* సగంలో ఆగిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలని కోరిన ఎమ్మెల్యేలు
* కొత్త ఇళ్లు మంజూరు చేద్దామన్న సీఎం..లబ్ధిదారులపైనే 4,000 కోట్ల భారం!
సాక్షి, హైదరాబాద్: గతంలో మంజూరు చేసి సగంలో నిర్మాణం ఆగిపోయిన ఇళ్లకు బిల్లులు చెల్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఇళ్లను మంజూరు చేసి వాటిని వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. మంగళవారం టీడీపీ శాసనసభాపక్ష సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది.
విశ్వసనీయ సమాచారం మేరకు.. నిర్మాణం ఆగిపోయిన ఇళ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరగా.. ఇందుకు సీఎం ససేమిరా అన్నారు. వాటి ప్రస్తావన ఇప్పుడొద్దంటూనే.. గతంలో నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే నిలిచిపోయిన ఇళ్లకు ప్రస్తుతానికి బిల్లులు చెల్లించలేమని చెప్పారు. కొత్త ఇళ్లను మంజూరు చేసి వాటిని వేగంగా పూర్తి చేద్దామని, ఈ విషయమై రెండు మూడురోజుల్లో ఓ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తానని చెప్పారు. తాజాగా ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఇంటి బిల్లులను చెల్లించకూడదని దాదాపుగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రూ.4,000 కోట్ల భారం లబ్ధిదారులపైనే పడే అవకాశం ఉంది.
అదే దూకుడు కొనసాగించండి: శాసనసభలో అదే దూకుడు కొనసాగించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వంపై, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానాల సందర్భంగా చర్చలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. అదే సమయంలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని, వైఎస్ జగన్ సమర్ధవంతంగా ఆయన వాణిని వినిపించలేకపోయారంటూ ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. సభలో పలు అంశాలపై చర్చ సందర్భంగా ఒకరిద్దరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారని, ఇక నుంచి వారు సంయమనంతో వ్యవహరించాలని చెప్పారు.
బీజేపీపై విమర్శలొద్దు: ఎన్‌డీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న బీజేపీపై పార్టీ నేతలు విమర్శలూ చేయొద్దని బాబు చెప్పారు. రాష్ట్రానికి రాబట్టాల్సిన నిధుల విషయంలో కేంద్రం నుంచి, ముఖ్యంగా బీజేపీ సహకారం అవసరమని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ నేతలు వ్యవహరించాలన్నారు. మరోవైపు రాష్ర్టంలోని బీసీ లు, కాపులు పార్టీకి అండగా ఉంటేనే వచ్చే సాధారణ ఎన్నికల్లో నెగ్గుకు రాగలమని చంద్రబాబు చెప్పారు.
ఇళ్ల బిల్లుల చెల్లింపునకు సీఎం ససేమిరా!
Published Wed, Mar 16 2016 3:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement