నరేంద్ర మోదీపై ప్రియాంకా గాంధీ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోదీ పదేపదే డొల్ల హామీలు ఇస్తూ ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గురించి ఆందోళనను పక్కనపెట్టి, ప్రధాని పదవి గౌరవాన్ని పెంచడంపై ఇకనైనా దృష్టి పెట్టాలని మోదీకి హితవు పలికారు. ఈ మేరకు ప్రియాంక శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సత్యమే దేవుడు, సత్యమేవ జయతే అని జాతిపిత మహాత్మాగాంధీ తరచుగా బోధిస్తూ ఉండేవారని పేర్కొన్నారు.
వేలాది సంవత్సరాల మన సంస్కృతికి సత్యమే ఆధారమని ఉద్ఘాటించారు. ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పడం, డొల్ల హామీలు ఇవ్వడం సరైందని కాదని స్పష్టంచేశారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాయన్ని వెల్లడించారు. గ్యారంటీలతో ప్రజల సొమ్మును ప్రజలకు అందజేస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ఎన్నో హామిలిచ్చారని, వాటిలో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ హామీలన్నీ బూటకమేనని తేలిపోయిందన్నారు. ‘అచ్చే దిన్’ ఎక్కడున్నాయో చెప్పాలని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment