Minister P. Narayana
-
విజయవాడ మెట్రోకు రూ. 2600 కోట్ల రుణం
రూ.300 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి: విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు జర్మనీ రూ.2600 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. జర్మనీ ప్రతినిధుల బృందంతో నాలుగు రోజుల నుంచి జరుపుతున్న చర్చలు ఫలించాయని గురువారం సచివాలయంలో ఆయన మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు విలువలో 20 శాతం, రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించనున్నదన్నారు. జర్మనీ రుణం విడుదలయ్యేలోపు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో భూసేకరణ చేపట్టనున్నామన్నారు.ప్రభుత్వ భవనాల సముదాయం మాస్టర్ ప్లాన్‌పై నార్మన్ ఫోస్టర్స్తో చర్చించేందుకు ఈనెల 22న సీఆర్డీఏ కమిషనర్‌తో కలసి లండన్ వెళుతున్నానని, 28వ తేదీన ఆ దేశ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి మాస్టర్ ప్లాన్‌ను అందించనున్నారని తెలిపారు. -
టీడీపీలో చిచ్చు
► విజ్ఞానయాత్రతో కుమ్ములాటలు బట్టబయలు ► మేయర్ చైర్‌ను టార్గెట్ చేస్తున్న కార్పొరేటర్లు ► తలపట్టుకుంటున్న అధిష్టానం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో విజ్ఞానయాత్ర చిచ్చు రేపుతోంది. మేయర్ కోనేరు శ్రీధర్ తీరుపై ఆ పార్టీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. పుణే ఘటనకు సంబంధించి పత్రికల్లో వార్తలు వచ్చినప్పటికీ మేయర్ కనీసం ఖండించకపోవడంపై కస్సుబుస్సులాడుతున్నారు. టూర్లో ఉండగా చండీఘర్‌లో పలువురు కార్పొరేటర్లు భేటీ అయి మేయర్ చైర్‌కు ఎసరు పెట్టేందుకు వ్యూహరచన చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మేయర్ కావాలనే తమను టూర్‌కు పంపించి అల్లరి చేస్తున్నారని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయపడ్డట్లు భోగట్టా. మేయర్ వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నగరాభివృద్ధిలో తమను భాగస్వాముల్ని చేయడం లేదని, పుణే, సిమ్లా, అమృత్‌సర్‌లో పాలన గురించి తెలుసుకున్న తమకు నగరంలో ఏం జరుగుతోందీ తెలియకుండా మేయర్ గుట్టుగా ఉంచుతున్నారని పలువురు మహిళా కార్పొరేటర్లు ఆరోపణలు గుప్పించినట్లు సమాచారం. నగరానికి చేరుకోగానే అత్యవసర భేటీ నిర్వహించాలని కార్పొరేటర్లు తీర్మానం చేసుకున్నారు. అనూహ్య రీతిలో ఉమ్మడి చంటి ఘటన తెరపైకి రావడంతో మేయర్‌పై అసమ్మతిని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. పెరుగుతున్న దూరం : గత కొంతకాలంగా మేయర్‌కు, పార్టీ కార్పొరేటర్లకు మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. మేయర్ చైర్‌ను ఆశిస్తున్న ఓ సీనియర్ కార్పొరేటర్ తెరచాటు మంత్రాంగం నడుపుతున్నారు. సామాజిక వర్గ బలాన్ని సమీకరించేందుకు సన్నాహాలు చేశారు. మేయర్‌ను అర్ధంతరంగా మార్చాల్సి వస్తే సామాజిక సమీకరణలు మారతాయని, ఓసీ లేదా బీసీల్లో వేరే సామాజిక వర్గాలకు పదవి దక్కే అవకాశం ఉంటుందని, కాబట్టి ఇప్పటికి స్తబ్దుగా ఉండాలని ఆయన సామాజిక వర్గ పెద్దలు సూచించినట్లు సమాచారం. గతంలో శ్రీ కనకదుర్గా లే అవుట్ సొసైటీ వ్యవహారంలో మేయర్ చైర్‌ను టార్గెట్ చేసిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్న మేయర్ సీనియర్ కార్పొరేటర్ల పేరుతో ఒక వర్గాన్ని దగ్గర చేసుకున్నారు. ఈ క్రమంలో సీనియర్, జూనియర్ కార్పొరేటర్లు అంటూ రెండు వర్గాలుగా చీలిపోయారు. విజ్ఞాన యాత్రకు వెళ్లాలనే ప్రతిపాదన వచ్చిన సందర్భంలో మేయర్ దానిని వ్యతిరేకించారు. మంత్రి పి.నారాయణ సైతం పుష్కరాలు వెళ్లే వరకు వద్దని వారించారు. అయినప్పటికీ కార్పొరేటర్లు పట్టుబట్టి మరీ టూర్‌కు వెళ్లి అల్లరయ్యారు. తాము అల్లరవడం వెనుక మేయర్ హస్తం ఉందన్నది పలువురు కార్పొరేటర్ల వాదన. శనివారం నాటి ప్రెస్‌మీట్‌కు తొలుత మేయర్ దూరంగా ఉన్నారు. పార్టీలోని విభేదాలపై విలేకరులు ప్రశ్నించడంతో నాటకీయ పరిణామాల నేపథ్యంలో 40 నిమిషాల తరువాత మేయర్ ప్రెస్మీట్లో ప్రత్యక్షమయ్యారు. ‘మా కార్పొరేటర్లు ఏ తప్పు చేయలేదు.. మేమంతా ఒక్కటే..’ అంటూ సర్దిచెప్పుకొచ్చారు. టూర్‌కు వెళ్లిన వారిలో దుష్టబుద్ధి ఉన్న కార్పొరేటర్ ఎవరైనా పత్రికలకు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చంటూ కొసమెరుపు ఇచ్చారు. హైకమాండ్ సీరియస్ : విజ్ఞాన యాత్రలో అపశృతులపై టీడీపీ అధిష్టానం దృష్టిసారించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్, మునిసిపల్ మంత్రి పి.నారాయణ పార్టీ కార్పొరేటర్ల నుంచి వివరాలడిగి తెలుసుకున్నారు. మద్యం, మహిళల వివాదాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోకిరీ వేషాలు పార్టీ పరువును దిగజార్చాయంటూ మందలిస్తూనే తప్పు చేసిన వారిని రక్షించుకొనే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. పార్టీలో గ్రూపులుగా విడిపోతే నష్టపోతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఏతావాతా విజ్ఞానయాత్ర టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. -
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి
మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం(చిలకలపూడి) : మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో గురువారం జాతీయ సముద్ర మత్స్యవిధానం-2016పై తీరప్రాంత మత్స్యకారుల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి మాట్లాడుతూ రాబోయే పదేళ్ల కాలానికి జాతీయస్థాయి మత్స్యప్రణాళిక తయారుచేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గత సంవత్సరం మత్స్యరంగంలో 36శాతం వృద్ధి నమోదైనప్పటికీ సముద్రజలాల్లో అనుకున్నంత స్థాయిలో మత్స్య ఉత్పత్తులు లభించటం లేదన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక, పర్యవేక్షణ కొరవడి మత్స్యవనరులను తగ్గుముఖం పట్టిస్తున్నాయన్నారు. అర్హులందరికీ ఆయిల్ సబ్సిడీ అందివ్వాలని సూచించారు. చేపల వేట నిషేధ కాలంలో బియ్యం మాత్రమే ఇచ్చేవారని తమ ప్రభుత్వం రూ. 4వేలు ఇచ్చేందుకు కృషి చేసిందన్నారు. మత్స్యకారుల గృహనిర్మాణ వ్యయాన్ని రూ.5 లక్షలకు పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యసంపద పాడవ్వకుండా కోల్డ్‌స్టోరేజీ నిర్మాణాలు చేస్తామన్నారు. సముద్రముఖద్వారం పూడికతీయటం, జెట్టీలు అదనంగా నిర్మించటంపై దృష్టి సారించినట్లు చెప్పారు. చేపల వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేం దుకు బీమామొత్తాన్ని రూ.10లక్షలకు పెంచే యోచన చేస్తున్నామన్నారు. రేపు మునిసిపల్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన మచిలీపట్నం మునిసిపల్ కార్యాలయ నూతన భవనానికి శనివారం మునిసిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చల్లపల్లి బైపాస్ రోడ్డును ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి సిద్దా రాఘవరావు ప్రారంభిస్తారన్నారు. కలెక్టరేట్లో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి భూసమీకరణ కోసం 15 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 45 రోజుల్లో పోర్టు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మంగినపూడి బీచ్‌ను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్ల అంచనాలతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇంకుడు గుంట పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, మత్స్యశాఖ డీడీ సాల్మన్‌రాజు, బందరు ఆర్డీవో పి సాయిబాబు, కాకినాడ మత్స్యశిక్షణా కేంద్రం వైస్‌ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ నారదముని, ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లకు.. మంగళం!
హౌసింగ్‌కు అప్పగించేందుకు నిర్ణయం మేయర్ అధ్యక్షతన సీనియర్ కార్పొరేటర్ల భేటీ త్వరలో మంత్రి నారాయణ వద్దకు నెరవేరని పేదల కలలు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా నగరానికి 28,152 గృహాలు మంజూరయ్యాయి. ఇందులో 9,976 ఇళ్లు కట్టలేమని కార్పొరేషన్ చేతులెత్తేసింది. హౌసింగ్‌కి బదలాయిస్తూ గతేడాది కౌన్సిల్లో తీర్మానం చేసింది. తాజాగా వివిధ దశల్లో ఉన్న నాలుగు వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతల నుంచి కూడా తప్పుకొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సోమవారం చాంబర్లో మేయర్ కోనేరు శ్రీధర్ టీడీపీ సీనియర్ కార్పొరేటర్లతో భేటీ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ బాధ్యతల్ని వదిలించుకునేందుకు మున్సిపల్ మంత్రి పి.నారాయణతో భేటీ అవ్వాలనే ఆలోచనకు వచ్చారు. ఇలా మొదలైంది... జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా నగరానికి 28,152 ఇళ్లను 2006లో కేటాయించారు. కృష్ణానది, బుడమేరు వరద బాధితులు, అభ్యంతరకర పరిస్థితుల్లో నివసించేవారికి జీ ప్లస్ త్రీ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. మొదటి విడతలో నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో గృహ నిర్మాణాలు పూర్తి చేశారు. స్థలాల కొరత వెంటాడటంతో విజయవాడ రూరల్, జక్కంపూడి, గొల్లపూడి ప్రాంతాల్లో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో 226.56 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. 60 శాతం వాటా కింద 130 ఎకరాలు రైతులకు, 40 శాతం వాటాగా కార్పొరేషన్‌కు వచ్చిన 96.56 ఎకరాల్లో గృహనిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. నాలుగు విడతల్లో 18,176 గృహ నిర్మాణాలను చేపట్టగా 14,176 ఇళ్లను పూర్తి చేశారు. ఇందులో 11,676 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిర్మాణాలు పూర్తయిన మరో 2,500 ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉంది. 2,500 ఇళ్లు పంపిణీ చేస్తే.. దండిగా ఆదాయం... గృహనిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు రూ.572 కోట్లు కేటాయించగా, రూ.432 కోట్లతో పనులు పూర్తి చేశారు. నిధులు పక్కదారి పట్టాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీయూఎఫ్ఐడీసీ) తన వాటాగా ఇవ్వాల్సిన రూ.55 కోట్లను నిలుపుదల చేసింది. రూ.72 కోట్లు లబ్ధిదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. రూ.10 కోట్లు కార్పొరేషన్ భరించాల్సి ఉంది. నిర్మాణం పూర్తయిన 2,500 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించినట్లయితే నగరపాలక సంస్థకు దండిగా ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థలాల కొరత కారణంగా 9,976 ఇళ్లను నిర్మించలేమని చేతులెత్తేసిన కార్పొరేషన్ అదనపు భారం పడుతోందనే వంకతో మరో నాలుగువేల ఇళ్లకు మంగళం పాడింది. గతంలో రూ.40 వేలకు ఇళ్లు కేటాయించారు. పెరిగిన ధరల దృష్ట్యా ఈ మొత్తాన్ని రూ.66 వేలు చేశారు. పేదల ఆశలు ఆవిరి జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు దక్కుతాయనుకున్న పేదల ఆశలు ఆవిరైపోతున్నాయి. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా 59 డివిజన్లలో నిర్వహించిన గ్రామసభల్లో 86 వేల దరఖాస్తులు అధికారులకు అందాయి. ఇందులో 51 వేల దరఖాస్తులు ఇళ్ల కోసం వచ్చాయి. రాజధాని ప్రకటన నేపథ్యంలో విజయవాడలో ఇళ్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. శివారు ప్రాంతాల్లో సైతం ఇంటి అద్దెలు రూ.4 వేలకు చేరాయి. నగరపాలక సంస్థ చేపట్టిన గృహ నిర్మాణాలను తీసుకొని తాము పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు ససేమిరా అంటున్నారు. ధరల పెరుగుదల, డిజైన్ల నిర్మాణంలో తేడాలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తంమీద అధికార పార్టీ నేతల తీరుతో పేదోడి సొంత ఇంటి కలలు నెరవేరడం లేదు. -
గ్రీన్ జోన్ అభ్యంతరాలు బేఖాతరు
స్వల్ప మార్పులతో రాజధాని బృహత్ ప్రణాళిక విడుదల చేసిన రాష్ట్ర మంత్రి పి నారాయణ రాజధానిలో సమాంతరంగా రహదారులు600 గృహాలు తొలగిస్తే చాలన్న మంత్రి పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందని అంచనా సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాజధాని తుది బృహత్ ప్రణాళికను స్వల్ప మార్పులతో రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సోమవారం రాత్రి సీఆర్డీఏ కార్యాలయంలో విడుదల చేశారు. ఆరు రోడ్లను నేరుగా వేసేందుకు మార్పులు చేశారు. ప్రస్తుత ప్లాన్‌లో ఉన్న రోడ్లను, మార్చిన ప్లాన్‌తో పరిశీలిస్తే సమాంతరంగా వస్తాయి. రోడ్డును బైపాస్ చేయకుండా నేరుగానే వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. గత ప్రణాళికలో 3,600 గృహాలను ఆయా గ్రామాల్లో తొలగించాల్సి వచ్చింది. ప్రణాళికలో మార్పుల కారణంగా కేవలం ఆరు వందల గృహాలు తొలగిస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ ధ్రువీకరించారు. రాజధాని తొలి బృహత్ ప్రణాళికలో సూచించిన అన్ని అంశాలు అమలులోనే ఉంటాయి. వరదల సమయంలో పలు ప్రాంతాల్లో భవనాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ముంపు బారి నుంచి రక్షించేందుకు తగిన విధంగా చర్యలు తీసుకున్నారు. ముంపు నుంచి తప్పించే విధంగా రాజధాని భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు. కేవలం మూడు మార్పులతో రాజధాని బృహత్ ప్రణాళికను ఆమోదించి విడుదల చేయడంతో ఇక పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆరు రోడ్లలో ఐదు ఉత్తరం, దక్షిణం వైపునకు వెళతాయి. ఒక రోడ్డు మాత్రం తూర్పువైపునకు రానుంది. ఈ రోడ్డును కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారిలో కలుపుతారు. గతంలో విడుదల చేసిన 192 పేజీల ప్రణాళికలో కేవలం ఈ మూడు మార్పులు మాత్రమే చేనసినట్లు మంత్రి చెప్పారు. గ్రామ కంఠాలపై... గ్రామ కంఠాలపై వచ్చిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వీటిపై కూడా సమగ్ర పరిశీలన జరగాల్సి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. సచివాలయానికి నేరుగా రోడ్లు వేస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం మొదటి నుంచీ ఉందని, అందులో భాగంగానే రోడ్లను నేరుగా వేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. -
ఏపీ మంత్రులకు చుక్కలు చూపిస్తున్న తమ్ముళ్లు
* చెప్పిందేంటి... మీరు చేస్తున్నదేంటి...? సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో హడావిడి చేసి... భూ సమీకరణ వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని భారీ ఎత్తున ప్రచారం చేసుకున్న మంత్రులు ఇప్పుడు అటువైపు కనిపించకపోవడం ప్రజలే కాదు తెలుగు తమ్ముళ్లలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అడపాదడపా అటుగా వచ్చే మంత్రులను నిలదీస్తూ వారికి చుక్కలు చూపిస్తున్నారు. రాజధానికి భూములివ్వమంటే ఇచ్చాం... ఏడాదిన్నర దాటుతున్నా మాకెక్కడ భూములిస్తారో చెప్పడం లేదు. జాబిస్తామన్నారు.. కనీసం ఉపాధి లేని పరిస్థితులు కల్పిస్తున్నారు... అంటూ నిలదీయడంతో ఏం చేయాలో అర్థంకాక మంత్రులు బిత్తరపోతున్నారు. రాజధాని కోసం ఏడాది కిందట భూములివ్వడానికి ముందుకొచ్చిన వారే ఇప్పుడు మంత్రుల తీరుపై మండిపడుతున్నారు. తమ్ముళ్లు నిలదీస్తుండటంతో మంత్రులు అటువైపు వెళ్లడానికే వెనుకాడుతున్నారు. పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు తాజాగా చేపట్టిన జన చైతన్య యాత్రలంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారో.. చూస్తామని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవలే తుళ్లూరు పర్యటనకు వెళ్లిన మంత్రి పుల్లారావుకు టీడీపీ నేతల నుంచే చేదు అనుభవం ఎదురైంది. ఉద్యోగాలు, పింఛన్లు, ఉపాధి కార్యక్రమాలు కల్పిస్తామని ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించామని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు న్యాయం జరగడం లేదని మంత్రి పుల్లారావును నిలదీశారు. ‘కాంగ్రెన్ ముఖ్య నేత రామచంద్రయ్య, వామపక్ష నేతల్ని మీటింగ్‌లు పెట్టకుండా అడ్డుకున్నాం.. ఇప్పుడు మాకు జరుగుతున్నదేమిటి?’ అని ప్రశ్నల వర్షం కురిపించడంతో మంత్రి పుల్లారావు ఉక్కిరిబిక్కిరయ్యారు. తుళ్లూరు మండలంలో తండ్రి లేని ఓ నిరుద్యోగి ఏడాది కాలంగా మీ సేవ కేంద్రం కోసం కాళ్లరిగేలా తిరిగితే కనీసం మంజూరు చేయించలేకపోయాం... చంద్రబాబు మీద నమ్మకంతో మాకు జీవనాధరమైన భూముల్ని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చాం.. మీ సేవ కేంద్రం విషయంలోనే ఇలా జరిగితే ఇక మాకు రేపు ప్లాట్లు ఏం ఇస్తారని నిలదీశారు. మీ సేవ కేంద్రానికి.. ఫ్లాట్లు కేటాయించడానికి సంబంధం లేదని మంత్రి పుల్లారావు సమాధానమివ్వగా, ఒక్కసారిగా తుళ్లూరు టీడీపీ నేతలంతా ‘మీరు మా నమ్మకం కోల్పోయారని’ ధ్వజమెత్తారు. మంత్రి నారాయణకు నిరసనల సెగ భూ సమీకరణ కోసం నెలల పాటు రాజధాని మకాం వేసి మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ ఇప్పుడు అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు. భూ సమీకరణ విషయంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి నారాయణకు ఇప్పుడు నిరసనల సెగ పెరిగింది. జన చైతన్య యాత్రల్లో భాగంగా పర్యటిస్తున్న మంత్రి నారాయణను ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ నిలదీస్తున్నారు. నయా పైసా పెట్టుబడి లేకుండా భూములు సమీకరించినప్పుడు హామీలెన్నో ఇచ్చి.. ఒట్లు వేసి.. అమలు విషయానికొచ్చే సరికి ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్లు నారాయణ వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంత్రి నారాయణ ఇచ్చిన వాగ్ధానాలకు ఆయన్ను గుర్రమెక్కించి గ్రామాల్లో తిప్పి అభిమానాన్ని చాటుకుంటే.. ఇప్పుడు మొండిచెయ్యి చూపడమేంటని ఆవేదన చెందుతున్నారు. భూ సమీకరణ పూర్తి చేసిన ఒక్కో గ్రామానికి రూ.30 లక్షలను ప్రభుత్వం నుంచి నజరానాగా ఇప్పిస్తానని అప్పుడు చెప్పి ఇప్పుడు మొహం చాటేశారని టీడీపీ నేతలే భగ్గుమంటున్నారు. మంత్రి రావెలకు సొంతింట్లో తీవ్ర అసమ్మతి ఇక రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుకు సొంతింట్లో అసమ్మతి సెగ రోజురోజుకు తీవ్రంగా రాజుకుంటుంది. గుంటూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలు తోట లక్ష్మికుమారి మంత్రి రావెల తీరును బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. గత నెలలో జరిగిన జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో తన భర్తను సమావేశం నుంచి ఉద్దేశ్యపూర్వకంగానే మంత్రి పంపించారనే కోపంతో మంత్రిపై ఆమె తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర రభస ఏర్పడి ఎంపీపీ, మంత్రివర్గీయులు ఒకరిపై ఒకరు తోపులాటకు దిగారు. దీంతో మంత్రి రావెల సమావేశం నుంచి వెళ్లిపోయారు. తమను తీవ్రంగా అవమానించిన మంత్రి త్వరలో జరుగనున్న జనచైతన్య యాత్రలకు మండలంలో ఎలా తిరుగుతారో చూస్తానంటూ మంత్రికి నేరుగా సవాల్ విసిరారు. దీంతో తీవ్ర అవమానికి గురైన మంత్రి రావెల మండలంలో ఎంపీపీ లక్ష్మీకుమారి చెప్పే ఏ పనిని చేయవద్దంటూ ఆమెను అసలు ఎంపీపీగా పరిగణించాల్సిన అవసరం లేదని మండలంలోని అధికారులందరికి ఆదేశాలు ఇచ్చారు. ఈవిషయం తెలుసుకున్న ఎంపీపీ లక్ష్మికుమారి తీవ్ర మనస్థాపానికి గురై నవంబర్ 24వ తేదీన రాత్రి లాల్పురం గ్రామంలోని తన స్వగృహం వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వందల మంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని మంత్రి రావెలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరాహార దీక్షకు మద్దతు పలికారు. -
28 తేదీ తరువాత భూ సేకరణ
రాష్ట్ర మంత్రి నారాయణ తాడికొండ: గుంటూరు జిల్లాలో ప్రతిపాదిత రాజధాని ప్రాంతంలో 28వ తేదీ తరువాత ప్రభుత్వం భూసేకరణకు చర్యలు తీసుకుంటుందని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ భూసమీకరణ గడువు పెంపు యోచనే లేదన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం 24,200 ఎకరాల భూమిని సమీకరించిందన్నారు. భూ సేకరణకంటే భూ సమీకరణతోనే రైతులకు మేలు కలుగుతుందన్నారు. అనంతరం సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలసి స్థానిక రైతులు, నాయకులతో పలు అంశాలపై చర్చించారు. -
అనధికార లేఅవుట్లపై ఉక్కుపాదం
►పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ ►అమరావతి, తాడికొండ మండలాల్లో అనుమతి లేని లేఅవుట్ల పరిశీలన ►ధ్వంసం చేయాలని అక్కడికక్కడే ఆదేశాలు ►సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించకుండా కొనుగోలు చేయవద్దని సూచన తాడికొండ: రాజధాని లోపల, వెలుపల ఎక్కడ అనధికార లేఅవుట్లు వేసినా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ హెచ్చరించారు. అమరావతి, తాడికొండ మండలాల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన వెంచర్లను శుక్రవారం సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు గంధం చంద్రుడు, కన్నబాబు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జేసీ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులతో కలసి పరిశీలించిన మంత్రి అక్కడికక్కడే పొక్లయిన్లతో ధ్వంసం చేయించారు. అమరావతి మండలంలో 87, తాడికొండ మండలంలో 44 అనధికార వెంచర్లను పరిశీలించారు. తాడికొండ మండలంలోని అన్ని వెంచర్ల వివరాలను తహశీల్దారు గడ్డిపాటి అనిల్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 250 ఎకరాల్లో వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రాత్రికిరాత్రి వెంచర్లు వేసి రోడ్డు మాత్రమే చూపి ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. రాజధాని డిజైన్ రాకముందే వెంచర్లు వేయటం సరికాదని చెప్పారు. రాజధాని జోన్లు వారీగా ఉంటుందన్నారు. ఏ జోను ఎక్కడ వస్తుంది, ఆ జోన్లో ఏఏ సౌకర్యాలు ఉంటాయన్నది తెలియదన్నారు. అందుకనే ఎవరు వెంచర్లు వేయ రాదని ఒకవేళ వేసినా ప్రజలు కొనుగోలు చేయరాదని చెప్పారు. ప్రభుత్వ అనుమతి పొందిన వెంచర్లను సీఆర్డీఏ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రంగుల బ్రోచర్లు చూసి మోసపోవద్దని చెప్పారు. రాష్ర్టంలో అన్ని ప్రాంతాల్లో ఇదే పద్ధతి అమలు చేస్తామని తెలిపారు. తాత్కాలిక రాజధానిపై నివేదిక రావాలి... తాత్కాలిక రాజధానికి కొన్ని స్థలాలను పరిశీలించినట్టు మంత్రి నారాయణ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు పరిధిలో పరిశీలించగా, సీఎం చంద్రబాబు కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చినట్లు చెప్పారు. వాటిని అధికారులతో సర్వే చేయిస్తున్నామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో డిజైన్ వచ్చే వరకు లేఅవుట్లకు ఎలాంటి అనుమతి ఇవ్వబోమని చెప్పారు. ఇప్పటివరకు కొనుగోలు చేసినవారు నష్టపోక తప్పదని స్పష్టం చేశారు. వారి వెంట జిలా ్లపరిషత్ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు,అధికారులు ఉన్నారు. -
మంత్రిపై తమ్ముళ్ల గుర్రు
సాక్షి, ప్రతినిధి, నెల్లూరు: మంత్రి పి.నారాయణపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. తమనెవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా వెళుతున్నారని సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దగ్గర తనకు ఉన్న పలుకుబడితో జిల్లా పార్టీ ఎమ్మెల్యేలను, నియోజకవర్గ ఇన్చార్జిలను పట్టించుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికల తరువాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుకు ముందు వరకు శాసనసభలో, శాసన మండలిలో కానీ సభ్యత్వం లేని నారాయణకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జిల్లా పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో నిస్సహాయులైన వారంతా చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదించక తప్పలేదు. ఇదే సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదివిని దక్కించుకునేందుకు నారాయణ వేసిన ఎత్తులను టీడీపీ జిల్లా నాయకులు కొందరు గండికొట్టారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరిగిన రోజునే నారాయణను రాజధాని కమిటీ కో-ఆర్డినేటర్‌గా నియమించి చంద్రబాబు బాసటగా నిలిచారు. దీంతో నారాయణను నేరుగా ఇప్పుటికిప్పుడే ఢీకొట్టలేమని ఆ పార్టీ నాయకులు అవకాశం కోసం ఎదురుచూశారు. ఇప్పుడు అటువంటి అవకాశం రావడంతో తమ్ముళ్లు కొందరు మంత్రిపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నట్లు తెలిసింది. రెండు రోజులు కిందట మంత్రి నారాయణ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో జరిపిన పర్యటనను కొందరు నాయకులు అస్త్రంగా ఉపయోగించుకున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, కావలి నియోజకవర్గ ఇన్చార్జి బీద మస్తాన్‌రావుకు సమాచారం లేకుండానే మంత్రి ఈ రెండు నియోజకవర్గాల్లో అధికారిక పర్యటన జరపడం ఆ పార్టీలో దుమారం రేపింది. ఈ రెండు చోట్ల మంత్రి వెంట అధికారులే కీలకంగా వ్యవహరించారు. జలదంకి మండలంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వర్గీయులు మంత్రి కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. కావలిలో కొంత మంది టీడీపీ నాయకులు మంత్రి వెంట ఉన్నారు. అయితే మంత్రి వెంట వెళ్లిన వారిపై బీద మస్తాన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆరు నెలలుగా పార్టీలో లోలోపల జరుగుతున్న అసంతృప్తి జ్వాలలు ఎన్నో రోజులు దాగే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే విధంగా మంత్రిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులు, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రస్తుతానికి నోరు మెదపడంలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో శాసన మండలిలో కొన్ని ఖాళీలు రానున్న నేపథ్యంలోనే ఆయన మౌనానికి కారణమని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. వాటిలో స్థానం సంపాదించుకోవడం కోసం సోమిరెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇటీవల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను తన నివాసానికి పిలిపించుకుని మర్యాదలు చేశారని టీడీపీ నాయకులు కొందరు చర్చించుకుంటున్నారు. పదవి వచ్చేంత వరకు సోమిరెడ్డి తన వర్గీయులు ఎక్కడా నోరు జారకుండా కట్టడి చేసినట్లు సమాచారం. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో అవకాశం ఆశిస్తున్నారు. ఇక ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, బల్లి దుర్గా ప్రసాద్, పరసారత్నం తదితర నాయకులకు కూడా ప్రభుత్వంలో ఏదో ఒక పదవిని ఆశిస్తున్న వారే. అందుకే వీరంతా మౌనంగా ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పదవుల పందేరం పూర్తయ్యాక మంత్రి నారాయణపై బహిరంగంగానే తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.