గ్రీన్ జోన్ అభ్యంతరాలు బేఖాతరు
స్వల్ప మార్పులతో రాజధాని బృహత్ ప్రణాళిక విడుదల చేసిన రాష్ట్ర మంత్రి పి నారాయణ
రాజధానిలో సమాంతరంగా రహదారులు600 గృహాలు తొలగిస్తే చాలన్న మంత్రి
పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందని అంచనా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాజధాని తుది బృహత్ ప్రణాళికను స్వల్ప మార్పులతో రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పి. నారాయణ సోమవారం రాత్రి సీఆర్‌డీఏ కార్యాలయంలో విడుదల చేశారు. ఆరు రోడ్లను నేరుగా వేసేందుకు మార్పులు చేశారు. ప్రస్తుత ప్లాన్‌లో ఉన్న రోడ్లను, మార్చిన ప్లాన్‌తో పరిశీలిస్తే సమాంతరంగా వస్తాయి. రోడ్డును బైపాస్ చేయకుండా నేరుగానే వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. గత ప్రణాళికలో 3,600 గృహాలను ఆయా గ్రామాల్లో తొలగించాల్సి వచ్చింది. ప్రణాళికలో మార్పుల కారణంగా కేవలం ఆరు వందల గృహాలు తొలగిస్తే సరిపోతుంది. ఈ విషయాన్ని మంత్రి నారాయణ ధ్రువీకరించారు.
రాజధాని తొలి బృహత్ ప్రణాళికలో సూచించిన అన్ని అంశాలు అమలులోనే ఉంటాయి. వరదల సమయంలో పలు ప్రాంతాల్లో భవనాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ముంపు బారి నుంచి రక్షించేందుకు తగిన విధంగా చర్యలు తీసుకున్నారు. ముంపు నుంచి తప్పించే విధంగా రాజధాని భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు. కేవలం మూడు మార్పులతో రాజధాని బృహత్ ప్రణాళికను ఆమోదించి విడుదల చేయడంతో ఇక పనులు వేగం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆరు రోడ్లలో ఐదు ఉత్తరం, దక్షిణం వైపునకు వెళతాయి. ఒక రోడ్డు మాత్రం తూర్పువైపునకు రానుంది. ఈ రోడ్డును కోల్‌కత్తా-చెన్నై జాతీయ రహదారిలో కలుపుతారు. గతంలో విడుదల చేసిన 192 పేజీల ప్రణాళికలో కేవలం ఈ మూడు మార్పులు మాత్రమే చేనసినట్లు మంత్రి చెప్పారు.
గ్రామ కంఠాలపై...
గ్రామ కంఠాలపై వచ్చిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. వీటిపై కూడా సమగ్ర పరిశీలన జరగాల్సి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. సచివాలయానికి నేరుగా రోడ్లు వేస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం మొదటి నుంచీ ఉందని, అందులో భాగంగానే రోడ్లను నేరుగా వేసేందుకు చర్యలు తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు.