సంగమేశ్వరం.. పుష్కర ప్రభంజనం
సంగమేశ్వరం.. పుష్కర ప్రభంజనం
Published Sun, Aug 21 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
– ఎండ తీవ్రతతో అవస్థలు
– 4 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
– ఉచిత బస్సులు చాలక కాలినడక
సంగమేశ్వరం(ఆత్మకూరు): కృష్ణా పుష్కరాల్లో భాగంగా పదవ రోజు ఆదివారం సంగమేశ్వర క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. మరో రెండు రోజులే సమయం ఉండటం.. సెలవు దినం కావడంతో సుమారు అరలక్షకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. వేకువజామున 6 గంటల నుంచే సంగమేశ్వరం, లలితాదేవి పుష్కర ఘాట్ల వద్ద రద్దీ కనిపించింది. ఘాట్ల వద్ద నీటి మట్టం తగ్గుముఖం పట్టినా.. భక్తుల రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది. భక్తులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో సంగమేశ్వరం, కపిలేశ్వరం, పాతమాడుగుల వరకు కృష్ణా బ్యాక్ వాటర్‌లో భక్తులు ఎక్కడపడితే అక్కడ పుణ్యస్నానం చేశారు. సంగమేశ్వరం చేరుకోవాలంటే వందల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలను దాటుకొని వెళ్లడం అసాధ్యం కావడంతో ఇలా కానిచ్చేశారు. ఎలాంటి భద్రత లేని చోట్ల భక్తులు పుణ్య స్నానం ఆచరించడం కాస్త ఆందోళనకు కారణమయింది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కారణంగా భక్తులు సంగమేశ్వర క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
భారీగా స్తంభించిన ట్రాఫిక్
పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పార్కింగ్ స్థలం చాలకపోవడంతో రహదారి వెంట ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేయడం సమస్యకు దారితీసింది. అధికారులు లింగాపురం, మాడుగుల గ్రామాల వద్దే పలు వాహనాలను నిలిపివేయించినా ఫలితం లేకపోయింది. కపిలేశ్వరం నుంచి పాత మాడుగుల గ్రామ సమీపంలోని లింగమయ్య ఆలయం వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆత్మకూరు నుంచి సంగమేశ్వరానికి 45 కిలోమీటర్ల దూరం కాగా.. గంటర్నర సమయంలో క్షేత్రం చేరుకోవాల్సి ఉంది. అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా భక్తులు క్షేత్రం చేరుకునేందుకు 4 గంటల పాటు ప్రయాణించాల్సి వచ్చింది.
భక్తుల ఇక్కట్లు
ట్రాఫిక్ సమస్యకు తోడు ఎండ తీవ్రతతో భక్తులు చుక్కలు చూడాల్సి వచ్చింది. ఉచిత భస్సులు సరిపడక.. కపిలేశ్వరం నుంచి చాలా మంది భక్తులు నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సి రావడంతో ఇబ్బంది పడ్డారు. ఓవైపు లగేజీ.. చిన్న పిల్లలను చంకనెత్తుకొని దారి పొడవునా నానా అవస్థలు పడ్డారు.
Advertisement