ఫలితం రేపే!  | Tomorrow Results Will Be Announced | Sakshi
Sakshi News home page

ఫలితం రేపే! 

Published Wed, May 22 2019 10:11 AM | Last Updated on Wed, May 22 2019 10:15 AM

Tomorrow Results Will Be Announced  - Sakshi

43 రోజుల ఉత్కంఠకు 24 గంటల్లో తెరపడనుంది. ఎవరు విజేతగా నిలుస్తారో.. ఎవరు పరాజయాన్ని చవిచూస్తారో.. కొన్ని గంటల్లో తేలిపోనుంది. అందుకే యువకుల నుంచి వృద్ధులదాకా.. తోపుడుబండ్ల వ్యాపారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకూ అంతా ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడు 23వ తేదీ వస్తుందా ? ఫలితాలు ఎప్పుడొస్తాయా ? జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ‘ఎగ్జిట్‌పోల్స్‌’తో ఇప్పటికే ఫలితాలపై స్పష్టమైన అవగాహనకు వచ్చినా, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాల వెల్లడికి సాయంత్రం దాకా సమయం పట్టినా     అనధికారికంగా అభ్యర్థుల భవితవ్యం మధ్యాహ్నం ఒంటి గంటకే  తెలిసిపోనుంది. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికల ఫలితాల కోసం యావత్‌ రాష్ట్రం ఎదురుచూస్తోంది. జిల్లాలోనూ కౌంటింగ్‌ టెన్షన్‌ నెలకొంది. రాష్ట్రంలోని 13 జిల్లాల ఫలితాలతో పోలిస్తే అనంతపురం జిల్లా ఫలితాలపై జిల్లావాసులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడ మెజార్టీ సీట్లు ఏ పార్టీ సాధిస్తే ఆ పార్టీనే అధికారం చేపట్టనుంది. పైగా ఈ సారి జిల్లా నుంచి జేసీ దివాకర్‌రెడ్డి, పరిటాల సునీత వారసులు రాజకీయ ఆరంగేట్రం చేయడం.. ముఖ్యమంత్రి బావమరిది నందమూరి బాలకృష్ట ‘పురం’ బరిలో ఉండటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.  
రెండు పార్టీల మధ్య పోటీ 
జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అనంతపురం పార్లమెంట్‌ స్థానం నుంచి 14 మంది, హిందూపురం పార్లమెంట్‌ నుంచి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే 14 అసెంబ్లీస్థానాల నుంచి 163 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే అన్ని స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. ఫలితాలు వెల్లడైతే ఎవరి జాతకం ఎలా ఉండబోతుందనే చర్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో టీడీపీకి చాలా చోట్ల జనసేన అభ్యర్థులు సహకరించగా.. ప్రజాశాంతిపార్టీని అడ్డంపెట్టుకుని టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేర్లుపోలిన వారితోనే నామినేషన్లు దాఖలు చేయించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఈ నెల 19న వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్‌లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనమేనని స్పష్టమైంది. అలాగే అనంతపురంలో 10 నుంచి 12 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగిస్తుందని ‘పోల్స్‌’ స్పష్టం చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అనంత’లో వైఎస్సార్‌సీపీ ఫ్యాన్‌ గాలి బాగా వీచిందని, అందులో పెద్దపెద్ద రాజకీయవటవృక్షాలు నెలకొరిగి కొట్టుకుపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  
పరిటాల కుటుంబానికి తొలి ఓటమి తప్పదా? 
జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది రాప్తాడు ఫలితం గురించే. పరిటాల కుటుంబంపై రెండుసార్లు పోటీచేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మూడోదఫా బరిలో ఉన్నారు. మంత్రి సునీతపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆమె బరిలో ఉంటే ఓటమి తథ్యమని భావించిన టీడీపీ అధిష్టానం... శ్రీరామ్‌ను బరిలో నిలపింది. అయితే ఈ నియోజకవర్గంలో కురుబ, బోయలాంటి ప్రధాన కులాలతో పాటు బీసీలు టీడీపీని కాదని ప్రకాశ్‌రెడ్డి పక్షాన నిలిచినట్లు పోలింగ్‌ సరళి స్పష్టం చేస్తోంది. నియోజకవర్గంలో ఏ పల్లెలో ఏ పదిమందిని పలకరించినా... ఈ దఫా ప్రకాశ్‌ గెలుస్తాడని 10 మందిలో ఏడు మంది చెబుతున్నారు. టీడీపీ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో వారసుడిగా బరిలోకి దిగిన శ్రీరామ్‌కు ఓటమి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఈ కుటుంబానికి తొలిఓటమి ఎదురైనట్లే. 
కీలక స్థానాల్లో కూడా         వైఎస్సార్‌సీపీ హవా 
రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ర్యాంకింగ్‌ ఇస్తే బాలకృష్ణ చివరిస్థానంలో ఉంటారు. ఐదేళ్లు నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించినా...సీఎం చంద్రబాబు నోరు మొదపలేదు. కానీ ‘పురం’ ప్రజలు మాత్రం బాలకృష్ణ పనితీరుపై తీర్పు ఇచ్చినట్లే తెలుస్తోంది. ఇక్కడ కూడా నిజాయతీగల పోలీసు అధికారిగా పేరుపొందిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మహ్మద్‌ ఇక్బాల్‌ పక్షానే ప్రజలు నిలిచినట్లు ‘పోల్స్‌’ స్పష్టం చేస్తున్నాయి. అలాగే టీడీపీ కంచుకోటగా చెప్పుకునే పెనుకొండలో ఈ దఫా బీకే పార్థసారథిని కాదని, సౌమ్యుడైన శంకర్‌నారాయణను ప్రజలు ఆశీర్వదించినట్లు ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ స్పష్టం చేస్తున్నాయి. మంత్రి కాలవ శ్రీనివాసులకు కూడా ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినట్లేనని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.  
మూడోస్థానంలోనే         పీసీసీ చీఫ్‌ రఘువీరా? 
కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యారని ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నా, విజయం మాత్రం వైఎస్సార్‌సీపీనే వరించే అవకాశాలున్నాయి. అలాగే ఉరవకొండ, అనంతపురం, గుంతకల్లు, శింగనమల, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. వైఎస్సార్‌సీపీ గాలి బాగా వీచిందని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే టీడీపీ అభ్యర్థులు మాత్రం లగడపాటి సర్వేపై ఆశపెట్టుకుని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏదిఏమైనా రేపటి మధ్యాహ్నంలోపు అభ్యర్థుల భవితవ్యంతో పాటు వీరిపై రూ.కోట్లలో పందెం కాసిన బెట్టింగ్‌ రాయుళ్ల జాతకం తేలనుంది.  

జేసీ కుటుంబానికి     కోలుకోలేని దెబ్బ 
రాప్తాడు తర్వాత అదేస్థాయిలో ఆసక్తి నెలకొన్న నియోజకవర్గం తాడిపత్రి. ఇక్కడ జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి బరిలో ఉన్నారు, దీంతో పాటు అనంతపురం పార్లమెంట్‌ బరిలో జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌ పోటీలో నిలిచారు. ఈ రెండుస్థానాల్లో కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఓటింగ్‌ జరిగిందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ అంతర్గత సర్వేల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంట్‌లలో 6 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని తేలింది. ఆరుస్థానాల్లో జిల్లాలోని రెండు పార్లమెంట్‌లు లేవు. దీనికి తోడు పోలింగ్‌ సరళి కూడా వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా జరిగింది. జేసీ దివాకర్‌రెడ్డి నోటికి ఏదొస్తే అది మాట్లాడి జనాల్లో చులకన అయ్యారు. తాడిపత్రిలో జేసీ కుటుంబం అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా జనాలు ఓట్లేశారు. దీంతో ఈ దఫా ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ఓటమి తప్పదని తెలుస్తోంది. ఇదే జరిగితే 40 ఏళ్ల జేసీ కుటుంబ రాజకీయ ప్రస్థానానికి ఈ ఎన్నికలతో కాలం చెల్లినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement