
భద్రతకు కోత
► తుళ్లూరుకు మంజూరైన కానిస్టేబుల్ పోస్టుల్లో భారీ తగ్గింపు
► గతంలో మంజూరైన 868 పోస్టులను 398కి తగ్గించిన ఆర్థికశాఖ
► పనిభారంతో పోలీసుల సతమతం
► ఎటూ తేలని పోలీస్ కమిషనరేట్
► పోస్టుల తగ్గింపుపై పోలీస్ ఉన్నతాధికారుల ఆందోళన
పేరుకు రాజధాని నిర్మాణ ప్రాంతం.. భద్రతపై మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదు. తుళ్లూరు మండలంలో రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించి ఏడాదిన్నర దాటుతున్నా నూతన పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటు జరగలేదు. తుళ్లూరుకు 868 కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా వాటిని 398కి పరిమితం చేయడం రాజధాని ప్రాంతంపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. తుళ్లూరును పోలీస్ సబ్‌డివిజన్‌గా చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసి ఏడాది దాటుతున్నా కార్యరూపం దాల్చలేదు.
సాక్షి, గుంటూరు : నిత్యం వీవీఐపీల పర్యటనలు.. ఆందోళనలు.. తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణ పనుల వద్ద వరస సంఘటనల నేపథ్యంలో తుళ్లూరు ప్రాంతంలో పోలీసుల పరిస్థితి గందరగోళంగా మారింది. రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో తుళ్లూరును పోలీస్ సబ్ డివిజన్‌గా మార్చడంతో పాటు, డీఎస్పీ, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, సిబ్బందిని నియమిస్తామంటూ ఏడాది కిందట జీవో కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి నాలుగు నెలల కిందట తుళ్లూరుకు 868 కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ పోస్టులు తక్కువని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్న తరుణంలో తాజాగా ఆర్థిక శాఖ సగానికి పైగా పోస్టులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది.
తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాక ముఖ్యమంత్రి చంద్రబాబు సభలు, సమావేశాలు, శంకుస్థాపనల పేరుతో సుమారు 20 సార్లకు పైగా పర్యటించారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాక ఒక్క నెలలోనే సీఎం మూడు సార్లు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిత్యం ఇక్కడ పర్యటిస్తూనే ఉన్నారు.
అటకెక్కిన ప్రతిపాదనలు
ప్రస్తుతం తుళ్లూరులో ఎస్‌ఐ స్థాయి అధికారితో పాటు, కేవలం 20 మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. జిల్లాలోని మిగతా సబ్ డివిజన్‌ల నుంచి సుమారు 50మంది సిబ్బందిని నిత్యం తుళ్లూరు ప్రాంతంలో ఉంచుతున్నా రు. ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ పోలీసులు సుమారు వంద మంది వరకు అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. రాజధాని ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ కమిషనరేట్‌గా చేయాలంటూ ఏడాదిన్నర కాలంగా అనేక ప్రతిపాదనలు పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందుంచినా రాజకీయజోక్యం కారణంగా కమిషనరేట్ ఏర్పాటు జరగడం లేదు. నూతన పోలీష్‌స్టేషన్‌ల ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి.
మేలుకోకుంటే మరిన్ని ఇబ్బందులు
రాజధాని ప్రాంతం పొలాల్లో రెండు దఫాలుగా జరిగిన పంట దహనం సంఘటనల్లో సైతం అసలు బాధ్యుల ను ఇప్పటి వరకు తేల్చలేకపోయారు. నేరాల దర్యాప్తుపై దృష్టి సారించే స మయం తమకు లేదని, సభలు, స మావేశాలు, పర్యటనలకు బందోబస్తు నిర్వహించేందుకే సరిపోతోందని పోలీసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పోలీసు శాఖ ప్రతిపాదనలపై దృష్టి సారించి భద్రతను కట్టుదిట్టం చేయకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ నిఘా కరువు
రాజధానిగా తుళ్లూరును ప్రకటించాక ఈ ప్రాంతంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియాతో పాటు మావోయిస్టుల సంచారం పెరిగిపోయింది. ఏదో సంఘటన జరిగేంత వరకు పోలీసులకు పూర్తి స్థాయి సమాచారం తెలియడం లేదు. ఇటీవల తాళాయపాలెం గ్రామంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు అన్నపూర్ణ అలియాస్ జ్యోతక్కను ఎస్‌ఐబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ అనేకసార్లు తుళ్లూరు ప్రాంతంలో సంచరించడంతో పాటు, కొంతకాలంగా ఆమె సోదరి ఇంట్లో చికిత్స పొందుతున్నప్పటికీ పోలీసులకు సమాచారం తెలియని పరిస్థితి. ఎస్‌ఐబీ అధికారులు సమాచారం అందించే వరకు ఇక్కడ ఉన్న పోలీసులకు ఆ జాడే తెలియలేదు.