కేశినేని కార్యాలయంలో సమావేశమైన టీడీపీ కార్పొరేటర్లు
విజయవాడ కార్పొరేషన్ పాలకవర్గంలో కాక మొదలైంది. మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహార శైలి నచ్చక అధికార పార్టీ కార్పొరేటర్లు కారాలూ మిరియాలు నూరుతుండటం.. ఈ నేపథ్యంలో అధిష్టానం దూతగా అర్బన్ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాట్లు చేసిన సమావేశం గరం.. గరంగా సాగింది. కార్పొరేటర్లలో అధిక శాతం మంది మేయర్‌ను తొలగించాలని గళం వినిపించారు. బుద్ధా వెంకన్నతో జరిగిన సమావేశంలో మేయర్ శ్రీధర్, తన వద్ద కార్పొరేటర్ల అవినీతి చిట్టా ఉందని, తనను ఎవరూ ఏమీచేయలేరని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌తో కార్పొరేషన్‌లో రాజకీయ కాక రాజుకున్నట్లు స్పష్టమవుతోంది.
అమరావతిబ్యూరో/భవానీపురం : ‘మేయర్‌గా కోనేరు ఉంటే.. మేమేంటో చూపిస్తాం.. ఆయన అవినీతిని ఎండగడతాం.. పార్టీ విషయం పక్కన పెట్టండి.. మెజార్టీ కార్పొరేటర్ల అభిప్రాయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోరు.. ఆయన నోటిదురుసు ఇక సహించలేం.. మేయర్‌ను మార్పుచేయాల్సిందే.. రోటేషన్ పద్ధతిలో పదవి ఇవ్వండి.. లేదు.. కాదు అంటే మేమేందో చూపిస్తాం..’ ఇదీ విజయవాడ కార్పొరేషన్ పాలకపక్ష కార్పొరేటర్లు మేయర్ కోనేరు శ్రీధర్ వ్యవహార శైలిపై సంధించిన మాటలు.
‘నాతోనే గేమ్స్ ఆడతారా?.. కార్పొరేటర్ల అవినీతిని అడ్డుకుంటే నన్ను మార్చేస్తారా?.. నేను ఎవరిని చులకనగా మాట్లాడను.. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని.. కొంచెం మాటతీరు అలా ఉంటుంది.. నేను సీఎంకు కావాల్సిన వ్యక్తినే.. నేనేం చేయాలో నాకు తెల్సు’ ఇదీ మేయర్ శ్రీధర్ అంతర్గత సమావేశంలో ఆవేశపూరిత ప్రసంగం.
నగర మేయర్ కోనేరు శ్రీధర్, పాలక పక్ష„ కార్పొరేటర్ల మధ్య రగులుతున్న వివాదం మరింత జఠిలంగా మారింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు రంగంలోకి దిగిన అర్బన్ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్నకు బుధవారం ఇరు పక్షాలు చుక్కలు చూపించారు. కేశినేని భవన్‌లో కార్పొరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశం గరం గరంగా సాగింది. కార్పొరేటర్లు మేయర్ వ్యవహారశైలి బాగాలేదని రెచ్చిపోయారు . ఆయన కావాలో, మేమో తేల్చుకోమంటూ తెగేసి చెప్పారు. మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినా వారు వినిపించుకోలేదు. అధిష్టానానికి మా అభిప్రాయం చెప్పండని, మేయర్‌ను తప్పక మార్చాల్సిందేనని ఎక్కువ మంది కార్పొరేటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతో వివాదంతోనైనా మీలో చలనం వచ్చిందా? అంటూ నిలదీశారు. ఆ నియోజకవర్గానికి చెందిన ఎక్కువ మంది కార్పొరేటర్లు మేయర్‌పై కత్తులు దూశారని సమాచారం.
మేయర్‌ను తక్షణమే తప్పించాలని, లేనిపక్షంలో ఆయన అవినీతి చిట్టా విప్పి ఎండగడతానని కార్పొరేటర్ నజీర్ హుస్సేన్ తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు తెలిసింది. ఆయన్ని ఇంకా కొనసాగనిస్తే పేపర్లకెక్కాల్సి వస్తుందని కూడా చెప్పినట్లు తెలిసింది. గతంలో కార్పొరేటర్లందరూ టూరుకు వెళ్లిన సందర్భంలో జరిగిన సంఘటనపై మేయర్ వారినే తప్పుపట్టటం, రొటేషన్ పద్ధతిలో పదవులు కేటాయించాలన్న అంశంలో మేయర్‌కు వ్యతిరేకంగా సుమారు 27 మంది సంతకాలు పెట్టి ఇస్తే పక్కన పడేసిన నగర అధ్యక్షుడు వెంకన్న, ఇప్పుడు ఎమ్మెల్యే గద్దె విషయానికొచ్చేసరికి కాక పుట్టిందా? అంటూ కొందరు కార్పొరేటర్లు గుసగుసలాడుకున్నట్లు తెలిసింది.
పార్టీని నమ్ముకుని జెండా మోస్తున్న కార్యకర్తలు కొందరు చిన్నచిన్న కాంట్రాక్ట్ వర్క్‌లు చేసుకుంటే వారి బిల్లులు పాస్ చేయించకుండా మేయర్ మాత్రం తన బినామీ కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం పూర్తి స్థాయిలో తీసుకోవడం ఎంతవరకు సమంజసమని కార్పొరేటర్ వై.రామయ్య ప్రశ్నించినట్లు తెలిసింది. కార్పొరేటర్ స్థాయిథనుంచి మేయర్ స్థానానికి ఎదిగిన శ్రీధర్ కార్యకర్తలను గుర్తించాలని కోరినట్లు సమాచారం. స్టాండింగ్ కమిటీ సమావేశంలో తాను మేయర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు ఆయన వ్యంగ్యంగా మాట్లాడి ఆవేదనకు గురిచేశాడని రామయ్య ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. రోటేషన్ పద్ధతిలో పదవులను కేటాయిస్తే సీనియర్లకు అవకాశం లభిస్తుందని జాస్తి సాంబశివరావు, చెన్నుపాటి గాంధీ, ముప్పా వెంకటేశ్వరరావును దృష్టిలో పెట్టుకుని నజీర్ హుస్సేన్ చెప్పినట్లు తెలిసింది. దీంతో రొటేషన్ పద్ధతిలో అయితే కాపు సామాజిక వర్గానికి మేయర్ పదవి కేటాయించాలని నెలబండ్ల బాలస్వామి కోరినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మేయర్‌ను మార్చటం మంచిది కాదని, దీనివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కార్పొరేటర్లు వి.హరనాధస్వామి, కె.వెంకటేశ్వరరావు అభిప్రాయపడినట్లు తెలిసింది.
నేనూ చిట్టా విప్పుతా : మేయర్
అంతకు ముందు బుద్ధా వెంకన్న మేయర్ శ్రీధర్‌తో సమావేశం అయ్యారు. ఇద్దరి మధ్య చర్చ రసవత్తరంగా సాగింది. నన్ను విభేదించే కార్పొరేటర్ల అవినీతి చిట్టా తన వద్ద ఉందని అది బయటపడితే వారి పరువుపోతుందని చెప్పినట్లు తెలిసింది. వారు భయపడితే తాను భయపడనని, నాకు సీఎం తెలుసునని చెప్పినట్లు సమాచారం. నేను మేయర్‌గా ఏవిధంగా ఎంపికయ్యానో మీకు తెలుసని, నాపై అభాండాలు వేసి తొలగిస్తే మాత్రం నేనేం చేయాలో తెలుసని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విషయంలో అధిష్టానం వద్దే తేల్చుకుంటానని మేయర్ చెప్పడంతో బుద్ధా వారించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో అధిష్టానం సీరియస్‌గా ఉందని ప్రస్తుతానికి ఎవరూ మీడియా ముందుకు రావద్దని, జరిగిన విషయాలు సీఎం, లోకేష్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కారం చూపుతారని, అంతవరకు మౌనం దాల్చాలని సూచించారు. ఆపై మేయర్ ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేయించారు. అందరం కలసికట్టుగా సమన్వయంతో పనిచేసుకుంటామని ప్రకటన ద్వారా మేయర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment