Unauthorized layouts
-
ఎల్ఆర్‘ఎస్’ !
పురపాలక సంఘాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్)ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు మంత్రివర్గం సైతం ఆమోదించింది. కొవ్వూరు: ఎల్.ఆర్.ఎస్. అమలుకు విధి, విధానాల ఖరారుపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారులు ముమ్మరంగా కుస్తీ చేస్తున్నారు. రెండు, మూడు వారాల్లో ఉత్తర్వులు సైతం వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో పెండింగ్‌లో ఉన్న లేవుట్లకు మోక్షం లభించే అవకాశం ఏర్పడింది. ఈ పథకం ద్వారా జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ, ఎనిమిది పురపాలక సంఘాలకు సుమారు రూ.100 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 1997లో ఎల్ఆర్ఎస్ ప్రారంభమైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మరోసారి 2007లో అనుమతి ఇచ్చారు. 2012 వరకు ఈ పథకం కొనసాగింది. అనంతరం వచ్చిన ప్రభుత్వా లు ఎల్ఆర్ఎస్ను పట్టించుకోలేదు. మళ్లీ ఇన్నేళ్లకు సీఎం జగన్మోహన్రెడ్డి దీనిపై దృష్టి సారించారు. పట్టణాల్లో మరింతగా విస్తరించి.. జిల్లావ్యాప్తంగా 2015 నాటికి 38 అనధికారిక లేఅవుట్లను అధికారులు గుర్తించారు. వీటిలో భీమవరంలో 19, తాడేపల్లిగూడెంలో ఏడు, జంగారెడ్డిగూడెంలో మూడు, నిడదవోలులో తొమ్మిది లేఅవుట్లు ఉన్నాయి. కొవ్వూరు, నరసాపురం, తణుకు, పాలకొల్లు, ఏలూరులో నిల్ చూపించారు. ఇదిలా ఉండగా 2014 నాటికి ఏలూరు నగరపాలక సంస్థ ఊడా పరిధిలో రూరల్ ప్రాంతాల్లో 162 అనధికార లేఅవుట్లను గుర్తించారు. అయితే నాలుగైదేళ్లలో జిల్లావ్యాప్తంగా పట్టణాలు విస్తరించాయి. జనాభా కూడా పెరిగింది. రియల్ వ్యాపారం ఆ స్థాయిలోనే విస్తరించింది. ఈ నేపథ్యంలో పల్లెల్లో సైతం లేఅవుట్లు వెలిశాయి. వీటిలో అనధికారిక లేఅవుట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా ఇటువంటి లేఅవుట్లన్నీ క్రమబద్ధీకరించుకునే అవకాశం వచ్చింది. దీనిద్వారా ఆయా పురపాలక సంఘాలకు భారీగా ఆదాయం సమకూరనుంది. 2015 నాటికి ఉన్న లెక్కల ప్రకారం చూస్తే రూ.40 కోట్ల ఆదాయం సమకూరే అవకాశం, అయితే ప్రస్తుతం పెరిగిన లేఅవుట్లను కలుపుకుంటే ఆదాయం రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ అమలు ద్వారా సుమారు రూ.2 వేల కోట్ల వరకు పురపాలక సంఘాలకు ఆదాయం సమకూరవచ్చని అంచనా వేస్తున్నారు. గైడ్‌లైన్స్‌పై అధికారుల కసరత్తు.. ఎల్ఆర్ఎస్ విధివిధానాల ఖరారుపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. డైరెక్టర్ ఆఫ్ టౌన్ కంట్రీప్లానింగ్ అధికారులు ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 మంది రియల్టర్ల వివరా లు సేకరించారు. ఆయా పురపాలక సంఘాల పరిధిలో ఉండే రియల్టర్లు, ప్లాట్లు విక్రయించే వ్యక్తులు, మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ప్రతిని«ధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి ఫోన్ నంబర్లు, వివరాలు సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ అమలులో తలెత్తే ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. గైడ్‌లైన్స్ ఖరారులో వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మునిసిపాలిటీల్లో వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం నూతనంగా నియమించిన ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులకు సైతం ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో మినహా మిగిలిన అన్ని పురపాలక సంఘాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి అవగాహన కల్పించారు. ముందుగా ఆయా వార్డు సచివాలయ ఉద్యోగుల పరిధిలో మ్యాప్‌లు తయారు చేయిస్తున్నారు. త్వరలో ఎల్ఆర్ఎస్ జీఓ పురపాలక సంఘాల్లో అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రియల్టర్స్ వివరాలు, ఫోన్ నంబర్లను అధికారులు సేకరిస్తున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు సైతం తీసుకుంటున్నారు. వచ్చే నెలలో ఎల్ఆర్ఎస్ జీఓ విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. పురపాలక సంఘాల వారీగా ఉన్న అక్రమ లేవుట్ల వివరాలు సేకరిస్తున్నాం. ఈ మేరకు సచివాలయ పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బందికి అవగాహన సదస్సులు సైతం నిర్వహిస్తున్నాం. 2015 నాటికి 38 అనధికారిక లేఅవుట్లు ఉన్నట్టు గుర్తించాం. ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశం ఉంది. – వైపీ రంగనాయకులు, పట్టణ ప్రణాళిక విభాగం ఉపసంచాలకులు -
అక్రమ లే అవుట్లపై సీఆర్డీఏ కొరడా
నందిగామ రూరల్ : అనుమతి లేకుండా నందిగామ ప్రాంతంలో ఏర్పాటుచేసిన లే అవుట్లపై సీఆర్డీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం అనుమతులు లేకుండా నగర పంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసిన లే అవుట్లను పరిశీలించిన అధికారులు ముందుగా హెచ్చరించినట్లుగానే తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు లే అవుట్ల యజమానులకు ఆదివారం రాత్రి నోటీసులు పంపిన అధికారులు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ చక్రపాటి నేతృత్వంలో డెప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులు వరప్రసాద్, నాగసుందరి, లక్ష్మణరావు, బాలాజీ నేతృత్వంలో నాలుగు బృందాలుగా ఏర్పడి లే అవుట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. జేసీబీ, 30మంది సిబ్బంది, ట్రాక్టర్ల సాయంతో లే అవుట్లను తొలగిస్తున్నారు. ఒక్కరోజే నందిగామ నగర పంచాయతీ పరిధిలో 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆరు వెంచర్లను తొలగించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి రంగప్రసాద్ తెలిపారు. అనుమతులు లేని లే అవుట్లను పూర్తిగా తొలగించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ! అధికార పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ లే అవుట్లను తొలగించకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారులు మాత్రం ఎటువంటి లాబీయింగ్‌లు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, తమ పని తాము చేసుకుపోతామని తెలిపారు. -
అనధికార లేఅవుట్ల ధ్వంసానికి శ్రీకారం
తోట్లవల్లూరు : జిల్లాలో అనధికార లేఅవుట్ల ధ్వంసానికి అధికారులు శ్రీకారం చుట్టారు. తోట్లవల్లూరు మండలంలో 12 లే అవుట్లను, పెనమలూరు మండలం యనమలకుదురులో మరో లే అవుట్‌ను శనివారం ధ్వంసం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి నాగరాజవర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సీఆర్డీఏ అధికారులు ఈ పనులను పర్యవేక్షించారు. తోట్లవల్లూరు మండలంలోని యాకమూరులో అనధికార లేఅవుట్లను డీపీవో ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలియజేశారు. మండల పరిధిలో మొత్తం 36 అనధికార లేఅవుట్లు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 768 అనధికార వెంచర్లను గుర్తించినట్లు చెప్పారు. సామాజిక అవసరాల కోసం పది శాతం స్థలం వదలకుండా, కనీసం గ్రామపంచాయతీకి దర ఖాస్తు కూడా చేయకుండా గ్రామాలలో లేఅవుట్లు వేస్తున్నారని చెప్పారు. ఇలాంటి అక్రమ లేఅవుట్లను తొలగిస్తున్నట్లు చెప్పారు. అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్లలోనే ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కేవలం రోడ్లను చూసి అనుమతి లేని వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు. యాకమూరు, తోట్లవల్లూరు గ్రామాల్లోని వెంచర్లను ధ్వంసం చేసిన అధికారులు.. విడతల వారీగా మిగిలిన గ్రామాలలో కూడా అనధికార వెంచర్లను ధ్వంసం చేస్తామని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో వరప్రసాద్, ఈవోపీఆర్డీ అరుణ, పంచాయతీ కార్యదర్శులు కుమారస్వామి, హనుమాన్‌గౌడ్, సూర్య తదితరులు పాల్గొన్నారు. -
అనధికార లేఅవుట్లపై ఉక్కుపాదం
►పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ ►అమరావతి, తాడికొండ మండలాల్లో అనుమతి లేని లేఅవుట్ల పరిశీలన ►ధ్వంసం చేయాలని అక్కడికక్కడే ఆదేశాలు ►సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించకుండా కొనుగోలు చేయవద్దని సూచన తాడికొండ: రాజధాని లోపల, వెలుపల ఎక్కడ అనధికార లేఅవుట్లు వేసినా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పి. నారాయణ హెచ్చరించారు. అమరావతి, తాడికొండ మండలాల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన వెంచర్లను శుక్రవారం సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు గంధం చంద్రుడు, కన్నబాబు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జేసీ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ తదితరులతో కలసి పరిశీలించిన మంత్రి అక్కడికక్కడే పొక్లయిన్లతో ధ్వంసం చేయించారు. అమరావతి మండలంలో 87, తాడికొండ మండలంలో 44 అనధికార వెంచర్లను పరిశీలించారు. తాడికొండ మండలంలోని అన్ని వెంచర్ల వివరాలను తహశీల్దారు గడ్డిపాటి అనిల్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 250 ఎకరాల్లో వేసినట్లు చెప్పారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రాత్రికిరాత్రి వెంచర్లు వేసి రోడ్డు మాత్రమే చూపి ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. వీరందరిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పారు. రాజధాని డిజైన్ రాకముందే వెంచర్లు వేయటం సరికాదని చెప్పారు. రాజధాని జోన్లు వారీగా ఉంటుందన్నారు. ఏ జోను ఎక్కడ వస్తుంది, ఆ జోన్లో ఏఏ సౌకర్యాలు ఉంటాయన్నది తెలియదన్నారు. అందుకనే ఎవరు వెంచర్లు వేయ రాదని ఒకవేళ వేసినా ప్రజలు కొనుగోలు చేయరాదని చెప్పారు. ప్రభుత్వ అనుమతి పొందిన వెంచర్లను సీఆర్డీఏ కార్యాలయంలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రంగుల బ్రోచర్లు చూసి మోసపోవద్దని చెప్పారు. రాష్ర్టంలో అన్ని ప్రాంతాల్లో ఇదే పద్ధతి అమలు చేస్తామని తెలిపారు. తాత్కాలిక రాజధానిపై నివేదిక రావాలి... తాత్కాలిక రాజధానికి కొన్ని స్థలాలను పరిశీలించినట్టు మంత్రి నారాయణ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ నుంచి గుంటూరు పరిధిలో పరిశీలించగా, సీఎం చంద్రబాబు కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చినట్లు చెప్పారు. వాటిని అధికారులతో సర్వే చేయిస్తున్నామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో డిజైన్ వచ్చే వరకు లేఅవుట్లకు ఎలాంటి అనుమతి ఇవ్వబోమని చెప్పారు. ఇప్పటివరకు కొనుగోలు చేసినవారు నష్టపోక తప్పదని స్పష్టం చేశారు. వారి వెంట జిలా ్లపరిషత్ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు,అధికారులు ఉన్నారు.