pushkara bath
-
పుష్కరస్నానానికి వెళ్లి పూజారి మృతి
తూడిచెర్ల(జూపాడుబంగ్లా): ఉదయాన్నే పుష్కరస్నానం చేసేందుకు ఎస్సార్బీసీకి వెళ్లిన ఓ పూజారి నీటిలో మునిగి తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఘటన జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పారుమంచాల గ్రామానికి చెందిన చెంచురామయ్య కుమారుడు ఫణీంద్రశర్మ(22) తూడిచెర్ల శంకరమల్లయ్యస్వామి గుడి వద్ద నివాసం ఉంటున్న అవ్వతాతలు లక్ష్మిదేవి, రామ్మూర్తి వద్ద ఉంటూ వేదపారాయణం చేస్తున్నాడు. సోమవారం ఉదయం పుష్కరస్నానం చేసేందుకు గుడికి సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వ ర్యాంపులోకి దిగాడు. స్నానం ఆచరిస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి లోతుగా ఉన్న కాల్వలో పడి ఊపిరాడక మరణించాడు. కాల్వలో గాలించినా ఫలితం లేకపోవడంతో వెలుగోడు నుంచి గజఈతగాళ్లను రప్పించి వెతికించగా మతదేహంగా బయటపడ్డాడు. ఘటనా స్థలం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
సంగమేశ్వరం.. భక్తి పారవశ్యం
సంగమేశ్వరం(సాక్షి, కర్నూలు): కృష్ణా పుష్కరాల సందర్భంగా సంగమేశ్వర క్షేత్రం భక్తజన సంద్రమైంది. మూడవ రోజు ఆదివారం భక్తుల రద్దీ అధికం కాగా.. ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణం పోటెత్తింది. సప్తనదుల సంగమంలో వెలసిన సంగమేశ్వరం పుష్కర ఘాట్‌లో ఉదయం నుంచే సందడి మొదలయింది. చిత్తూరు, కడప, నంద్యాల, డోన్, ఆదోని, బళ్లారి ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. పుష్కరనగర్ నుంచి ఘాట్ వరకు భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో సైతం రద్దీ కనిపించింది. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించిన ఘటనలు రెండు మూడు చోటు చేసుకున్నాయి. విషయాన్ని జేసీ హరికిరణ్ పోలీసుల దష్టికి తీసుకెళ్లగా.. అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బందిని అప్రమత్తం చేశారు. జేసీ హరికిరణ్ కుటుంబ సమేతంగా లలితాదేవి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కమ్యూనికేషన్స్ ఎస్పీ విజయలక్ష్మి కుటుంబసమేతంగా పుష్కర స్నానం ఆచరించారు. నంద్యాల జడ్జి ప్రియదర్శిని సైతం పుష్కర స్నానం ఆచరించి.. ఉమామహేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంగమేశ్వరాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంగమేశ్వర క్షేత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఉదయం 9.30 గంటలకు క్షేత్రానికి చేరుకున్న ఆయన పుష్కర ఘాట్‌కు వెళ్లి పుణ్యస్నానం ఆచరించి.. పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. ఎగువనున్న ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జేసీ హరికిరణ్ ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు ఆయన పుష్కర భక్తులతో మాట్లాడుతూ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల చేదు అనుభవం నేపథ్యంలో కృష్ణా పుష్కరాలు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పుష్కర అనుభూతిపై భక్తుల నుంచి 20 అంశాలపై అభిప్రాయ సేకరణ జరుగుతోందన్నారు. వీటిని క్రోడీకరించి జాయింట్ కలెక్టర్, అదనపు ఎస్పీలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో 2020లో తుంగభద్ర పుష్కరాలను నిర్వహిద్దామన్నారు. అక్కడి నుంచి టూరిజం బోటు ద్వారా నందికొట్కూరు టీడీపీ ఇన్చార్జి శివానంద్రెడ్డితో కలిసి నెహ్రూనగర్ పుష్కర ఘాట్‌కు బయలుదేరి వెళ్లారు. బోటులో విహరించిన కలెక్టర్ సాయంత్రం సంగమేశ్వరానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఏర్పాట్లపై జేసీ హరికిరణ్‌తో చర్చించారు. అనంతరం ఆయన కుటుంబసమేతంగా బోటులో షికారు చేసి కృష్ణమ్మ అందాలను వీక్షించారు. -
వైఎస్ జగన్ పుష్కర స్నానం రేపు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 13న విజయవాడలో స్నానమాచరిస్తారని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వాస్తవానికి శుక్రవారం పుష్కర స్నానం చేయాలని జగన్ భావించారని, అయితే తొలిరోజు కావడంతో ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో శనివారానికి మార్చుకున్నార ని వివరించారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా జరగాలని, వీటి ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతా శుభం జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. -
ముహూర్తం మంచిదేనా?
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పుష్కర స్నానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర స్నాన ముహూర్తంపై చినజీయర్ స్వామిని అడిగితెలుసుకున్నట్లు సమాచారం. తాడేపల్లిలోని చినజీయర్ ఆశ్రమాన్ని గురువారం సీఎం సందర్శించారు. దుర్గాఘాట్‌లో ఉదయం 5.45గంటలకు బాబు పుష్కర స్నానం చేయనున్నారు. ఆ సమయం మంచిదా? కాదా? అని చినజీయర్‌ను అడిగినట్లు తెలిసింది. ఆశ్రమంలో చినజీయర్‌తో పది నిమిషాలు ఏకాంతంగా చర్చించినట్లు సమాచారం. అనంతరం తాడేపల్లిలోని ఆశ్రమాన్ని, వేదవిశ్వవిద్యాలయాన్ని సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి సీఎంను సత్కరించి ఆశీర్వదించి మంగళశాసనాలు అందించారు. 19న లక్షల మందితో సమతాస్నానం.. ఈ నెల 19న చిన జీయర్‌స్వామి లక్ష మంది తో సమతాస్నానం నిర్వహించనున్నారు. దీనికి సీఎం ను ఆహ్వానించినట్లు తెలిసింది. కాగా కృష్ణా జిల్లాలోని అన్ని ఘాట్ల సమాచారం ‘కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్’కు అందుతుందని, అక్కడి నుంచే పుష్కరాలను సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు. దుర్గాఘాట్‌లోని మోడల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. -
బిరా బిరా కృష్ణమ్మ..!
బిరబిరా కృష్ణమ్మ పరుగు లిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొర్లుతాయి అని శంకరంబాడి సుందరాచారి ఏనాడో చెప్పారు. అది నాటికి నేటికి రుజువు అవుతూనే ఉంది. కృష్ణవేణి పుష్కరాల్లో పుణ్న స్నానమాచరించి సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ రిడ్జ్ పాఠశాల డ్రాయింగ్ మాస్టర్ గీచిన చిత్రమిది. – కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) -
గోదావరిలో పుష్కర స్నానాలు
ఏటూరునాగారం : శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మండలంలోని రామన్నగూడెం గోదావరి పుష్కరఘాట్ వద్ద భక్తులు శనివారం అంత్య పుష్కరస్నానాలు ఆచరించారు. తొలుత మహిళలు గోదావరి నదిలో పసుపు, కుంకుమలు చల్లారు. అనంతరం స్నానాలు ఆచరించి పిల్లాపాపలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. తర్వాత గోదావరి ఒడ్డున ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ పితృదేవతల పేరిట పిండ ప్రదానాలు చేశారు. పెరుగుతున్న గోదావరి నీటి మట్టం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం 7.18 మీటర్ల వరకు పెరిగింది. శుక్రవారం కొద్దిగా తగ్గినప్పటికీ శనివారం నుంచి గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వరద మరింత చేరడంతో గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వరదను పరిశీలించిన తహసీల్దార్ రామన్నగూడెం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టాన్ని స్థానిక తహసీల్దార్ నరేందర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఘాట్ వద్ద ఉన్న నీటి మట్టం కొలతలను పరిశీలించి వీఆర్వోలకు పలు సూచనలు ఇచ్చారు. లోతట్టు గ్రామాల ప్రజలకు గోదావరి వరద పెరుగుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలన్నారు. కాగా, వరద ఉధృతి కారణంగా రాంనగర్‌కు వెళ్లే లోలెవల్ కాజ్‌వేపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాజ్‌వేపై నుంచి వెళ్లేందుకు వెంటనే పడవ ఏర్పాటు చేయాలని తహసీల్దార్.. సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆర్ఐ సర్వర్‌పాషా, వీఆర్వోలు అర్రెం నర్సయ్య, రాములు, వీఆర్ఏ కృష్ణ ఉన్నారు. -
కుక్కకు పుష్కర స్నానం!!
-
పుష్కర స్నానమాచరించిన న్యాయమూర్తులు
తూర్పుగోదావరి (రాజమండ్రి) : రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో శనివారం పలువురు న్యాయమూర్తులు పుష్కర స్నానాలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్‌మిశ్రా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోంస్లేలు పుష్కర స్నానాలాచరించారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, ఏపీ ట్రిబ్యునల్ కోర్టు న్యాయమూర్తి ఎల్.రవిబాబుతోపాటు పలు జిల్లాల జడ్జిలు కూడా పుష్కర స్నానాలు చేశారు. అనంతరం తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు చేశారు. -
మొదలైన గోదావరి పుష్కరాలు
తూర్పుగోదావరి: రాజమండ్రి గోదావరి తీరంలో మరో సిద్ధాంతి వీరభద్ర దైవజ్ఞ గణాంకాల ప్రకారం మంగళవారం నుంచి పుష్కరాలు మొదలయ్యాయి. శ్రీశైల ఆస్థాన సిద్దాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ గణాంకాల ప్రకారం ఇవాళ ఉదయం ఏడున్నర గంటలకు గురుడు సింహరాశిలో ప్రవేశించడంతో పుష్కరాలు ప్రారంభమవుతాయని నిర్థారించారు. సూర్యసిద్ధాంతం ఆధారంగానే నిర్ణయించిన ఈ సమయంలో రాజమండ్రి పుష్కరఘాట్‌లో బుట్టే సిద్ధాంతితోపాటు పలువురు భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తాము నిర్ధారించిన సమయమే శాస్త్రోక్తమని తెలిపారు.