రాయలసీమ అభివృద్ధికి సమరశీల పోరాటం
కర్నూలు(అర్బన్): అధికార పార్టీ దగాకోరు విధానాలకు వ్యతిరేకంగా రాయలసీమ అభివృద్ధికకి సమరశీల పోరాటం నిర్వహిద్దామని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు కె. రామాంజనేయులు, కె. ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభివృద్ధిని అడ్డుకుంటే సహించమన్నారని, అయితే వారు చేసిన అభివృద్ధి ఏమిటీ? ఎవరు అడ్డుకున్నారో తెలియజేయాలని సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలులో నిర్వహించిన ఆగష్టు 15 వేడుకల్లో ఇచ్చిన హామీలను ఏనాడైనా ఆయనను అడిగే ప్రయత్నం చేశారా? అని గఫూర్ కేఈని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు గుండ్రేవుల, పాలహంద్రీ, వేదావతి, హంద్రీనీవా తదితర నీటి ప్రాజెక్టుల ఊసే లేదన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఎయిమ్స్ తరహాలో తీర్చిదిద్దుతామని, కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. అభివృద్ధి మొత్తాన్ని అమరావతిలో కేంద్రీకరిస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని సీమప్రాంతానికి చెందిన అధికారపార్టీ నాయకులను ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి బీజేపీ, టీడీపీ ప్రస్తుతం రూ.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి, నేటి వరకు ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. ప్రజల అవసరాలకు కాకుండా పాలకుల ఆడంబరాలకు నిధులను వాడుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి రూ.12 కోట్లు ఖర్చు చేసి, ఉపయోగించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం తాత్కాలిక రాజధానికి మరో రూ.300 కోట్లు ఖర్చుచేస్తున్నారని ఆరోపించారు.
సీపీఐ రాష్ట్ర నాయకులు బీమలింగప్ప మాట్లాడుతూ ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో సీమ సమాగ్రాభివృద్ధికి ఈ నెల 20 నుంచి మార్చి 5వ తేదీ వరకు బస్సు యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాత్ర 5న కర్నూలుకు చేరుకుంటుందన్నారు. అదే రోజు ముగింపు సభ జరగనుందని, ఈ సభకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి హాజరవుతున్నట్లు చెప్పారు. సమావేశంలో నాయకులు టి. షడ్రక్, గౌస్‌దేశాయ్, రమేష్‌కుమార్, రాధాకృష్ణ, ఎస్ మునెప్ప, లెనిన్‌బాబు, రామాంజనేయులు, సాయిబాబా, రాముడు, అంజిబాబు, ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.