ఏపీ మంత్రులకు చుక్కలు చూపిస్తున్న తమ్ముళ్లు | TDP cadre angry on andhra pradesh ministers | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రులకు చుక్కలు చూపిస్తున్న తమ్ముళ్లు

Published Fri, Dec 4 2015 4:11 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

TDP cadre angry on andhra pradesh ministers

* చెప్పిందేంటి... మీరు చేస్తున్నదేంటి...?


సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో హడావిడి చేసి... భూ సమీకరణ వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని భారీ ఎత్తున ప్రచారం చేసుకున్న మంత్రులు ఇప్పుడు అటువైపు కనిపించకపోవడం ప్రజలే కాదు తెలుగు తమ్ముళ్లలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అడపాదడపా అటుగా వచ్చే మంత్రులను నిలదీస్తూ వారికి చుక్కలు చూపిస్తున్నారు.  రాజధానికి భూములివ్వమంటే ఇచ్చాం... ఏడాదిన్నర దాటుతున్నా మాకెక్కడ భూములిస్తారో చెప్పడం లేదు.

 

జాబిస్తామన్నారు.. కనీసం ఉపాధి లేని పరిస్థితులు కల్పిస్తున్నారు... అంటూ నిలదీయడంతో ఏం చేయాలో అర్థంకాక మంత్రులు బిత్తరపోతున్నారు. రాజధాని కోసం ఏడాది కిందట భూములివ్వడానికి ముందుకొచ్చిన వారే ఇప్పుడు మంత్రుల తీరుపై మండిపడుతున్నారు. తమ్ముళ్లు నిలదీస్తుండటంతో మంత్రులు అటువైపు వెళ్లడానికే వెనుకాడుతున్నారు.  పార్టీ అధ్యక్షుడి పిలుపు మేరకు తాజాగా చేపట్టిన జన చైతన్య యాత్రలంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారో.. చూస్తామని బహిరంగంగానే హెచ్చరికలు చేస్తున్నారు. ఇటీవలే తుళ్లూరు పర్యటనకు వెళ్లిన మంత్రి పుల్లారావుకు టీడీపీ నేతల నుంచే చేదు అనుభవం ఎదురైంది.
 
ఉద్యోగాలు, పింఛన్లు, ఉపాధి కార్యక్రమాలు కల్పిస్తామని ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించామని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు న్యాయం జరగడం లేదని మంత్రి పుల్లారావును నిలదీశారు. ‘కాంగ్రెన్ ముఖ్య నేత రామచంద్రయ్య, వామపక్ష నేతల్ని మీటింగ్‌లు పెట్టకుండా అడ్డుకున్నాం.. ఇప్పుడు మాకు జరుగుతున్నదేమిటి?’ అని ప్రశ్నల వర్షం కురిపించడంతో మంత్రి పుల్లారావు ఉక్కిరిబిక్కిరయ్యారు.

 

తుళ్లూరు మండలంలో తండ్రి లేని ఓ నిరుద్యోగి ఏడాది కాలంగా మీ సేవ కేంద్రం కోసం కాళ్లరిగేలా తిరిగితే కనీసం మంజూరు చేయించలేకపోయాం... చంద్రబాబు మీద నమ్మకంతో మాకు జీవనాధరమైన భూముల్ని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చాం.. మీ సేవ కేంద్రం విషయంలోనే ఇలా జరిగితే ఇక మాకు రేపు ప్లాట్లు ఏం ఇస్తారని నిలదీశారు. మీ సేవ కేంద్రానికి.. ఫ్లాట్లు కేటాయించడానికి సంబంధం లేదని మంత్రి పుల్లారావు సమాధానమివ్వగా, ఒక్కసారిగా తుళ్లూరు టీడీపీ నేతలంతా ‘మీరు మా నమ్మకం కోల్పోయారని’ ధ్వజమెత్తారు.
 
 
 మంత్రి నారాయణకు నిరసనల సెగ

 భూ సమీకరణ కోసం నెలల పాటు రాజధాని మకాం వేసి మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ ఇప్పుడు అటువైపు వెళ్లడానికి భయపడుతున్నారు. భూ సమీకరణ విషయంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి నారాయణకు ఇప్పుడు నిరసనల సెగ పెరిగింది. జన చైతన్య యాత్రల్లో భాగంగా పర్యటిస్తున్న మంత్రి నారాయణను ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారంటూ నిలదీస్తున్నారు.

 

నయా పైసా పెట్టుబడి లేకుండా భూములు సమీకరించినప్పుడు హామీలెన్నో ఇచ్చి.. ఒట్లు వేసి.. అమలు విషయానికొచ్చే సరికి ఒట్టు తీసి గట్టు మీద పెట్టినట్లు నారాయణ వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మంత్రి నారాయణ ఇచ్చిన వాగ్ధానాలకు ఆయన్ను గుర్రమెక్కించి గ్రామాల్లో తిప్పి అభిమానాన్ని చాటుకుంటే.. ఇప్పుడు మొండిచెయ్యి చూపడమేంటని ఆవేదన చెందుతున్నారు. భూ సమీకరణ పూర్తి చేసిన ఒక్కో గ్రామానికి రూ.30 లక్షలను ప్రభుత్వం నుంచి నజరానాగా ఇప్పిస్తానని అప్పుడు చెప్పి ఇప్పుడు మొహం చాటేశారని టీడీపీ నేతలే భగ్గుమంటున్నారు.
 
 మంత్రి రావెలకు సొంతింట్లో తీవ్ర అసమ్మతి

 ఇక రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబుకు సొంతింట్లో అసమ్మతి సెగ రోజురోజుకు తీవ్రంగా రాజుకుంటుంది. గుంటూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలు తోట లక్ష్మికుమారి మంత్రి రావెల తీరును బహిరంగంగానే విమర్శిస్తూ వస్తున్నారు. గత నెలలో జరిగిన  జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జరిగిన నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో తన భర్తను సమావేశం నుంచి ఉద్దేశ్యపూర్వకంగానే మంత్రి పంపించారనే కోపంతో మంత్రిపై ఆమె తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర రభస ఏర్పడి ఎంపీపీ, మంత్రివర్గీయులు ఒకరిపై ఒకరు తోపులాటకు దిగారు. దీంతో మంత్రి రావెల సమావేశం నుంచి వెళ్లిపోయారు. తమను తీవ్రంగా అవమానించిన మంత్రి త్వరలో జరుగనున్న జనచైతన్య యాత్రలకు మండలంలో ఎలా తిరుగుతారో చూస్తానంటూ మంత్రికి నేరుగా సవాల్ విసిరారు.

 

దీంతో తీవ్ర అవమానికి గురైన మంత్రి రావెల మండలంలో ఎంపీపీ లక్ష్మీకుమారి చెప్పే ఏ పనిని చేయవద్దంటూ ఆమెను అసలు ఎంపీపీగా పరిగణించాల్సిన అవసరం లేదని మండలంలోని అధికారులందరికి ఆదేశాలు ఇచ్చారు. ఈవిషయం తెలుసుకున్న ఎంపీపీ లక్ష్మికుమారి తీవ్ర మనస్థాపానికి గురై నవంబర్ 24వ తేదీన రాత్రి లాల్‌పురం గ్రామంలోని తన స్వగృహం వద్ద  ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వందల మంది టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని మంత్రి రావెలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరాహార దీక్షకు మద్దతు పలికారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement