సంగమేశ్వరం.. భక్తి పారవశ్యం
సంగమేశ్వరం.. భక్తి పారవశ్యం
Published Sun, Aug 14 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
సంగమేశ్వరం(సాక్షి, కర్నూలు):
కృష్ణా పుష్కరాల సందర్భంగా సంగమేశ్వర క్షేత్రం భక్తజన సంద్రమైంది. మూడవ రోజు ఆదివారం భక్తుల రద్దీ అధికం కాగా.. ఉమామహేశ్వర ఆలయ ప్రాంగణం పోటెత్తింది. సప్తనదుల సంగమంలో వెలసిన సంగమేశ్వరం పుష్కర ఘాట్‌లో ఉదయం నుంచే సందడి మొదలయింది. చిత్తూరు, కడప, నంద్యాల, డోన్, ఆదోని, బళ్లారి ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ నేపథ్యంలో పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. పుష్కరనగర్ నుంచి ఘాట్ వరకు భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో సైతం రద్దీ కనిపించింది. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శించిన ఘటనలు రెండు మూడు చోటు చేసుకున్నాయి. విషయాన్ని జేసీ హరికిరణ్ పోలీసుల దష్టికి తీసుకెళ్లగా.. అదనపు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బందిని అప్రమత్తం చేశారు. జేసీ హరికిరణ్ కుటుంబ సమేతంగా లలితాదేవి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. కమ్యూనికేషన్స్ ఎస్పీ విజయలక్ష్మి కుటుంబసమేతంగా పుష్కర స్నానం ఆచరించారు. నంద్యాల జడ్జి ప్రియదర్శిని సైతం పుష్కర స్నానం ఆచరించి.. ఉమామహేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
సంగమేశ్వరాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి..
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంగమేశ్వర క్షేత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఉదయం 9.30 గంటలకు క్షేత్రానికి చేరుకున్న ఆయన పుష్కర ఘాట్‌కు వెళ్లి పుణ్యస్నానం ఆచరించి.. పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. ఎగువనున్న ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జేసీ హరికిరణ్ ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు ఆయన పుష్కర భక్తులతో మాట్లాడుతూ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల చేదు అనుభవం నేపథ్యంలో కృష్ణా పుష్కరాలు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పుష్కర అనుభూతిపై భక్తుల నుంచి 20 అంశాలపై అభిప్రాయ సేకరణ జరుగుతోందన్నారు. వీటిని క్రోడీకరించి జాయింట్ కలెక్టర్, అదనపు ఎస్పీలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో 2020లో తుంగభద్ర పుష్కరాలను నిర్వహిద్దామన్నారు. అక్కడి నుంచి టూరిజం బోటు ద్వారా నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి శివానంద్‌రెడ్డితో కలిసి నెహ్రూనగర్ పుష్కర ఘాట్‌కు బయలుదేరి వెళ్లారు.
బోటులో విహరించిన కలెక్టర్
సాయంత్రం సంగమేశ్వరానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఏర్పాట్లపై జేసీ హరికిరణ్‌తో చర్చించారు. అనంతరం ఆయన కుటుంబసమేతంగా బోటులో షికారు చేసి కృష్ణమ్మ అందాలను వీక్షించారు.
Advertisement