un empolyees
-
నకిలీ ఉద్యోగాలు కు c/o సుధాకర్
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో పలాస కేంద్రంగా కార్యాలయం పెట్టి.. రూర్బన్ పేరుతో నకిలీ అపా యింట్మెంట్లు ఇచ్చి, ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖపట్నం సుధాకర్ తెరవెనుక ఉండి పెద్ద కథే నడుపుతున్నాడు. రూర్బన్ పేరుతో జరిగిన మోసాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవ్వడంతో సుధాకర్ అక్రమార్జన కథ అడ్డం తిరిగింది. దీనితో అసలుకే ఎసరు వస్తోందని భావించిన సుధాకర్ కొత్త ఎత్తుగడల్ని సిద్ధం చేసుకున్నాడు. తీగ దొరికినా డొంక కదలకుండా అడ్డుకుంటున్నాడు. విచారణకు దొరక్కుండా ఎత్తులు వేస్తున్నాడు. మీడియాలో రాకుండా మూడో వ్యక్తుల ద్వారా ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. అధికార వర్గాలకు కూడా కొంతమందితో ఫోన్ చేయించి విషయం బయటకు రాకుండా చూడాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ►పలాస, అంబుగాంలోని తన నకిలీ కార్యాలయాల బోర్డులు తీసేశాడు. నకిలీ ఉద్యోగాల జిల్లా కోఆర్డినేటర్‌ను బయటకు కనిపించకుండా దాచిపెట్టాడు. ►విచారణ ముందుకు సాగనీయకుండా తనదైన శైలిలో రెండురోజులుగా జిల్లాలో తిష్ట వేసి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ►నకిలీ అపాయింట్మెంట్లు పొందిన నిరుద్యోగుల్ని అంతర్గతంగా బెదిరింపులకు గురి చేయడంతో వారు నేరుగా ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నారు. అక్రమమని తెలిసినా... జిల్లాలో నకిలీ అపాయింట్మెంట్లతో నిరుద్యోగులను మోసగిస్తున్న సుధాకర్ గురించి యంత్రాంగం తూతూమంత్రంగానే వ్యవహరిస్తోంది. సాక్షాత్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ నేరుగా నకిలీ అపాయింట్మెంట్లు జారీ అవుతున్నాయని నోట్ విడుదల చేశారు. మరో వైపు పాలకొండ పోలీస్ స్టేషన్లో అక్కడి ఎంపీడీఓ ఫిర్యాదు కూడా చేశారు. పలాస కేంద్రంగా వ్యవహారాలు నడుపతున్నట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. అక్కడ కార్యాలయంలో రూర్బన్ మిషన్‌కు సంబంధించిన మెటీరియల్ పోలీసులకు కనిపించింది. ఇన్ని ఉన్నా విచారణ మాత్రం ముందుకు సాగడం లేదు. ►పోలీసుల వద్ద సుధాకర్ నంబర్ ఉన్నా ట్రేస్ చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సందేహాలెన్నో.. ఈ నకిలీ బాగోతం వెనుక ఏమీ లేనప్పుడు అక్కడి కార్యాలయాల్లో రూర్బన్ మిషన్, కేంద్ర గ్రామీణ అభి వృద్ధిశాఖ బోర్డులు వంటివి ఎందుకు ఉన్నట్లు.. అక్కడి ఉద్యోగులు ఏం చేస్తున్నారో.. అధికారులు తెలుసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ►నకిలీ అపాయింట్మెంట్ పొందిన నిరుద్యోగులు నేరుగా ఫిర్యాదు చేయలేదనే ఒకే ఒక్క కారణంగా అధికారులు ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. అంబుగాం, పలాసలో బోర్డులు కూడా తీసేయడంతో నిరుద్యోగులు నిండా మునిగినట్లు కనిపిస్తోంది. ►పలాసలో పోలీసులు కొంతమందిని విచారించారు. విచారణ తూతూ మంత్రంగా సాగినట్లు సమాచారం. గతంలో మోసాలివే... ►మూడేళ్ల క్రితం రాజాం, తాలాడ, మందరాడ కేంద్రాలుగా ఓ యువకుడు ఇండీట్రేడ్ పేరుతో షేర్‌మార్కెట్ పెట్టి, రూ.లక్షకు ప్రతి నెలా రూ.10 వేల అధిక ఆదాయాన్ని చూపించి వందలాదిమందిని నమ్మించాడు. తొలుత ఈ యువకునిపై ఒకరిద్దరు ఫిర్యాదులు చేసిన అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ►ఏడాదిన్నర క్రితం పొందూరులో ఓ వ్యాపారి మినీ స్కీమ్ పేరుతో పెద్ద స్కామ్‌కే తెరలేపాడు. వస్తువు ధరలో 33 శాతం చెల్లిస్తే చాలు నెలరోజుల్లో ఆ వస్తువు ఇస్తామని నమ్మబలికాడు. 300 మందిని చేర్పించుకుని రూ.కోటి వరకూ వసూలయ్యాక రాత్రికిరాత్రే బోర్డు తిప్పేశాడు. అధికారులు పట్టించుకోలేదు. నేరుగా ఫిర్యాదు రాలేదని వదిలేశారు. ►తాజాగా రూర్బన్ మిషన్ పేరుతో సుధాకర్ నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చి నిరుద్యోగుల్ని మోసగించాడు. జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోంది. నేరుగా బాధితుల ఫిర్యాదు లేదని పట్టించుకోని పరిస్థితి. ఫలితంగా వేలాదిమంది నిరుద్యోగులు, పేదలు నష్టపోతున్నారు. కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు తప్పించుకు తిరుగుతున్నారు. ఇకనైనా అధికారులు ఇలాంటి ఘటనలపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. -
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా
సాక్షి, విజయవాడ : సీఆర్డీఏ పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించి ఉద్యోగాల పేరుతో ఒక యువకుడు నిరుద్యోగులకు టోకరా వేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే .. నిందితుడు ప్రకాశం జిల్లాకు చెందినవాడు. సీఆర్డీఏ పేరుతో నకిలీ వెబ్సైట్ రూపొందించి నిరుద్యోగులకు విజయవాడలో ఫేక్ ఇంటర్యూలు నిర్వహించాడు. అయితే యువకుడి మీద అనుమానం వచ్చిన నిరుద్యోగులు సీఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిందితుడు రూపొందించిన వెబ్‌సైట్‌ను పరిశీలించగా అది నకిలీ వెబ్‌సైట్‌గా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరారీలో ఉన్న యువకుడి మీద కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
రాజధానిలో నిరుద్యోగుల ఆందోళన
అమరావతి: ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై నిరుద్యోగులు రాజధాని అమరావతిలో ఆందోళనకు దిగారు. తాడేపల్లి గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద నిరుద్యోగ యువకులు ధర్నా నిర్వహించారు. గిరిజనశాఖలో పోస్టుల భర్తీ, ప్రిన్సిపాల్ నియామకాల్లో అక్రమాలపై ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎంక్వైరీ వేయడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఉన్నతాధికారి బదిలీ అయిపోయినా డీపీసీ మీటింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గురుకులాల ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీల్లో కూడా భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. కొత్త అధికారి జాయిన్ అయ్యే లోపు పోస్టులను బదిలీ అయిపోయిన అధికారి భర్తీ చేస్తున్నారని నిరుద్యోగులు వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. -
చదివింది పది.. ఐటీఉద్యోగిగా బిల్డప్
రాంగోపాల్‌పేట్ : ఆదాయపన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసి రూ. కోటి వసూలు చేసిన కేసులో నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.లక్ష నగదు, బాండ్ పేపర్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ రాధాకిషన్‌రావు, సెంట్రల్ జోన్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ఉప్పుగూడకు చెందిన గంగాధర సతీష్‌కుమార్ పదవ తరగతి వరకు చదివి నిరుద్యోగిగా ఉన్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇన్‌ట్యాక్స్ కార్యాలయంలో ఉద్యోగిగా పని చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేసేందుకు పథకం పన్నిన అతను ఆదాయ పన్ను శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, జూనియర్ ట్యాక్స్ అసిస్టెంట్, సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్‌తో పాటు అటెండర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించేవాడు. ఉద్యోగాన్ని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.3లక్షల వరకు లంచంగా ఇవ్వాలని చెబుతూ అడ్వాన్స్‌గా రూ. లక్ష వసూలు చేసేవాడు. 2014 నుంచి ఇలా దాదాపు 80 మందికి పైగా నిరుద్యోగుల నుంచి రూ. కోటి వరకు వసూలు చేశాడు. కార్యాలయానికి తీసుకుని వెళ్లి నిరుద్యోగులను నమ్మించేందుకు సతీష్‌కుమార్ వారిని బషీర్‌బాగ్‌లోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి తీసుకుని వెళ్లేవాడు. తాను కార్యాలయం లోపలికి వెళ్లి కొద్ది సేపు తిరిగి వచ్చి అధికారులతో మాట్లాడి వచ్చినట్లు బిల్డప్ ఇచ్చేవాడు. త్వరలోనే మీ పని అయిపోతుందని నమ్మించేవాడు. డబ్బు తీసుకున్న తర్వాత వారికి 6 డిజిట్స్ నంబర్ ఇచ్చి మీ ఉద్యోగాలు ఖాయమని చెప్పేవాడు. ఉద్యోగం రాకపోతే ఈ నెంబర్ చెబితే డబ్బులు తిరిగివస్తాయని నమ్మించేవాడు. ఎవరైనా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే కొత్త వారిని బుట్టలో వేసుకుని వారి ద్వారా బాధితుల అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేయించేవాడు. మరికొందరికి రూ.20 బాండ్లపై రాసి ఇచ్చేవాడు. బాధితుల్లో కొందరు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం నిందితుడు సతీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. అతడిని తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎస్సై తిమ్మప్ప, సిబ్బందిని డీసీపీ అభినందించారు. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నిందితుడిపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సనత్‌నగర్, నగర కమిషనరేట్ పరిధిలోని సైఫాబాద్, చాదర్ఘట్, షాలిబండ, చత్రినాక, ఫలక్‌నుమ, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు తెలిపారు. నిరుద్యోగులు మోసపోవద్దు ఎవరైనా లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే నమ్మవద్దని డీసీపీ రాధాకిష్రావు సూచించారు. ఏ ఉద్యోగమైనా పరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక జరుగుతుందన్నారు. ఎవరైనా మోసాలకు పాల్పడితే తమ దృష్టికి తేవాలని సూచించారు. -
విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఎర వేసి.. ఆపై
హైదరాబాద్: విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. అలా మోసం చేసిన ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కోటిన్నర రికవరీ చేశారు. 240 మంది నిరుద్యోగుల నుంచి రెండున్నర కోట్ల రూపాయలు అక్రమంగా వసూళ్లు చేసినట్లు తెలిపారు. వివరాలివి.. ఎర్రగడ్డలోని సన్ రైజ్ అండ్ ట్రావెల్స్ పేరుతో కన్సల్టెన్సీ కార్యాలయాన్ని నిందితులు శ్రీధర్‌రెడ్డి, బస్వ జగన్నాధం నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు. కెనడాలో జాబ్స్ ఉన్నాయంటూ కొంతమంది నిరుద్యోగుల నుంచి లక్ష 20 వేల రూపాయలు వసూళ్లు చేసి తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసా ఇప్పించారు. నెలలు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోయేసరికి మోసం జరిగిందని గ్రహించి నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుల బాగోతం వెలుగులోకి వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ్ పత్రికలలో ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను ఆకర్శించినట్లు విచారణలో వెల్లడైంది. ఖరీదైన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ముందుగా నమ్మకం కోసం తక్కువ మొత్తంలో నగదు వసూళ్లు చేశారు. నకిలీ కంపెనీ పేరుతో ఆఫర్ లెటర్ ఇచ్చి వసూళ్లకు పాల్పడ్డారు. ఇదే విధంగా కెనడా, జార్జియా, మలేసియా తదితర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎర వేశారు. కేసు నమోదు చేసిన పోలీసులను నిందితులను రిమాండ్‌కు తరలించారు. -
రేపు కాయర్ బోర్డులో జాబ్‌మేళా
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : ఈ నెల 12వ తేదీన రాజమహేంద్రవరం – ధవళేశ్వరం రోడ్డులో ఉన్న కాయర్ బోర్డులో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్.మల్లిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని షైన్‌డోవ్ కంపెనీలో ఫొటోషాప్ డిజైనర్ (డిగ్రీ పాస్, ఫొటోషాప్‌లో అనుభవం), కస్టమర్ కేర్ (డిగ్రీ పాస్); ఇన్వెన్సిస్ టెక్నాలజీలో డేటా ప్రాసెస్ (డిగ్రీ పాస్, నిమిషానికి 25 పదాల టైపింగ్ స్పీడు) పని చేయడానికి 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగిన స్త్రీలు, పురుషులు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్ల నకళ్లు, రేషన్ కార్డుల నకళ్లతో హాజరు కావాలని సూచించారు. వివరాలకు 94413 59873 నంబరులో సంప్రదించాలని కోరారు.