కర్నూలు : కల్లూరు ఎస్టేట్‌లోని జీఎస్‌ఎస్ కాలనీలో నివాసముంటున్న రహంతుల్లా భార్య షేక్ రేష్మా (22) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నంద్యాల జిల్లా డోన్ పట్టణం శ్రీనివాసనగర్‌కు చెందిన నూర్ అహ్మద్, మున్ని దంపతులకు ముగ్గురు కూతుర్లు సంతానం. పెద్ద కూతురు షేక్ రేష్మాను కల్లూరు ఎస్టేట్‌లో నివాసముంటున్న రహంతుల్లాకు ఇచ్చి గత ఏడాది అక్టోబర్‌లో వివాహం జరిపించారు. పెళ్లి సందర్భంగా రూ.4 లక్షలు కట్నం, 20 తులాల బంగారం, ఇతర వస్తువులు కానుకలుగా ఇచ్చారు.
భర్త రహంతుల్లా హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. భార్యను తల్లి దగ్గర ఉంచి వారానికి ఒకసారి కల్లూరుకు వచ్చి వెళ్లేవాడు. కొన్నాళ్లు సంసారం సాఫీగా సాగింది. చిన్నచిన్న కారణాలు చూపి అత్త ఫాతిమా, ఆడపడుచు ముస్కాన్, ఆమె భర్త జావెద్ వేధింపులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పుకుని రేష్మ బాధ పడేది. ఇటీవల బట్టలు పెట్టినప్పుడు మర్యాద ఇవ్వలేదని భర్త వేధిస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో వారు పంచాయితీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో సర్దిచెప్పారు.
అయినప్పటికీ వేధింపులు తగ్గకపోవడంతో సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు కనుగొని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. భర్తతో పాటు అత్త, ఆడపడుచు, ఆమె భర్త జావిద్‌ల వేధింపులు తట్టుకోలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి నూర్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment