టీడీపీలో చిచ్చు
► విజ్ఞానయాత్రతో కుమ్ములాటలు బట్టబయలు
► మేయర్ చైర్‌ను టార్గెట్ చేస్తున్న కార్పొరేటర్లు
► తలపట్టుకుంటున్న అధిష్టానం
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో విజ్ఞానయాత్ర చిచ్చు రేపుతోంది. మేయర్ కోనేరు శ్రీధర్ తీరుపై ఆ పార్టీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. పుణే ఘటనకు సంబంధించి పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ మేయర్ కనీసం ఖండించకపోవడంపై కస్సుబుస్సులాడుతున్నారు. టూర్‌లో ఉండగా చండీఘర్‌లో పలువురు కార్పొరేటర్లు భేటీ అయి మేయర్ చైర్‌కు ఎసరు పెట్టేందుకు వ్యూహరచన చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మేయర్ కావాలనే తమను టూర్‌కు పంపించి అల్లరి చేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయపడ్డట్లు భోగట్టా.
మేయర్ వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నగరాభివృద్ధిలో తమను భాగస్వాముల్ని చేయడం లేదని, పుణే, సిమ్లా, అమృత్‌సర్‌లో పాలన గురించి తెలుసుకున్న తమకు నగరంలో ఏం జరుగుతోందీ తెలియకుండా మేయర్ గుట్టుగా ఉంచుతున్నారని పలువురు మహిళా కార్పొరేటర్లు ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. నగరానికి చేరుకోగానే అత్యవసర భేటీ నిర్వహించాలని కార్పొరేటర్లు తీర్మానం చేసుకున్నారు. అనూహ్య రీతిలో ఉమ్మడి చంటి ఘటన తెరపైకి రావడంతో మేయర్‌పై అసమ్మతిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
పెరుగుతున్న దూరం : గత కొంతకాలంగా మేయర్‌కు, పార్టీ కార్పొరేటర్లకు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. మేయర్ చైర్‌ను ఆశిస్తున్న ఓ సీనియర్ కార్పొరేటర్ తెరచాటు మంత్రాంగం నడుపుతున్నారు. సామాజిక వర్గ బలాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. మేయర్‌ను అర్ధంతరంగా మార్చాల్సి వస్తే సామాజిక సమీకరణలు మారతాయని, ఓసీ లేదా బీసీల్లో వేరే సామాజిక వర్గాలకు పదవి దక్కే అవకాశం ఉంటుందని, కాబట్టి ఇప్పటికి స్తబ్దుగా ఉండాలని ఆయన సామాజిక వర్గ పెద్దలు సూచించినట్లు సమాచారం. గతంలో శ్రీ కనకదుర్గా లే అవుట్ సొసైటీ వ్యవహారంలో మేయర్ చైర్‌ను టార్గెట్ చేసిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న మేయర్ సీనియర్ కార్పొరేటర్ల పేరుతో ఒక వర్గాన్ని దగ్గర చేసుకున్నారు.
ఈ క్రమంలో సీనియర్, జూనియర్ కార్పొరేటర్లు అంటూ రెండు వర్గాలుగా చీలిపోయారు. విజ్ఞాన యాత్రకు వెళ్లాలనే ప్రతిపాదన వచ్చిన సందర్భంలో మేయర్ దానిని వ్యతిరేకించారు. మంత్రి పి.నారాయణ సైతం పుష్కరాలు వెళ్లే వరకు వద్దని వారించారు. అయినప్పటికీ కార్పొరేటర్లు పట్టుబట్టి మరీ టూర్‌కు వెళ్లి అల్లరయ్యారు. తాము అల్లరవడం వెనుక మేయర్ హస్తం ఉందన్నది పలువురు కార్పొరేటర్ల వాదన. శనివారం నాటి ప్రెస్‌మీట్‌కు తొలుత మేయర్ దూరంగా ఉన్నారు. పార్టీలోని విభేదాలపై విలేకరులు ప్రశ్నించడంతో నాటకీయ పరిణామాల నేపథ్యంలో 40 నిమిషాల తరువాత మేయర్ ప్రెస్‌మీట్‌లో ప్రత్యక్షమయ్యారు. ‘మా కార్పొరేటర్లు ఏ తప్పు చేయలేదు.. మేమంతా ఒక్కటే..’ అంటూ సర్దిచెప్పుకొచ్చారు. టూర్‌కు వెళ్లిన వారిలో దుష్టబుద్ధి ఉన్న కార్పొరేటర్ ఎవరైనా పత్రికలకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చంటూ కొసమెరుపు ఇచ్చారు.
హైకమాండ్ సీరియస్ : విజ్ఞాన యాత్రలో అపశృతులపై టీడీపీ అధిష్టానం దృష్టిసారించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్, మునిసిపల్ మంత్రి పి.నారాయణ పార్టీ కార్పొరేటర్ల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. మద్యం, మహిళల వివాదాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోకిరీ వేషాలు పార్టీ పరువును దిగజార్చాయంటూ మందలిస్తూనే తప్పు చేసిన వారిని రక్షించుకొనే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. పార్టీలో గ్రూపులుగా విడిపోతే నష్టపోతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఏతావాతా విజ్ఞానయాత్ర టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.