
పేదల భూములకు పరిహారం ఇవ్వరా?
‘అన్నదాతల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. పేదల భూములను లాక్కొని పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు.
♦ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
♦ ఎన్‌పీ కుంటలో భూ బాధితులతో ముఖాముఖి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘అన్నదాతల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. పేదల భూములను లాక్కొని పరిహారం ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారు. నిజంగా ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉందా? పేదవారి భూములంటే చంద్రబాబుకు ఎందుకంత కోపం? భూమిలేని నిరుపేదలను ఆదుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టాలిచ్చారు. సోలార్ ప్లాంట్ కోసం ఈ భూములను చంద్రబాబు ఎన్‌టీపీసీకి అప్పగించారు. సాగునీటి వసతి ఉన్న భూములను లాక్కోవడమే కాకుండా వారికి పరిహారం మంజూరులోనూ పక్షపాతం చూపిస్తున్నారు. పేదల భూములేమైనా మీ అత్తగారి సొత్తా?’’ అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా శనివారం ఆయన కదిరి నియోజకవర్గంలోని నంబులపూల కుంట(ఎన్‌పీ కుంట)లో పర్యటించారు. సోలార్ ప్లాంట్ కోసం భూములను కోల్పోయిన బాధితులతో ముఖాముఖి నిర్వహించారు. పట్టా భూములున్న వారికి ఎంత పరిహారం ఇచ్చారో అసైన్డ్, సాగుదారులకూ అంతే ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ‘ఏళ్ల తరబడి ఆలస్యం చేస్తే ఒప్పుకునేది లేదు. వెంటనే ఇవ్వాలి. చంద్రబాబు చర్మం మందం కాబట్టి, ఆయన మనసు కరగదు. రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే. అప్పుడు అందరికీ చెక్కులు ఇచ్చి తోడుగా ఉంటాం’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ముఖాముఖి అనంతరం సోలార్ ప్లాంట్‌ను పరిశీలించేందుకు జగన్ బయల్దేరగా పోలీసులు అనుమతి నిరాకరించి అడ్డుకున్నారు.