కాపు జాతిని విడదీసే కుట్ర
* ముఖ్యమంత్రి చంద్రబాబుపై ముద్రగడ మండిపాటు
* మాల, మాదిగల మధ్య బాబు పెట్టిన చిచ్చు రగులుతూనే ఉందని వ్యాఖ్య
కిర్లంపూడి: కాపు జాతిని విడదీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉన్న మాల, మాదిగల మధ్య చంద్రబాబు పెట్టిన చిచ్చు ఇప్పటికీ రగులుతోందన్నారు. అలాగే తన దీక్షా సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
కాపు నాయకులతో తనపై ఎదురుదాడి చేయించి, బండబూతులు తిట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు తక్ష ణం విడుదల, దరఖాస్తు చేసుకున్న ఒక్కో అభ్యర్థికి రూ.2 లక్షల రుణం ఇస్తామని హామీలు ఇచ్చారని తెలిపారు. వాటిని అమలు చేస్తారని నమ్మి దీక్ష విరమించానని చెప్పారు. అయితే, రూ.500 కోట్లు విడుదల చేయకపోగా రుణాన్ని రూ.40 వేలకు కుదించారని తెలి పారు. ఈ స్వల్ప మొత్తంతో కాపులు ఏ వ్యాపా రం చేస్తారని ప్రశ్నించారు.
కాపు ఐక్యగర్జనకు ముందు పట్టు వదలకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, కాపుల గౌరవం పెంచాలని తనకు సూచించిన టీడీపీ మంత్రు లు, ఎమ్మెల్యేలు ఇప్పుడు సీఎం మాటలు విని ఎదురుదాడి చేయడం సిగ్గుచేటన్నారు. మంత్రివర్గంలో ఉన్నా కాపు ప్రజాప్రతినిధులను పురుగుల్లా చూస్తున్నారని కొంతమంది తన వద్ద వాపోయారన్నారు. తాను నోరు విప్పితే వారి పదవులు పోతాయని చెప్పారు. చంద్రబాబు అధికార దాహంతో ఎవరిని మోసం చేయటానికైనా వెనకాడరని దుయ్యబట్టారు.
కాపుజాతిని అణగదొక్కేందుకు కాపు నాయకుల్నే పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. చివరి రక్తపు బొట్టు వరకూ జాతి సంక్షేమానికి పాటు పడతానని స్పష్టం చేశారు. వంద కోట్లో, రెండొందల కోట్లో ఇచ్చి మంత్రి పదవిని కొనుక్కున్న అపర కోటీశ్వరుడు నారాయణకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ముద్రగడ జవాబిచ్చారు. రాజధాని పేరుతో రైతుల నోట్లో మట్టికొట్టి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు.