జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్లకు.. మంగళం!
హౌసింగ్‌కు అప్పగించేందుకు నిర్ణయం
మేయర్ అధ్యక్షతన సీనియర్ కార్పొరేటర్ల భేటీ
త్వరలో మంత్రి నారాయణ వద్దకు నెరవేరని పేదల కలలు
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకంలో భాగంగా నగరానికి 28,152 గృహాలు మంజూరయ్యాయి. ఇందులో 9,976 ఇళ్లు కట్టలేమని కార్పొరేషన్ చేతులెత్తేసింది. హౌసింగ్‌కి బదలాయిస్తూ గతేడాది కౌన్సిల్‌లో తీర్మానం చేసింది. తాజాగా వివిధ దశల్లో ఉన్న నాలుగు వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతల నుంచి కూడా తప్పుకొనేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సోమవారం చాంబర్‌లో మేయర్ కోనేరు శ్రీధర్ టీడీపీ సీనియర్ కార్పొరేటర్లతో భేటీ నిర్వహించారు. ఇళ్ల నిర్మాణ బాధ్యతల్ని వదిలించుకునేందుకు మున్సిపల్ మంత్రి పి.నారాయణతో భేటీ అవ్వాలనే ఆలోచనకు వచ్చారు.
ఇలా మొదలైంది...
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పథకంలో భాగంగా నగరానికి 28,152 ఇళ్లను 2006లో కేటాయించారు. కృష్ణానది, బుడమేరు వరద బాధితులు, అభ్యంతరకర పరిస్థితుల్లో నివసించేవారికి జీ ప్లస్ త్రీ ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. మొదటి విడతలో నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో గృహ నిర్మాణాలు పూర్తి చేశారు. స్థలాల కొరత వెంటాడటంతో విజయవాడ రూరల్, జక్కంపూడి, గొల్లపూడి ప్రాంతాల్లో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో 226.56 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. 60 శాతం వాటా కింద 130 ఎకరాలు రైతులకు, 40 శాతం వాటాగా కార్పొరేషన్‌కు వచ్చిన 96.56 ఎకరాల్లో గృహనిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. నాలుగు విడతల్లో 18,176 గృహ నిర్మాణాలను చేపట్టగా 14,176 ఇళ్లను పూర్తి చేశారు. ఇందులో 11,676 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిర్మాణాలు పూర్తయిన మరో 2,500 ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉంది.
2,500 ఇళ్లు పంపిణీ చేస్తే.. దండిగా ఆదాయం...
గృహనిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు రూ.572 కోట్లు కేటాయించగా, రూ.432 కోట్లతో పనులు పూర్తి చేశారు. నిధులు పక్కదారి పట్టాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీయూఎఫ్‌ఐడీసీ) తన వాటాగా ఇవ్వాల్సిన రూ.55 కోట్లను నిలుపుదల చేసింది. రూ.72 కోట్లు లబ్ధిదారుల నుంచి వసూలు చేయాల్సి ఉంది. రూ.10 కోట్లు కార్పొరేషన్ భరించాల్సి ఉంది. నిర్మాణం పూర్తయిన 2,500 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించినట్లయితే నగరపాలక సంస్థకు దండిగా ఆదాయం లభించే అవకాశం ఉంది. స్థలాల కొరత కారణంగా 9,976 ఇళ్లను నిర్మించలేమని చేతులెత్తేసిన కార్పొరేషన్ అదనపు భారం పడుతోందనే వంకతో మరో నాలుగువేల ఇళ్లకు మంగళం పాడింది. గతంలో రూ.40 వేలకు ఇళ్లు కేటాయించారు. పెరిగిన ధరల దృష్ట్యా ఈ మొత్తాన్ని రూ.66 వేలు చేశారు.
పేదల ఆశలు ఆవిరి
జేఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్లు దక్కుతాయనుకున్న పేదల ఆశలు ఆవిరైపోతున్నాయి. జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో భాగంగా 59 డివిజన్లలో నిర్వహించిన గ్రామసభల్లో 86 వేల దరఖాస్తులు అధికారులకు అందాయి. ఇందులో 51 వేల దరఖాస్తులు ఇళ్ల కోసం వచ్చాయి. రాజధాని ప్రకటన నేపథ్యంలో విజయవాడలో ఇళ్ల అద్దెలకు రెక్కలొచ్చాయి. శివారు ప్రాంతాల్లో సైతం ఇంటి అద్దెలు రూ.4 వేలకు చేరాయి. నగరపాలక సంస్థ చేపట్టిన గృహ నిర్మాణాలను తీసుకొని తాము పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు ససేమిరా అంటున్నారు. ధరల పెరుగుదల, డిజైన్ల నిర్మాణంలో తేడాలు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తంమీద అధికార పార్టీ నేతల తీరుతో పేదోడి సొంత ఇంటి కలలు నెరవేరడం లేదు.