అనధికార లేఅవుట్లపై ఉక్కుపాదం
►పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ
►అమరావతి, తాడికొండ మండలాల్లో
అనుమతి లేని లేఅవుట్ల పరిశీలన
►ధ్వంసం చేయాలని అక్కడికక్కడే ఆదేశాలు
►సీఆర్‌డీఏ కార్యాలయాన్ని సంప్రదించకుండా
కొనుగోలు చేయవద్దని సూచన
తాడికొండ: రాజధాని లోపల, వెలుపల ఎక్కడ అనధికార లేఅవుట్లు వేసినా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ హెచ్చరించారు. అమరావతి, తాడికొండ మండలాల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన వెంచర్లను శుక్రవారం సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్లు గంధం చంద్రుడు, కన్నబాబు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జేసీ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులతో కలసి పరిశీలించిన మంత్రి అక్కడికక్కడే పొక్లయిన్లతో ధ్వంసం చేయించారు.
అమరావతి మండలంలో 87, తాడికొండ మండలంలో 44 అనధికార వెంచర్లను పరిశీలించారు. తాడికొండ మండలంలోని అన్ని వెంచర్ల వివరాలను తహశీల్దారు గడ్డిపాటి అనిల్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 250 ఎకరాల్లో వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రాత్రికిరాత్రి వెంచర్లు వేసి రోడ్డు మాత్రమే చూపి ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. రాజధాని డిజైన్ రాకముందే వెంచర్లు వేయటం సరికాదని చెప్పారు. రాజధాని జోన్లు వారీగా ఉంటుందన్నారు. ఏ జోను ఎక్కడ వస్తుంది, ఆ జోన్‌లో ఏఏ సౌకర్యాలు ఉంటాయన్నది తెలియదన్నారు. అందుకనే ఎవరు వెంచర్లు వేయ రాదని ఒకవేళ వేసినా ప్రజలు కొనుగోలు చేయరాదని చెప్పారు.
ప్రభుత్వ అనుమతి పొందిన వెంచర్లను సీఆర్‌డీఏ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సీఆర్‌డీఏ కార్యాలయాన్ని సంప్రదించి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రంగుల బ్రోచర్లు చూసి మోసపోవద్దని చెప్పారు. రాష్ర్టంలో అన్ని ప్రాంతాల్లో ఇదే పద్ధతి అమలు చేస్తామని తెలిపారు.
తాత్కాలిక రాజధానిపై నివేదిక రావాలి...
తాత్కాలిక రాజధానికి కొన్ని స్థలాలను పరిశీలించినట్టు మంత్రి నారాయణ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు పరిధిలో పరిశీలించగా, సీఎం చంద్రబాబు కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చినట్లు చెప్పారు. వాటిని అధికారులతో సర్వే చేయిస్తున్నామని తెలిపారు. సీఆర్‌డీఏ పరిధిలో డిజైన్ వచ్చే వరకు లేఅవుట్లకు ఎలాంటి అనుమతి ఇవ్వబోమని చెప్పారు. ఇప్పటివరకు కొనుగోలు చేసినవారు నష్టపోక తప్పదని స్పష్టం చేశారు. వారి వెంట జిలా ్లపరిషత్ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు,అధికారులు ఉన్నారు.