భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరిన నీటిమట్టం
భద్రాచలం అర్బన్/ఏటూరునాగారం: గోదావరి నదికి ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. మంగళవారం ఉదయం 7:32 నిమిషాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరింది. దీంతో ఆర్డీ ఓ దామోదర్‌రావు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
నీటిమట్టం అంతకంతకూ పెరు గుతూ సాయంత్రం 5:15 గంటలకు 48 అడుగులు దాటి ప్రవహించడంతో రెండో ప్ర మాద హెచ్చరిక కూడా జారీ చేశారు. వరద పెరుగుతున్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ సూచించారు.అధికారులు అప్రమత్తంగా ఉండి, ముంపు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం మంగళవారం సాయంత్రం నాటికి 15.80 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ముంపు ప్రాంతాలైన రామన్నగూడెం, ఏటూరునాగారం గ్రామంలోని ఓడవాడ, 1, 2, 10 వార్డుల్లోని ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో నది ప్రవహిస్తోంది. 15.83 మీటర్లకు చేరితే.. రెండు ప్రమాద హెచ్చరిక, 17.33 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. గోదావరి కరకట్ట వద్ద పోలీసులు, రెవెన్యూ, కేంద్ర జలవనరుల శాఖ, ఇరిగేషన్ అధికారులు పహారా కాస్తున్నారు.
సాగర్ 26 గేట్లూ ఎత్తివేత
నాగార్జునసాగర్/ దోమలపెంట: నాగార్జునసాగర్ జలాశయానికి వరద పెరిగింది. దీంతో మంగళవారం 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 2,50,257 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, అంతే నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు ఆరుగేట్లు కూడా...
కృష్ణానదికి ఎగువ నుంచి వరద వస్తుండటంతో మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు పైకెత్తి 1,64,592 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment