
సాక్షి, అమరావతి: రాజధానిలో పలు రంగాల మౌలిక వసతుల కల్పనకు మూడేళ్లలో రూ.29,676 కోట్ల రూపాయలు అవసరమని సీఆర్‌డీఏ తేల్చింది. కన్సల్టెన్సీ సంస్థ అయిన మెకన్సీ ద్వారా ఈ వ్యయాన్ని సీఆర్‌డీఏ అంచనా వేయించింది. ఇప్పటికే చేపట్టిన, ఇకముందు చేపట్టనున్న ప్రాజెక్టులకు మెకన్సీ ఈ అంచనా వేసింది.
ఇందులో అత్యధిక శాతం ల్యాండ్ పూలింగ్ స్కీం విస్తీర్ణంలో మౌలిక వసతుల కల్పనకే వ్యయం అవుతుందని లెక్కగట్టింది. ఇందుకు రూ.14,080 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని మెకన్సీ పేర్కొంది. ఆ తరువాత సర్కారు కాంప్లెక్స్‌నిర్మాణం, అనుబంధ రహదారులు ఇతర వసతుల కల్పనకు 6,705 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకు అవసరమైన నిధులను హడ్కో రుణంతో పాటు వివిధ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం ద్వారా సమీకరించనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. ఇప్పటికే హడ్కో రూ.1250 కోట్ల రుణం మంజూరు చేసింది.