చెప్పింది చెయ్!
వార్నింగ్ ఇచ్చిన పాలకపక్షం కార్పొరేటర్లు
కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన అధికారి
గుణదల ప్లాట్లపైనా కన్ను
తలపట్టుకుంటున్న మేయర్
స్థలాలకు పన్ను కట్టాలని నోటీసులిస్తే అధికార పార్టీ కార్పొరేటర్లు ఆందోళన చేస్తామంటున్నార్ సార్.. కమిషనర్‌కు ఓ అధికారి ఫిర్యాదు.
గుణదల ప్లాట్లు కార్పొరేటర్లకే రేటు కట్టి విక్రయించాలి. దీనికోసం కలిసికట్టుగా అధిష్టానంపై ఒత్తిడి తెద్దాం... పాలకపక్షంలో కొంతమంది కార్పొరేటర్ల ఆలోచన ఇది.
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తమ మాట వినని అధికారుల్ని బెదరేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. నగరంలో 35 వేల ఖాళీ స్థలాల నుంచి రూ.11.96 కోట్ల పన్ను వసూలు చేయాలని మేయర్ కోనేరు శ్రీధర్ లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ అంచనాల్లో పొందుపరిచారు. గతంలో 11 వేల స్థలాల నుంచి రూ.7 కోట్లు మాత్రమే రెవెన్యూ అధికారులు వసూలు చేసేవారు. తాజా డిమాండ్ ప్రకారం రెవెన్యూ అధికారులు నోటీసులు సిద్ధం చేసి సంబంధిత యజమానులకు పంపుతున్నారు. టీడీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి నోటీసులు వెనక్కి తీసుకోవాల్సిందిగా హెచ్చరించారు. లేకుంటే అల్లరి చేస్తామని ఓ రేంజ్‌లో వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో కంగుతిన్న అధికారి విషయాన్ని కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విభాగాధిపతులతో సమీక్ష జరుగుతున్న సమయంలోనే ఆ అధికారి కార్పొరేటర్ల తీరుపై ఫిర్యాదు చేశారు. పన్నులు వసూలు చేయకుంటే మేయర్ ఊరుకోవడం లేదు. వసూలు చేద్దామంటే వాళ్ల పార్టీ కార్పొరేటర్లే బెదిరిస్తున్నారు. ఇలా అయితే ఎలా సార్ అంటూ ఆ అధికారి కమిషనర్ వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు.
గుణదల ప్లాట్లపై కొత్త ప్రతిపాదన
గుణదల ప్రాంతంలో ఉద్యోగులకు కేటాయించగా మిగిలిన 72 ప్లాట్లపై కొంతమంది టీడీడీ కార్పొరేటర్ల కన్ను పడింది. ఏదో ఒక రేటు కట్టి తమకే కేటాయించాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇందుకు తమ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సాయం కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను మేయర్ శ్రీధర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.7.89 కోట్లు వస్తుందని మేయర్ అంచనా వేశారు. బహిరంగ వేలం ద్వారానే ప్లాట్లు విక్రయించాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకే కేటాయించాల్సివస్తే మార్కెట్ ధరకు రెట్టింపు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. 1995లో ప్లాట్లు విక్రయించిన సమయంలో కూడా అప్పటి మార్కెట్ ధరకు రెట్టింపు ధరతో విక్రయించారని, అదే విధానాన్ని ఇప్పుడూ కొనసాగిద్దామనే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. టీడీపీలోని కొందరు కార్పొరేటర్లు మాత్రం ప్లాట్లను ఎలా నొక్కేయాలనేదానిపై వ్యూహరచన చేస్తున్నట్లు వినికిడి.
ముఖ్యమంత్రి ఆరా..
టీడీపీలోని కొందరు కార్పొరేటర్ల వైఖరి మేయర్‌కు కొత్త తలనొప్పులు తెస్తోంది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న కార్పొరేషన్‌ను చక్కదిద్దేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలకు స్వపక్షానికి చెందిన వారే గండి కొట్టడంపై ఆయన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఇటీవల ఇంటెలిజెన్స్ రిపోర్టు కోరినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మేయర్ పనితీరు బాగుందని చెబుతూనే కొందరు కార్పొరేటర్ల వ్యవహారశైలి వివాదాస్పదంగా ఉందంటూ ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.