మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి
మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం(చిలకలపూడి) : మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో గురువారం జాతీయ సముద్ర మత్స్యవిధానం-2016పై తీరప్రాంత మత్స్యకారుల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి మాట్లాడుతూ రాబోయే పదేళ్ల కాలానికి జాతీయస్థాయి మత్స్యప్రణాళిక తయారుచేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గత సంవత్సరం మత్స్యరంగంలో 36శాతం వృద్ధి నమోదైనప్పటికీ సముద్రజలాల్లో అనుకున్నంత స్థాయిలో మత్స్య ఉత్పత్తులు లభించటం లేదన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక, పర్యవేక్షణ కొరవడి మత్స్యవనరులను తగ్గుముఖం పట్టిస్తున్నాయన్నారు.
అర్హులందరికీ ఆయిల్ సబ్సిడీ అందివ్వాలని సూచించారు. చేపల వేట నిషేధ కాలంలో బియ్యం మాత్రమే ఇచ్చేవారని తమ ప్రభుత్వం రూ. 4వేలు ఇచ్చేందుకు కృషి చేసిందన్నారు. మత్స్యకారుల గృహనిర్మాణ వ్యయాన్ని రూ.5 లక్షలకు పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యసంపద పాడవ్వకుండా కోల్డ్‌స్టోరేజీ నిర్మాణాలు చేస్తామన్నారు. సముద్రముఖద్వారం పూడికతీయటం, జెట్టీలు అదనంగా నిర్మించటంపై దృష్టి సారించినట్లు చెప్పారు. చేపల వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేం దుకు బీమామొత్తాన్ని రూ.10లక్షలకు పెంచే యోచన చేస్తున్నామన్నారు.
రేపు మునిసిపల్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన
మచిలీపట్నం మునిసిపల్ కార్యాలయ నూతన భవనానికి శనివారం మునిసిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చల్లపల్లి బైపాస్ రోడ్డును ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి సిద్దా రాఘవరావు ప్రారంభిస్తారన్నారు. కలెక్టరేట్‌లో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి భూసమీకరణ కోసం 15 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
45 రోజుల్లో పోర్టు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మంగినపూడి బీచ్‌ను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్ల అంచనాలతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇంకుడు గుంట పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, మత్స్యశాఖ డీడీ సాల్మన్‌రాజు, బందరు ఆర్డీవో పి సాయిబాబు, కాకినాడ మత్స్యశిక్షణా కేంద్రం వైస్‌ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ నారదముని, ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.