమూర్తి పెంపుడు కుమారుడు కోసూరి రిషిత్‌రాయ్(14) మృతి చెందాడు. రిషిత్‌రాయ్‌ను పెంచుకుంటున్న నున్నా కృష్ణమూర్తి, వాణి దంపతులు కూడా యాత్రకు వెళ్లారు. బోటులో వెళ్లేందుకు ఖాళీ లేకపోవడంతో కృష్ణమూర్తి దంపతులు ఒడ్డున ఉండిపోయారు. బోటులో వెళ్తానని రిషిత్‌రాయ్ మారాం చేయడంతో.. కృష్ణమూర్తి బాల్య స్నేహితుడైన న్యాయవాది జెట్టి ప్రభాకరరెడ్డి తనతో తీసుకెళ్తానని చెప్పారు. బోటు బోల్తా పడిన ఘటనలో రిషిత్‌రాయ్ ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో కృష్ణమూర్తి కుటుంబంతోపాటు రిషిత్‌రాయ్ కుటుంబంలో విషాదం అలముకుంది. కోసూరి రిషిత్‌రాయ్ కృష్ణమూర్తి తోడల్లుడి కుమారుడు. రిషిత్రాయ్ తండ్రి మృతి చెందడంతో కృష్ణమూర్తి దంపతులు పెంచుకుంటున్నారు. ఒంగోలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో రిషిత్ ఏడో తరగతి చదువుతున్నాడు. రిషిత్‌రాయ్ తల్లితోపాటు కుటుంబ సభ్యులు వేటపాలెంలో ఉంటున్నారు. కృష్ణమూర్తి ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. కృష్ణమూర్తికి ముగ్గురు కుమార్తెలు కాగా అందరికీ వివాహం చేశారు. తండ్రి లేని బిడ్డ అని, తనకూ మగబిడ్డ లేడన్న బాధ తీరుతుందన్న ఉద్దేశంతో రిషిత్‌ను పెంచుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment