LOTTERRY
-
పెళ్లిరోజు గిఫ్ట్‌తో రూ.8.2 కోట్లు సంపాదించిన భార్య
పెళ్లిరోజున భర్త ఇచ్చిన డబ్బుతో భార్య ఏకంగా రూ.8.2 కోట్లు సంపాదించిన ఆసక్తికర సంఘటన దుబాయ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్‌కు చెందిన పాయల్ అనే మహిళ తన భర్త హర్నెక్ సింగ్‌తో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఇటీవల వారి 16వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భర్త పాయల్‌కు బహుమతిగా 1000 ధిరమ్‌లు(రూ.22వేలు) ఇచ్చారు.ఆ డబ్బుతో పాయల్ 3337 అనే రాఫిల్ టికెట్‌ను కొనుగోలు చేశారు. తాజాగా ఆ లాటరీ టికెట్‌పై జాక్‌పాట్ తగిలింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ (డీడీఎఫ్) మిలీనియం మిలియనీర్ సిరీస్ 461లో పాయల్ 1 మిలియన్ డాలర్ల(రూ.8.2 కోట్లు)ను గెలుచుకున్నారు.ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ..‘నేను ఈ సిరీస్‌లో విజేతగా మారడానికి నా భర్త ఇచ్చిన డబ్బే కారణం. ఏప్రిల్ 20న మా 16వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నాకు 1,000 ధిరమ్‌లు గిఫ్ట్ ఇచ్చారు. ఆ డబ్బుతో ఆన్లైన్లో డీడీఎఫ్ టిక్కెట్ కొనాలని అనుకున్నాను. 3 అనే అంకె ఎక్కువసార్లు వచ్చే లాటరీ నంబర్‌ను ఎంచుకున్నాను. దాంతో 3337ను సెలక్ట్ చేసుకున్నాను. ఈ లాటరీ పొందడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ వార్తను నాభర్తతో ఫోన్లో చెప్పినపుడు తనకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నాకు 14 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కవల పిల్లలు. ఇంకా వారికి వార్త తెలియదు. ఇంటికి వెళ్లాక చెప్తాను. నా పిల్లల భవిష్యత్తు నాకుముఖ్యం. ఈ డబ్బుతో వారికి మంది విద్యను అందిస్తాను’ అని ఓ మీడియా సంస్థతో చెప్పారు.గత పన్నెండేళ్లుగా పాయల్ డీడీఎఫ్ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నారని మీడియా సంస్థ తెలిపింది. ప్రతిసారి ప్రయాణాల నిమిత్తం ఎయిర్పోర్ట్ వెళ్తున్నపుడు డీడీఎఫ్ టికెట్లు కొనుగోలు చేయడం అలవాటని పాయల్ చెప్పారు. కానీ ఈసారి మొదటగా ఆన్లైన్లో ఖరీదు చేశానన్నారు. -
లాటరీలో రూ.కోటికి పైగా ప్రైజ్‌మనీ: ఆ టికెట్ నకిలీదట!
శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫిబ్రవరి 8న తీసుకున్న టికెట్‌కు రూ.కోటీ పాతిక లక్షల ప్రైజ్‌మనీ తగిలినట్లు డ్రా ఫలితాల్లో వచ్చింది. అయితే, ఆ టికెట్ తాము విక్రయించలేదని సదరు వ్యాపారి చెప్పేశాడు. అసలా టికెట్టే నకిలీ అని తేల్చి పారేశారు. లాటరీ డబ్బును ఇచ్చేది లేదని మొండికేశాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీసులకు, గత ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపాలని డీఎస్పీ మహేంద్రను ఆదేశించారు. కొన్నాళ్లు అంతర్గత విచారణ చేపట్టి ఒకే రోజు నగరంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేసేసరికి లాటరీల గుట్టు రట్టయ్యింది. చెప్పాలంటే ఇదొక పెద్ద రాకెట్. – సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ఒక్కసారిగా లక్షాధికారి కావాలనే ఆశతో పేద, బడుగు వర్గాలకు చెందిన ప్రజలు లాటరీలకు బానిసలుగా మారుతున్నారు. నిత్యం లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ నష్టాల్లో కూరుకుపోతున్నారు. బోడోల్యాండ్, తమిళనాడు, కేరళ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, గోవాలతో పాటు ఇతర దేశాలైన భూటాన్, నేపాల్ టికెట్లు విక్రయిస్తుంటారు. వాటిపై మన రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగానే విక్రయాలు చేస్తున్నారు. శ్రీకాకుళం కేంద్రంగా చేసుకుని కొందరు వ్యాపారులు ఈ దందాను మూడు పూలు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి టికెట్లు సరఫరా చేస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాల్లోని ఏజెంట్లకు ముందస్తుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ రూపంలో చెల్లించి ఆ కంపెనీల లాటరీ టికెట్లను బల్క్‌లో తెప్పించుకుంటున్నారు. విక్రయించిన వాటిలో లాటరీ ప్రైజ్‌మనీ తగలగానే రెండో రోజు వ్యాపారి ఖాతాలో నగదు జమ అవుతుంది. అందులో 5 నుంచి 10 శాతం వ్యాపారి తీసుకుని, మిగిలిన మొత్తాన్ని లాటరీ తగిలిన వ్యక్తికి అందజేస్తున్నారు. టిక్కెట్ల విక్రయాల దగ్గర నుంచి నగదు పంపిణీ వరకు ఒక ప్రణాళికా బద్ధంగా చేపడుతున్నారు. వ్యూహాత్మకంగా నకిలీ లాటరీలు.. ఇతర రాష్ట్రాల లాటరీల ముసుగులో నకిలీ లాటరీలు కూడా నడుపుతున్నారు. సొంతంగా వెబ్సైట్ తయారు చేసుకుని, పలు పేర్లతో లాటరీ టికెట్లు ముద్రించి విక్రయాలు జరుపుతున్నారు. ఏఆర్ డైమండ్, సిక్కిం డాటా, ఏఆర్ లక్ష్మీ, సిక్కిం సూపర్ తదితర పేర్లతో టిక్కెట్లు ముద్రించి విక్రయిస్తున్నారు. అంతా వ్యూహాత్మకంగానే జరుగుతోంది. ఎవరికెంత ప్రైజ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకుని ఆ మేరకు డ్రా తీస్తారు. తక్కువ మొత్తం ప్రైజ్‌ను టికెట్లు కొనుగోలు చేసినోళ్లకి ప్రకటిస్తారు. ఎక్కువ మొత్తం ప్రైజ్ టికెట్లను తమ వద్దే అట్టి పెట్టుకుని ఉంచుకుంటారు. ఎవరికి అనుమానం రాకుండా లాటరీ విక్రయాలు, డ్రా తీయడం చేస్తారు. కొనుగోలు చేసిన వారికి ప్రైజ్ వస్తున్నట్టుగా విజేతలను ప్రకటిస్తారు. పెద్ద మొత్తంలో ప్రైజ్‌లను తమ వద్ద ఉంచుకుని, చిన్న మొత్తం ప్రైజ్‌లను ప్రకటిస్తారు. ఇక్కడ చదవండి: అమ్మ లేవడం లేదేంటి?.. ఆ చిన్నారుల ప్రశ్నకు కన్నీళ్లు ఆగడం లేదు.. రూ.20 నుంచి రూ.500 వరకు.. మార్కెట్లో విక్రయించే నిషేధిత లాటరీ టికెట్ ఒక్కొక్కటి రూ.20 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. కుయల్, రోసా, తంగం, నల్లనేరమ్, కుమరన్, విష్ణు పేర్లతో లాటరీ టికెట్లు అమ్ముతున్నారు. వీటికి లక్షల్లో, కోట్లలో లాటరీ బహుమతులు ఉన్నట్టు చెప్పి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. బహుమతి తమకే తగులుతుందన్న ఆశతో ప్రజలు నిత్యం టికెట్లు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. పలు కంపెనీల లాటరీలకు సంబంధించి నంబర్లను వ్యాపారులు తెల్ల స్లిప్పులపై రాసి విక్రయిస్తున్నారు. డ్రా తేదీకి వారం ముందు నుంచే విక్రయాలు ప్రారంభిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా ఫలితాలను తెలుసుకుంటున్నారు. ఇదొక పెద్ద రాకెట్.. లాటరీ టికెట్ల వ్యాపారం పెద్ద రాకెట్‌గా నడుస్తోంది. ఇటీవల దొరికిన 16 మందే కాదు...ఆ జాబితా ఇంకా పెద్దదే. ఒక్క శ్రీకాకుళం నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే ముసుగులో నకిలీ లాటరీల చెలామణి కూడా జరుగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టు జిల్లా వ్యాప్తంగా నిఘా పెడితే లాటరీల గుట్టు మరింత బయటపడనుంది. -
లక్కీ హ్యండ్! 20 లాటరీ టికెట్లు.. 20 సార్లూ అదృష్టం!
ఈజిప్ట్: ఒక్కసారి లాటరీ గెలిస్తేనే ఎగిరి గత్తేస్తాం. రెండూ సార్లు గెలిస్తే అబ్బో అదృష్టం అంటే మనదే అంటూ తెగ సంబరపడిపోతాం. కానీ ఏకంగా 20 సార్లు గెలిస్తే ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఎంత అదృష్టం ఉంటే ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. కానీ ఇక్కడొక వ్యక్తి కొనుగోలు చేసిన 20 టికెట్లకి లాటరీ తగిలింది. ఎవరా లక్కీ ఫెలో అని ఎగ్జాయింటింగ్ ఉన్నారా! (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) వివరాల్లోకెళ్లితే....అలెగ్జాండ్రియాకు చెందిన విలియం నెవెల్ వర్జినియాలోని ఓ దుకాణం నుంచి ఆన్లైన్లో 20 ఒకేలాంటి టికెట్లు కొనుగోలు చేశాడు. అయితే నాలుగు టికెట్ల చొప్పున వరుసగా 5, 4, 1, 1 సంఖ్యలను ఎంచుకున్నాడు. ఇక అంతే వర్జినియా లాటరీ అధికారులు లాటరీ తీసిన ప్రతిసారి నెవెల్ కొనుగొలు చేసిన 20 టికెట్లకు 20 సార్లు గెలిచాడు. దీంతో నెవెల్ ప్రతి టికెట్‌కి 5 వేల డాలర్లు చొప్పున మొత్తం1,00,000 డాలర్లు (అంటే రూ.74 లక్షలు) గెలుచుకున్నాడు. ఏది ఏమైనా ఒకటి, రెండు సార్లు కూడా కాదు ఏకంగా 20 సార్లు అతను కొనగోలు చేసిన 20 టికెట్లుకు లాటరీ తగలడం విశేషం. (చదవండి: అది బైక్ ? విమానమా !) -
చిన్నారికి లాటరీ తెచ్చిన అదృష్టం.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఫ్రీ
సాక్షి, ముంబై: వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన జన్యుపరమైన రుగ్మతతో ఎస్ఎంఏ (స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ) తో బాధపడుతున్న చిన్నారికి అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. రానున్న రెండో పుట్టిన రోజు సందర్భంగా ఆ పసిబిడ్డకు పునర్జన్మ లభించింది. ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన 16 కోట్ల ఇంజెక్షన్ ఉచితంగా లభించడంతో చిన్నారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదీ అమెరికా సంస్థనుంచి ఈ అవకాశాన్ని దక్కించుకున్న ఇండియాలో తొలి చిన్నారిగా నిలిచాడని పేర్కొన్నారు. వివరాలను పరిశీలిస్తే..మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శివరాజ్ దావరే ఎస్ఎంఏ బారిన పడ్డాడు. ప్రాథమిక నిర్ధారణ అనంతరం శివరాజన్ ప్రాణాలను కాపాడటానికి ‘జోల్గెన్స్మా’ (జీన్ రీప్లేస్మెంట్ థెరపీ) ఇంజెక్షన్ అవసరమని ముంబైలోని హిందూజా ఆసుపత్రికి న్యూరాలజిస్ట్ డాక్టర్ బ్రజేష్ ఉదాని తేల్చి చెప్పారు. ఈ అరుదైన వ్యాధి చికిత్సలో కీలకమైన, అతి ఖరీదైన ఇంజెక్షన్ ఎలా సాధించాలో తెలియక మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన శివరాజ్ తండ్రి విశాల్, తల్లి కిరణ్ తీవ్ర ఆవేదన చెందారు. ఈ క్రమంలో క్లినికల్ ట్రయల్స్ నిమిత్తం అమెరికాకు చెందిన సంస్థ లాటరీ ద్వారా ఈ ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇస్తుందని, అందుకు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ ఉదాని సూచించారు. ఉదాని సలహా మేరకు విశాల్ ఉచిత ఇంజక్షన్కోసం ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ డిసెంబర్ 25, 2020 న శివరాజ్ ఇంజెక్షన్ పొందడానికి లక్కీ డ్రాలో ఎంపికయ్యాడు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 19 న, శివరాజ్‌కు హిందూజా ఆసుపత్రిలో ఇంజక్షన్ ఇచ్చారు. వైద్యుల ప్రకారం ఎస్ఎంఏ అనేది జన్యుపరమైన వ్యాధి. ప్రతి 10వేల మందిలో ఒకరు ఈ వ్యాధితో పడుతున్నారు. ఈ జన్యు లోపం పిల్లల కదలికలను నిరోధిస్తుంది. కండరాలు పని తీరును, మెదడు కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది క్రమంగా పిల్లల మరణానికి దారితీస్తుంది. ప్రస్తుతం దీనికి అందుబాటులో ఉన్న చికిత్స ప్రపంచంలోనే అతి ఖరీదైన జోల్జెన్స్మా ఇంజెక్షన్ మాత్రమే. అదీ రెండేళ్లలోపు ఈ చికిత్స అందించాలి. భారత్‌లో దొరకని ఆ ఇంజెక్షన్‌ను అమెరికా నుంచి మాత్రమే తెప్పించాలి. ఇందుకు సుమారు 16 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. -
ఏమా అదృష్టం..! 8 కోట్ల లాటరీ పోయి దొరికింది
వాషింగ్టన్: లాటరీ తగలడం మమూలు విషయం కాదు. వేలల్లో, లక్షల్లో ఉండే పోటీ దారుల్లో మనకు అదృష్టం వరించినట్టు. ముఖ్యంగా చిన్నా చితకా లాటరీ అయితే, విశేషం ఏమీ ఉండదు. కానీ కోట్ల రూపాయల లాటరీ తగలడం మాత్రం పెద్ద విశేషమే. అయితే, ఆ తగిలిన లాటరీ టికెట్ ఎక్కడో పోగొట్టుకుని, తిరిగి పొందడం మాత్రం లక్కే. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. ఓ వ్యక్తి లాటరీలో 1.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.67 కోట్లు) గెలుచుకొని టికెట్ పోగొట్టుకున్నాడు. అదృష్టం బాగుండి పోయిన టికెట్ దొరికింది. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని టేనస్సీ రాష్ట్రానికి చెందిన నిక్ స్లాటెన్ (31) మార్చి 10న గ్రాసరీ స్టోర్‌లో లాటరీ టికెట్ కొన్నాడు. మరుసటి రోజు ఉదయం... స్లాటెన్ తీసుకున్న టిక్కెట్టు లాటరీలో ఎంపికైంది. తాను గెలుచుకున్న లాటరీ టికెటు నగదు బహుమతిని తీసుకెళ్దామనే లోపు, నిక్ టిక్కెట్ కనిపించకుండా పోయింది. దీంతో నిక్ నిరాశలో మునిగిపోయాడు. అదృష్టం ఇలా తలుపు తట్టినట్టే తట్టి అలా వెళ్లిపోయిందని బాధపడ్డాడు. టికెట్ కోసం ఇళ్లంతా వెతికినా లాభం లేకపోయింది. కానీ అతని లక్కు కాసేపటికే కంటపడింది. పోగొట్టుకున్న లాటరీ టికెట్.. అదృష్టంకొద్ది తాను వెళ్లేదారిలో దొరికింది. దీంతో నిక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా ఒక్క రోజు వ్యవధిలోనే జరిగింది. మనది అని రాసి పెట్టి ఉండాలే గానీ, దక్కక మానదు అనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. (చదవండి: అమెరికా: సూపర్ మార్కెట్లో కాల్పులు..10 మంది మృతి) -
మద్యం షాపులకు ‘వేలం’వెర్రి
ఏలూరు అర్బన్ : నగరంలో శుక్రవారం జిల్లాలోని మద్యం షాపులకు సంబం«ధించి ఎక్సైజ్ శాఖ నిర్వహించిన వేలం పాట జాతరను తలపించింది. రానున్న రెండేళ్ల కాలానికి సంబంధించి గతంలో అమలు చేసిన మద్యం పాలసీకి భిన్నంగా ప్రభుత్వం తాజాగా వేలం నిర్వహణకు ఆదేశాలిచ్చింది. వ్యాపారులు తాము దక్కించుకున్న దుకాణాన్ని మండలం, నగర పంచాయతీ, మునిసిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో ఎక్కడైనా నిర్వహించుకునేందుకు అనుమతించింది. దీంతో వ్యాపారులు దుకాణాలు దక్కించుకునేందుకు భారీగా పోటీ పడ్డారు. ఒక వ్యాపారి కనీసం రెండుకు మించి దుకాణాలకు నాలుగు నుంచి ఐదు దరఖాస్తులు పెట్టుకోవడంతో ఎక్సైజ్‌శాఖకు దరఖాస్తుల రూపేణా భారీ ఆదాయం సమకూరింది. జిల్లాలో 474 షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా ఏలూరు యూనిట్‌లోని 236 షాపులకు 5,762 దరఖాస్తులు రాగా వాటి ద్వారా రూ.35.54 కోట్లు, భీమవరం యూనిట్‌లోని 238 షాపులకు గాను 237 షాపులకు 3,706 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.21 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో గడిచిన 30వ తేదీన వెరిఫికేషన్ పూర్తి చేసుకుని వ్యాపారులు లాటరీకి అనుమతి పొందారు. శుక్రవారం స్థానిక వట్లూరు పంచాయతీ పరిధిలోని శ్రీ కన్వెన్షన్ హాలులో ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన లాటరీ కార్యక్రమానికి వీరంతా హాజరయ్యారు. ఎక్సైజ్‌శాఖతో పాటు రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రారంభమైన లాటరీ కార్యక్రమాన్ని జేసీ షరీఫ్ ప్రారంభించగా అనంతరం డీఆర్వో కె.హైమవతి కొనసాగించారు. ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ వైబీ భాస్కరరావు, ఏలూరు భీమవరం యూనిట్ల సూపరింటెండెంట్లు వై.శ్రీనివాసచౌదరి, కె.శ్రీనివాస్ పర్యవేక్షించారు. లాటరీ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా పారదర్శకంగా ప్రక్రియ పూర్తి చేసేందుకు డీసీ భాస్కరరావు చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లాటరీ ప్రక్రియనంతా వ్యాపారులు పరిశీలించేలా ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభంకాగా రాత్రి 9 గంటలకు కేవలం నూరు దుకాణాలకు మాత్రమే లాటరీ పూర్తయ్యింది. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ లాటరీని రాత్రి ఏ సమమయానికైనా పూర్తి చేస్తామని వెల్లడించారు. కాగా జిల్లావ్యాప్తంగా మద్యం వ్యాపారులు అనేకమంది కార్లలో తరలిరావడంతో వాటి సంఖ్య వందల సంఖ్య దాటిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు.