ముహూర్తం మంచిదేనా?
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పుష్కర స్నానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర స్నాన ముహూర్తంపై చినజీయర్ స్వామిని అడిగితెలుసుకున్నట్లు సమాచారం. తాడేపల్లిలోని చినజీయర్ ఆశ్రమాన్ని గురువారం సీఎం సందర్శించారు. దుర్గాఘాట్‌లో ఉదయం 5.45గంటలకు బాబు పుష్కర స్నానం చేయనున్నారు. ఆ సమయం మంచిదా? కాదా? అని చినజీయర్‌ను అడిగినట్లు తెలిసింది. ఆశ్రమంలో చినజీయర్‌తో పది నిమిషాలు ఏకాంతంగా చర్చించినట్లు సమాచారం. అనంతరం తాడేపల్లిలోని ఆశ్రమాన్ని, వేదవిశ్వవిద్యాలయాన్ని సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి సీఎంను సత్కరించి ఆశీర్వదించి మంగళశాసనాలు అందించారు.
19న లక్షల మందితో సమతాస్నానం..
ఈ నెల 19న చిన జీయర్‌స్వామి లక్ష మంది తో సమతాస్నానం నిర్వహించనున్నారు. దీనికి సీఎం ను ఆహ్వానించినట్లు తెలిసింది. కాగా కృష్ణా జిల్లాలోని అన్ని ఘాట్ల సమాచారం ‘కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్’కు అందుతుందని, అక్కడి నుంచే పుష్కరాలను సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు. దుర్గాఘాట్‌లోని మోడల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.