తోట్లవల్లూరు : జిల్లాలో అనధికార లేఅవుట్ల ధ్వంసానికి అధికారులు శ్రీకారం చుట్టారు. తోట్లవల్లూరు మండలంలో 12 లే అవుట్లను, పెనమలూరు మండలం యనమలకుదురులో మరో లే అవుట్‌ను శనివారం ధ్వంసం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి నాగరాజవర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సీఆర్‌డీఏ అధికారులు ఈ పనులను పర్యవేక్షించారు. తోట్లవల్లూరు మండలంలోని యాకమూరులో అనధికార లేఅవుట్లను డీపీవో ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలియజేశారు. మండల పరిధిలో మొత్తం 36 అనధికార లేఅవుట్లు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 768 అనధికార వెంచర్లను గుర్తించినట్లు చెప్పారు.
సామాజిక అవసరాల కోసం పది శాతం స్థలం వదలకుండా, కనీసం గ్రామపంచాయతీకి దర ఖాస్తు కూడా చేయకుండా గ్రామాలలో లేఅవుట్లు వేస్తున్నారని చెప్పారు. ఇలాంటి అక్రమ లేఅవుట్లను తొలగిస్తున్నట్లు చెప్పారు. అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్లలోనే ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
కేవలం రోడ్లను చూసి అనుమతి లేని వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని కోరారు. యాకమూరు, తోట్లవల్లూరు గ్రామాల్లోని వెంచర్లను ధ్వంసం చేసిన అధికారులు.. విడతల వారీగా మిగిలిన గ్రామాలలో కూడా అనధికార వెంచర్లను ధ్వంసం చేస్తామని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో వరప్రసాద్, ఈవోపీఆర్‌డీ అరుణ, పంచాయతీ కార్యదర్శులు కుమారస్వామి, హనుమాన్‌గౌడ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.