రహదారి కోసం తగాదా | Controversy between Two Groups | Sakshi
Sakshi News home page

రహదారి కోసం తగాదా

Published Tue, May 19 2015 2:58 AM | Last Updated on Sat, Aug 25 2018 5:38 PM

Controversy between Two Groups

 జి.సిగడాం:రహదారి విషయమై ఇరువర్గాల మధ్య తలెత్తిన స్వల్ప వివాదం కొట్లాటకు దారి తీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు, పెంకులతో దాడి చేసుకోవడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని పెంట పంచాయతీ పరిధి దళిత వాడలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు పికెట్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.
 
 వివరాల్లోకి వెళితే..  గ్రామంలో పాత కాలనీకి వెళ్లే రహదారి విషయమై స్థానికుల మధ్య కొద్దిరోజులుగా విభేదాలు ఉన్నాయి. ఈ దారి కేవలం నడవడానికే తప్ప.. ఇతర అవసరాలకు వాడకూడదని కాలనీకి చెందిన వంపూరు కృష్ణయ్య, వంపూరు అసిరయ్యలతోపాటు మరో 30 మంది అడ్డుతగులుతున్నారు. అయితే ఈ దారిపై నాటు బళ్లు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని పొందూరు పాపారావు, టొంపల స్వాములుతోపాటు మరో 15 మంది డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఉదయం కూడా ఇదే విషయమై వీరి మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లు, పెంకులు, కర్రలతో దాడులు చేసుకున్నారు.
 
  ఈ కొట్లాటలో ఒకవర్గానికి చెందిన వంపూరు వెంకటరమణ, గెడ్డాపు లోకేష్, గెడ్డాపు త్రినాథరావు, మరోవర్గానికి చెందిన  పొందూరు సూరయ్య, పొందూరు వెంకయ్య, బిల్లాడ శ్రీనువాసరావు, టొంపల పుష్పలు గాయపడ్డారు. కొట్లాట విష యం స్థానికుల ద్వారా తెలుసుకున్న జి.సిగడాం పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. క్షతగాత్రులను రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గెడ్డాపు త్రినాథరావు, బిల్లాడ శ్రీనివాసరావులను మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు వైద్యులు రిఫర్ చేశారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎస్‌ఐ జి.భాస్కరరావు తెలిపారు.
 
 అల్లర్లు సృష్టిస్తే చర్యలు:సీఐ
 గ్రామాల్లో ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజాం సీఐ ఎం.వి.రమణమూర్తి హెచ్చరించారు. పెంట దళిత వాడలో ఆయన పర్యటించి  పరిస్థితిని సమీక్షాంచారు. దాడులకు ఉపయోగించిన రాళ్లు, పెంకులు, కర్రలను పరిశీలించారు.
  ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరైనా తప్పుడు ఫిర్యాలతో పోలీసులను తప్పుదారి పట్టించాలని చూస్తే సహించమన్నారు. కొత్తవ్యక్తులు సంచరిస్తే వెంటనే తమకు తెలియజేయాలన్నారు. ఆయన వెంట జి.సిగడాం, సంతకవిటి ఎస్సైలు భాస్కరరావు, సురేష్‌బాబు, ఏఎస్‌ఐలు లక్ష్మునాయుడు, శ్రీనివాసులరాజు ఉన్నారు.
 
 పొలీస్ పికెట్ ఏర్పాటు
 ఇరువర్గాల మధ్య కొట్లాట నేపథ్యంలో కాలనీలో పోలీసు పికెట్‌ను అధికారులు ఏర్పాటు చేసినట్టు సీఐ రమణమూర్తి చెప్పారు. ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు, 20 మంది పొలీస్ సిబ్బందిలు విధుల్లో ఉంటారన్నారు. శాంతిభద్రతులు అదుపులోకి వచ్చేవరకు పికెట్ ఉంటుందని స్పష్టం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement