ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా ఉక్రేనియన్ దళాలు పశ్చిమ రష్యాలోని సెమ్ నదిపై ఉన్న మూడు వంతెనలను ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వివరాలను రష్యన్ అధికారులు మీడియాకు వెల్లడించారు.
పశ్చిమ రష్యాపై ఉక్రెయిన్ దాడి మూడో వారంలోకి ప్రవేశించింది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో జరిగిన కీవ్ దాడి.. యుద్ధ పరిణామాలను ఊహకందని విధంగా మార్చివేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాపై ఇదే అతిపెద్ద దాడి అని చెబుతున్నారు. ఈ తాజా దాడి నేపధ్యంలో ఉక్రెయిన్ విజయోత్సవాలు చేసుకుంటుండగా, అదే సమయంలో తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్క్‌ను కూడా స్వాధీనం చేసుకునే దిశగా రష్యా ముందుకు కదులుతోంది.
కుర్స్క్ పరిధిలోని సెయిమ్ నదిపైగల మూడు వంతెనలపై ఉక్రేనియన్ దాడి చేసింది. ఉక్రెయిన్ వైమానిక దళ కమాండర్ సెమ్ నదిపైగల వంతెనలపై జరిపిన దాడులకు సంబంధించిన రెండు వీడియోలను పోస్ట్ చేశారు. కుర్స్క్ ప్రాంతంలో దాడి మొదలుపెట్టినప్పటి నుండి ఉక్రేనియన్ దళాలు 1,250 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని, 92 రష్యా స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
తమ దేశంపై భవిష్యత్తులో జరిగే సరిహద్దు దాడులను నిరోధించేందుకు ‘బఫర్ జోన్’ను ఏర్పాటుచేసే లక్ష్యంతో ఉన్నామని జెలెన్స్కీ పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్ దగ్గర భారీ సంఖ్యలో రష్యన్ యుద్ధ ఖైదీలు ఉన్నారని తెలిపారు. రష్యా తన దగ్గరున్న ఉక్రెయిన్ పౌరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలావుండగా ఉక్రేనియన్ సైన్యం జరిపిన దాడిలో తమ దేశానికి చెందిన 17 మంది మృతిచెందారని, 140 మంది గాయపడ్డారని రష్యన్ మెడికల్ సర్వీస్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment