పిడుగు పాటుకు గురై మృతిచెందిన తల్లీకూతుళ్ల మృత దేహాల వద్ద గుమికూడిన జనం
వెదురూరు(చాపాడు):ఓ వైపు పెనుగాలులు.. మరోవైపు భారీ వర్షం.. ఇంకో వైపు ఉరుములు.. మెరుపులు.. ఇంతలో ఉన్నట్లుండి పొలాల్లో పెద్ద శబ్దంతో పిడుగుపాటు.. కళ్లు మూసి తెరిచేలోగా పొలాల్లో పనులు చేసుకుంటున్న తల్లీకూతుళ్లు మాడి మసై పోయారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చాపాడు మండలం వెదురూరు గ్రామానికి చెందిన చౌటపల్లె హుస్సేన్ పీరా భార్య చౌటపల్లె ఖాసీంబీ(33), కూతురు ఆయీషా(18)లు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంలో పిడుగు పాటుకు గురై మృతి చెందారు. ఖాజీపేట మండల మిడుతూరు రెవెన్యూ పొలంలో వెదురూరు గ్రామానికి చెందిన ఇక్బాల్ అనే రైతు పసుపు పంట సాగు చేశాడు. పసుపు నూర్పిళ్ల పనులకు వెదురూరు మహిళా కూలీలు వెళ్లారు.
పనులు చేస్తున్న క్రమంలో సాయంత్రం 4.30గంటలకు భారీ వర్షంతో పెనుగాలులు వీచాయి. వీటి ధాటికి తట్టుకోలేక సమీపంలోని షెడ్డులోకి కూలీలందరూ వచ్చారు. వీరిలో ఖాసీంబీ, అయీషాలతో పాటు ముబీన్, శశి అనే కూలీలు వస్తున్నారు. ఇంతలో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో ఆయీషాపై పిడుగు పడింది. దీని ధాటికి ఆయీషాతో పాటు పక్కనే ఉన్న తల్లి ఖాసీంబీ అక్కడికక్కడే మృతి చెందగా, ముబీన్, శశిలు స్పృహ తప్పి పడిపోయారు. అప్పటికే ఘటన గుర్తించి మిగిలిన కూలీలు సంఘటన స్థలంలోకి వెళ్లి స్పృహ తప్పిన వారికి సహాయక చర్యలు అందించారు. విషయం తెలుసుకున్న వెదురూరు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఖాసీంబీ భర్త కుటుంబ పోషణలో నిర్లక్ష్యంగా ఉండటంతో తల్లి కూతుళ్లే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఖాసీంబీకీ మాబుషరీష్(12), మహబూబ్‌బాషా(8) అనే కుమారులు ఉన్నారు.
సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, తహసీల్దారు, పోలీసులు
పిడుగు పాటుకు గురై తల్లికూతుళ్లు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు తహసీల్దారు పార్వతి, రూరల్ సీఐ హనుమంత్‌నాయక్‌లు స్పందిం చి సహాయక చర్యలు అందించారు. ఘటనపై విచారణ జరిపి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment