గోదావరి–కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన కేంద్రం
రాష్ట్రాలు నాలుగేళ్లుగా నాన్చుతున్నాయంటూ అసంతృప్తి
కేటాయింపులు పెంచాలన్న విజ్ఞప్తులు సాధ్యం కాదని స్పష్టీకరణ
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సమ్మతి తెలపాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: జాతీయ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి– కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు రాష్ట్రా లన్నీ సమ్మతి తెలపాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కోరారు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్రాలు నాలుగేళ్లుగా నాన్చుడు వైఖరిని అవలంబిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్లు గడిచినా ప్రాజెక్టు ముందుకు కదలదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలు సహకరించకపోతే ప్రాజెక్టును పక్కనపెట్టక తప్పదని తేల్చి చెప్పారు.
రాష్ట్రాలన్నింటికీ సాధ్యమైనంత గరిష్టంగా నీటి కేటాయింపులు చేశామని, ప్రాజెక్టు ద్వారా 148 టీఎంసీలే తరలిస్తున్నందున కేటాయింపులు పెంచాలన్న రాష్ట్రాల డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని కూడా చెప్పారు. నదుల అనుసంధానంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ఆమె మాట్లాడారు.
నెలాఖరులోగా రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధిపతులతో ఢిల్లీలో ప్రత్యక్ష విధానంలో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించాలని ఎన్‌డబ్ల్యూడీఏకు దేబశ్రీ సూచించారు. జనవరిలో అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు.
తెలంగాణకు 50% కోటా ఇవ్వలేం..
ప్రాజెక్టు ద్వారా తరలించనున్న 148 టీఎంసీల్లో 50 శాతం తమకు కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్‌ను దేబశ్రీ తోసిపుచ్చారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించడానికి బదులు సమ్మ క్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలనే తెలంగాణ ప్రతి పాదనలను పరిశీలి స్తున్నామని చెప్పారు.
సమ్మక్క బరాజ్‌లో 83 మీటర్ల నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉండే నీళ్లను మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగంగా తరలించాలని, ఆ మేరకు నీటి లభ్యతను తేల్చడానికి సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలన్న రాష్ట్రం సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాలో రెండు కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని రాష్ట్రం చేసిన మరో ప్రతిపాదనకు సూత్రప్రాయంగా సమ్మతి తెలిపారు.
సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్ డీడీ సుబ్రమణ్యం ప్రసాద్ మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చిన తర్వాతే నాగార్జునసాగర్ ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకోవాలని చెప్పారు. తక్కువ భూసేకరణ చేసేలా ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను రూపొందించాలని కోరగా దేబశ్రీ అంగీకరించారు.
పోలవరం నుంచి అనుసంధానం సాధ్యం కాదు
పోలవరం ప్రాజెక్టు నుంచి నదుల అనుసంధానం చేపట్టాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని దేబశ్రీ తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలిస్తే ఏపీ, తమిళనాడు, పాండిచ్చేరి మాత్రమే లబ్ధి పొందుతాయని, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భాగస్వామ్యం కోల్పోతాయని స్పష్టం చేశారు. ఏపీ భూభాగం పరిధిలో రెండు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు.
కర్ణాటకకు కోటా పెంచలేం..
తమ రాష్ట్ర భూభాగంలో మాత్రమే జరగనున్న బెడ్తి–వార్దా నదుల అనుసంధానం ప్రాజెక్టును గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు పరిధి నుంచి తొలగించాలని కర్ణాటక చేసిన విజ్ఞప్తిపై దేబశ్రీ ముఖర్జీ సానుకూలంగా స్పందించారు. గోదావరి–కావేరి ప్రాజెక్టులో కర్ణాటకకు 16 టీఎంసీల తాగునీరు మాత్రమే కేటాయించారని, సాగునీరును సైతం కేటాయించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు.
తాము ఇప్పటికే సమ్మతి తెలుపుతూ ఎంఓయూపై సంతకాలు చేశామని తమిళనాడు, పుదుచ్చేరిలు తెలిపాయి. తమ రాష్ట్రం సొంతంగా చేపట్టిన దామన్‌గంగా–వైతర్ణ–గోదావరి నదుల అనుసంధానాన్ని గోదావరి–కావేరి ప్రాజెక్టు కింద చేర్చాలని మహారాష్ట్ర విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment