గోదావరిలో పుష్కర స్నానాలు
ఏటూరునాగారం : శ్రావణమాసాన్ని పురస్కరించుకుని మండలంలోని రామన్నగూడెం గోదావరి పుష్కరఘాట్ వద్ద భక్తులు శనివారం అంత్య పుష్కరస్నానాలు ఆచరించారు. తొలుత మహిళలు గోదావరి నదిలో పసుపు, కుంకుమలు చల్లారు. అనంతరం స్నానాలు ఆచరించి పిల్లాపాపలను చల్లంగా చూడాలని వేడుకున్నారు. తర్వాత గోదావరి ఒడ్డున ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ పితృదేవతల పేరిట పిండ ప్రదానాలు చేశారు.
పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం 7.18 మీటర్ల వరకు పెరిగింది. శుక్రవారం కొద్దిగా తగ్గినప్పటికీ శనివారం నుంచి గోదావరి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వరద మరింత చేరడంతో గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
వరదను పరిశీలించిన తహసీల్దార్
రామన్నగూడెం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టాన్ని స్థానిక తహసీల్దార్ నరేందర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఘాట్ వద్ద ఉన్న నీటి మట్టం కొలతలను పరిశీలించి వీఆర్వోలకు పలు సూచనలు ఇచ్చారు. లోతట్టు గ్రామాల ప్రజలకు గోదావరి వరద పెరుగుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలన్నారు. కాగా, వరద ఉధృతి కారణంగా రాంనగర్‌కు వెళ్లే లోలెవల్ కాజ్‌వేపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కాజ్‌వేపై నుంచి వెళ్లేందుకు వెంటనే పడవ ఏర్పాటు చేయాలని తహసీల్దార్.. సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌ఐ సర్వర్‌పాషా, వీఆర్వోలు అర్రెం నర్సయ్య, రాములు, వీఆర్‌ఏ కృష్ణ ఉన్నారు.