వాతావరణంలో అనూహ్య మార్పులతోనే భారీ నష్టం
ములుగు అటవీ విధ్వంసంపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసిన అటవీశాఖ
వివరాలపై చేతులెత్తేసిన ఐఎండీ, ఇక ఎన్‌ఆర్‌ఎస్‌సీపైనే ఆశ
సాక్షి, హైదరాబాద్ : వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల చేర్పులతోపాటు అరుదైన ప్రకృతి వైపరీత్యం కారణంగా ములుగు అడవుల్లో చెట్లకు భారీగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వానికి అటవీశాఖ నివేదిక సమర్పించింది. దీనిని ‘ఎకోలాజికల్ డిజాస్టర్’గానే పరిగణించాల్సి ఉంటుందని ఇందులో సూచించినట్టు సమాచారం. మొత్తంగా 204 హెక్టార్లలో (500 నుంచి 600 ఎకరాల్లో) దాదాపు 70 వేల దాకా వివిధ జాతుల చెట్లకు నష్టం వాటిల్లినట్టు పేర్కొంది. అటవీ పునరుద్ధరణతోపాటు, భూసార పరిరక్షణ చర్యలు, గ్యాప్ ఏర్పడిన చోట్ల వాటిని నింపేలా పెద్దమొత్తంలో మొక్కల పెంపకం, వంటివి చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఇంకా అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతోపాటు, కొండ ప్రాంతాలు వంటివి ఉండడంతో జరిగిన నష్టం, కూలిన చెట్ల వివరాల సేకరణ అంత వేగంగా సాగడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.
వివిధ రూపాల్లో వాటిల్లిన నష్టంపై వారంరోజుల్లో క్షేత్రస్థాయి నుంచి ఒక స్పష్టమైన అంచనాకు వచ్చాక పర్యావరణం, అడవులతో సంబంధమున్న నిపుణులతో అధ్యయనం జరిపించాలని అటవీశాఖ నిర్ణయించింది. దేశంలోనే అత్యంత అరుదైన రీతిలో ములుగు అటవీప్రాంతంలో చెట్లకు నష్టం జరిగినందున, పూర్తి సమాచారం అందిన తర్వాతే అటవీ ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి సవివరమైన నివేదిక అందజేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ములు గులో సుడిగాలుల బీభత్సం సమయంలోనే ఆదిలా బాద్ జిల్లా ఉట్నూరులో, ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోనూ స్వల్పస్థాయిలో చెట్లకు నష్టం జరిగినట్లు అటవీ అధికారులు గుర్తించారు.
ఉపగ్రహ ఛాయాచిత్రాలు వస్తేనే...
హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) నుంచి ఉపగ్రహ ఛాయాచిత్రాలను సేకరించడం ద్వారా ములుగు అటవీ విధ్వంసం కారణాలు వెల్లడి కాగలవని అటవీశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అవసరమైన డేటాను ఉపగ్రహం నుంచి సేకరిస్తున్నామని, రెండురోజుల్లో దీనిపై వివరాలు అందజేస్తామని ఎన్‌ఆర్‌ఎస్‌సీ అధికారులు చెప్పారు. ఈ సమాచారాన్ని తమ ఎర్త్ అండ్ క్లైమేట్ సైన్స్ ఏరియా డివిజన్ క్రోడీకరించి అందజేస్తామని అటవీ అధికారులకు చెప్పారు. అయితే భారత వాతావరణ శాఖ (ఐఎండీ)పై అటవీ అధికారులు పెట్టుకున్న ఆశలు మాత్రం నెరవేరలేదు.
ములుగు పరిసర ప్రాంతాల్లో తమ అబ్జర్వేటరీ లేనందువల్ల, ఈ బీభత్సం చోటుచేసుకున్న రోజునాటి వివరాలు ఇవ్వలేకపోతున్నామని అధికారులకు ఐఎండీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఐఎండీనే చేతులెత్తేస్తే ఇంకా తమకు ఎవరు వాతావరణ సాంకేతిక విషయాలు అందించగలరని అటవీ అధికారులు విస్తుపో తున్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ పూర్తయి, ఎన్‌ఆర్‌ఎస్‌సీ నుంచి సాంకేతిక సమాచారం అందాక 2,3 రోజుల్లో ములుగు జిల్లా అటవీ అధికారులు నివేదిక సమర్పించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment