అక్రమ లే అవుట్లపై సీఆర్‌డీఏ కొరడా
అక్రమ లే అవుట్లపై సీఆర్‌డీఏ కొరడా
Published Mon, Sep 19 2016 9:01 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
నందిగామ రూరల్ : అనుమతి లేకుండా నందిగామ ప్రాంతంలో ఏర్పాటుచేసిన లే అవుట్లపై సీఆర్‌డీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం అనుమతులు లేకుండా నగర పంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసిన లే అవుట్లను పరిశీలించిన అధికారులు ముందుగా హెచ్చరించినట్లుగానే తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. ఈ మేరకు లే అవుట్‌ల యజమానులకు ఆదివారం రాత్రి నోటీసులు పంపిన అధికారులు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. సీఆర్‌డీఏ జాయింట్ డైరెక్టర్ చక్రపాటి నేతృత్వంలో డెప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులు వరప్రసాద్, నాగసుందరి, లక్ష్మణరావు, బాలాజీ నేతృత్వంలో నాలుగు బృందాలుగా ఏర్పడి లే అవుట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. జేసీబీ, 30మంది సిబ్బంది, ట్రాక్టర్ల సాయంతో లే అవుట్లను తొలగిస్తున్నారు. ఒక్కరోజే నందిగామ నగర పంచాయతీ పరిధిలో 35 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆరు వెంచర్లను తొలగించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారి రంగప్రసాద్ తెలిపారు. అనుమతులు లేని లే అవుట్లను పూర్తిగా తొలగించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు !
అధికార పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ లే అవుట్లను తొలగించకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అధికారులు మాత్రం ఎటువంటి లాబీయింగ్‌లు, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, తమ పని తాము చేసుకుపోతామని తెలిపారు.
Advertisement
Advertisement