సాక్షి, విజయవాడ: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ మీద త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో చినజీయర్ స్వామి ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.
ఈ మధ్య కొన్ని వివాదాలు తలెత్తాయి. అవి ఎలా పుట్టుకువచ్చాయో తెలియదు. గ్రామదేవతలను తూలనాడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కానీ, అది వాస్తవం కాదు. పనికట్టుకుని.. వాళ్ల సొంత లాభం కోసమే కొందరు ఇదంతా చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ హడావిడి తగ్గింది కాబట్టే పనికట్టుకుని నా వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చినట్లు ఉన్నారు. ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. అది సబబాకాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. సమాజ హితం లేని వాళ్లే ఇలాంటి ప్రచారాలకు పూనుకుంటున్నారు.
ఆదివాసీ గ్రామ దేవతలను అవమానపరిచాననడం సరికాదు. మేం ఎలాంటి దురుద్దేశపూర్వక కామెంట్లు చేయలేదు. అవి 20 ఏళ్ల కిందటి కామెంట్లు. విమర్శించేవాళ్లు నా వ్యాఖ్యలపై పూర్వాపరాలు ఒకసారి పరిశీలించాలి. అప్పుడే ఆ వ్యాఖ్యల ఆంతర్యం తెలుస్తుంది. వ్యాఖ్యలపై తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే జాలిపడాల్సి వస్తుంది. పైగా ఆ వ్యాఖ్యలను ఎడిటింగ్ చేసి తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉంది.
ప్రపంచంలో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. ఎవరి పద్ధతిలో వాళ్లు ఉండాలి. మన పద్ధతిని మనం ఆరాధించుకోవాలి. ఎవరినీ చిన్నచూపు చూడం అనేది ఉండదు. ఒకళ్లని లేదా కొంత మంది దేవతలను చిన్నచూపు చూసే అలవాటు అస్సలు లేదు. అందర్నీ గౌరవించాలన్నదే మా విధానం. అలాగే అన్నీ నేను నమ్మాల్సిన అవసరం లేదు. వివాదంపై వారికే వదిలేస్తున్నా అని వివరణ ఇచ్చుకున్నారు చినజీయర్ స్వామి.
కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారు. ఆదివాసీల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసి వీలైనంత సేవ చేస్తున్నాం. మాకు కుల, మతం తేడాల్లేవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మతాలకతీతంగా ప్రజలు వస్తుంటారు. కులాన్ని పక్కనపెట్టి.. జ్ఞానసంపదను ఆరాధించాలి. ఇదే రామానుజాచార్యులవారు చెప్పింది. ఆదివాసీలకు ముఖ్యంగా మహిళలకు అగ్రాసనం ఉండాలనే సంప్రదాయం నుంచి వచ్చాం. మహిళలను చిన్నచూపు చూసేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో ప్రొత్సహించం. దీన్ని పెద్ద ఇష్యూ చేస్తూ వివాదం చేయడం సరికాదన్నారు చినజీయర్ స్వామి.
Comments
Please login to add a commentAdd a comment