Minister KollU Ravindra
-
టీడీపీ నేతల మధ్య ఇసుక చిచ్చు!
- శ్రీకాకుళం రేవులో తన్నుకున్న‘తమ్ముళ్లు’ - రోజురోజుకూ ముదురుతున్న వివాదం - బుజ్జగించే పనిలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం : నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్లలో ఒక వర్గానికి చేతినిండా పని దొరికింది. ఆగ్రహంతో రగిలిపోయిన మరోవర్గం తమ చేతికి పని చెప్పింది. దీంతో రెండు వర్గాలు ఇసుక రేవులో చేరి తన్నుకున్నాయి. చివరికి పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగినా... ఆ తర్వాత వివాదం మరింత ముదురుతోంది. దీంతో మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని ఆగ్రహంతో రగిలిపోతున్న వర్గాన్ని బుజ్జగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పట్టణంలో ‘తమ్ముళ్ల తన్నులాట’ హాట్ టాపిక్‌గా మారింది. ఇదీ అసలు కథ...: మచిలీపట్నం పురపాలక సంఘంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.10 కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇచ్చారు. బందరు మండలంలో రూ.6.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు అనుమతులు ఇచ్చారు. ఈ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మచిలీపట్నానికి సమీపంలోని ఘంటసాల మండలం శ్రీకాకుళం రేవు నుంచి ఇసుకను తరలించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ నుంచి అనుమతి తెచ్చినట్లు ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. ఇక్కడే గొడవ మొదలైంది ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చేపట్టే అభివృద్ధి పనులకు శ్రీకాకుళం రేవు ఇసుకను మచిలీపట్నానికి రవాణా చేసే పనిని కొంతమంది ‘తమ్ముళ్ల’కే అప్పగించారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. రెండు వర్గాలవారు తామే ఇసుకను రవాణా చేస్తామని వాహనాలతో సహా శ్రీకాకుళం రేవుకు రెండు రోజుల క్రితం వెళ్లారు. అభివృద్ధి పనులకు తామే ఇసుకను రవాణా చేస్తామని ఇరువర్గాల వారు రేవులోనే తన్నుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సర్దుబాటు చేశారు. బుజ్జగింపులు...: టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకోవడంతో మంత్రి కొల్లు రవీంద్ర రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఇసుక రవాణా చేసేందుకు అనుమతి ఇవ్వని వారిని పిలిచి వేరే పనులు అప్పగిస్తామని బుజ్జగింపులకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం. బైపాస్‌రోడ్డు ప్రాంతానికి చెందిన ఓ కౌన్సిలర్‌కు రూ.2 కోట్ల విలువైన పనులు అప్పగించడంతో కొందరు తెలుగు తమ్ముళ్లు తమను పక్కన పెట్టేశారని బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. తాము 1983 నుంచి పార్టీ జెండా మోస్తూనే ఉన్నామని, తమను పక్కనపెట్టి కొందరికే పనులు అప్పగిస్తున్నారని పలువురు నాయకులు విమర్శలు చేస్తున్నారు. అనుమతి లేకుండానే మట్టి తవ్వకాలు మచిలీపట్నం పురపాలక సంఘంలో కీలకంగా వ్యవహరించే కౌన్సిలర్ కేంద్రీయ విద్యాలయం పక్కనే అనుమతులు లేకుండా పొక్లెయిన్‌తో మట్టిని తవ్వి తాను పనులు దక్కించుకున్న రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్నారు. అనుమతులు లేకుండానే మట్టిని తరలిస్తున్నా... పట్టించుకునే అధికారులే కరువయ్యారు. ఇంతకాలంగా ఏమైనా పనులు అప్పగిస్తారని ఆశగా ఉన్న ఓ వర్గం టీడీపీ కార్యకర్తలు తమకు పనులు దక్కకపోవడంతో మంత్రి తీరుపై బహిరంగంగానే విమర్శలకు దిగడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. -
మహిళల భద్రత కోసమే మరుగుదొడ్ల నిర్మాణం
రొద్దం : మహిళలకు రక్షణ, భద్రత కల్పించాలన్న ఉద్ధేశంతోనే ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పీర్లడచావిడిలో మంగళవారం సర్పంచ్ అశ్వర్థనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ముగింపు జన్మభూమి–మాఊరు గ్రామసభకు మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అడిగిన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ ఇల్లు మంజూరు చేస్తోందన్నారు.1.30 లక్షల తెల్లరేషన్‌కార్డులు మంజూరు చేశామని, దాదాపు 4.20 కోట్ల జనాభాలో 1.35 కోట్ల మందికి ఒక్కొక్కరికి ఐదుకిలోల చొప్పున బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించి ఏపీకి అప్పులు, తెలంగాణకు ఆస్తులను ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో పేదలు ఆనందంగా పండుగ చేసుకోవాలన్న సంకల్పంతోనే సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగ కానులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం 63 మంది గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. మహిళలకు పసుపు కుంకుమ కింద రూ.30 వేల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహశీల్దార్ మహబూబ్‌బాషా, హౌసింగ్ డీఈ కుప్పిస్వామి, ఎంపీడీఓ జయచంద్రరెడ్డి, జెడ్పీటీసీ చిన్నప్పయ్య, ఎన్టీఆర్ పథకం కాంట్రాక్టర్ గోవిందప్ప, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అధికార దాష్టీకం
మచిలీపట్నం : శాలివాహనులకు మచిలీపట్నం పంపులచెరువు, శివగంగ డ్రెయిన్‌కు మధ్య 180, 181 సర్వే నంబర్లలో 22 ఎకరాల భూమిని 1971 ఆగస్టు 3న అప్పటి ఆర్డీవో కుండలు, ఇతరత్రా పనులు చేసుకుని జీవించేందుకు ఇచ్చారు. కొంత భూమిలో ఇటుక బట్టీలు, కుండలు తయారు చేస్తుండగా మరికొంత భూమిని మట్టిని తవ్వేందుకు వినియోగిస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టినతరువాత ఈ భూమిలో స్టేడియం నిర్మాణం చేయాలని పాలకులు తలపెట్టారు. అనుకున్నదే తడవుగా ఈ భూమిని ఖాళీ చేయాలని మునిసిపల్, రెవెన్యూ అధికారుల ద్వారా నోటీసులు పంపారు. పోలీసులు, అధికారుల అత్యుత్సాహం : తమ భూమిని స్వాధీనం చేసుకోవద్దని కోరుతూ విజయవాడ–మచిలీపట్నం రహదారిపై శాంతియుతంగా ధర్నా చేస్తున్న కుమ్మరి గూడెం వాసులు, వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులను అక్కడి నుంచి తొలగించేందుకు పోలీసులు, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ధర్నా వద్దకు తొలుత మునిసిపల్ కమిషనర్ జస్వంతరావు, ఇన్చార్జి టీపీవో నాగేంద్రప్రసాద్, తహసీల్దార్ నారదముని వచ్చారు. ఈ సందర్భంగా తాము జీవనం సాగించేందుకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని పూడ్చే ప్రయత్నం చేయవద్దని శాలివాహనులు వేడుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, భూమిని పూడ్చివేయడంతో పాటు మిగిలిన భూమిని ఖాళీ చేయాలని అధికారులు చెప్పటంతో వాగ్వాదం జరిగింది. భూమిని పూడ్చే పనిని తాము చేపడతామని అధికారులు చెప్పారు. ఈ దశలో వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని మాట్లాడుతూ భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ అంశంపై ఇరువైపులా వాగ్వాదం జరిగింది. చివరకు అధికారులు నిరాకరించటంతో పలువురు మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ధర్నాలో కూర్చున్న వారంతా అధికారుల తీరును నిరసిస్తూ రోడ్డు పైకి వచ్చారు. అక్కడే ఉన్న పోలీసులు ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నించారు. ధర్నా విరమించకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. పేర్ని నానితో పాటు కౌన్సిలర్లు, సీపీఎం నాయకులను బలవంతంగా పోలీసుజీపు, వ్యాన్లలోకి ఎక్కించారు. ఈ సమయంలో తీవ్రస్థాయిలో పెనుగులాట జరిగింది. కొందరు మహిళలను పోలీసులు వ్యాన్‌లోకి విసిరేశారు. దీనిని గమనించిన కుమ్మరిగూడెం మహిళలు రోడ్డుపై బైఠాయించారు. మంత్రి కొల్లు రవీంద్రను మహిళలు తమదైన శైలిలో తిట్టిపోశారు. చివరకు ఆందోళనకారులను పోలీసులు రెండు వాహనాలలో గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పరిస్థితిని సమీక్షించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని, సీపీఎం పట్టణ కార్యదర్శి కొడాలి శర్మ, కౌన్సిలర్లు అచ్చేబా, అస్గర్, సుబ్బన్న, నాయకులు మారుమూడి విక్టర్‌ప్రసాద్, బొర్రా విఠల్, ధనికొండ శ్రీనివాస్, చిటికిన నాగేశ్వరరావు, లంకా సూరిబాబు, బందెల థామస్‌నోబుల్, సీపీఎం నాయకులు దాసరి సాల్మన్‌రాజు, చిరువోలు జయరాజు తదితరులు మద్దతు ప్రకటించారు. నానితో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదు మచిలీపట్నం : ప్రజల జీవనానికి భంగం కలిగిస్తున్నారనే కారణంతో ఇనుగుదురుపేట పోలీసులు పది మందిపై సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇనుగుదురుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరిగూడెం వద్ద కుమ్మరిగూడెంవాసులు మచిలీపట్నం – విజయవాడ రహదారి వెంబడి «సోమవారం దర్నా నిర్వహించారు. పోలీసులు చెప్పినా ధర్నా విరమించకపోవటంతో ప్రజాజీవనానికి భంగం కలిగిస్తున్నారనే కారణంతో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని, కుమ్మరిగూడెంకు చెందిన నారగాని సుబ్బారావు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. -
తొలిరోజే సెగ !
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించిన జన్మభూమి కార్యక్రమం తొలిరోజు సోమవారం జిల్లాలో పలు చోట్ల రసాభాసగా మారింది. ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలను తక్షణం రద్దు చేయాలని పలుచోట్ల స్థానికులు డిమాండ్ చేశారు. అధికారులు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించగానే ఏడాది క్రితం తాము రేషన్‌కార్డులు, వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఎందుకు మంజూరు చేయలేదని ఆయా వర్గాల ప్రజలు నిలదీశారు. జన్మభూమి సభలలో గొడవలు జరుగుతాయని భావించిన చోట ప్రభుత్వం ముందుగానే భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. జన్మభూమి కమిటీలు రద్దు చేయాలంటూ ధర్నా... జగ్గయ్యపేట మండలం అనిగండ్లపాడు, శివాపురం గ్రామాల్లో జన్మభూమి– మాఊరు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎం నాయకులు పలువురు జన్మభూమి కమిటీలను తక్షణం రద్దు చేయాలని ఎమ్మెల్యే శ్రీరాంరాజగోపాల్ (తాతయ్య), అధికారుల సమక్షంలోనే ధర్నాకు దిగారు. ప్రశాంతంగా నిరసన తెలియచేస్తున్న వారిని అధికారులు బలవంతంగా బయటకు పంపేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి ధర్నా చేస్తున్న వారిని పక్కకు తోసేశారు. అర్హులైన వారికి కూడా పింఛన్లు, తెల్లకార్డులు అందకుండా జన్మభూమి కమిటీ సభ్యులు అడ్డుపడుతున్నారంటూ ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు బహిరంగంగానే విమర్శించారు.కార్యక్రమంలో తహసీల్దార్ కె. నాగేశ్వరరావు, ఎంపీడీవో వై . శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ నాయకులు నెల్లూరి గోపాలరావు, పిడికిటి కోటేశ్వరరావు, గింజుపల్లి శ్రీనివాసరావు, సీపీఎం నాయకులు డోర్నాల నాగయ్య, అరుణ్‌కుమార్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల పహరాలో....! విజయవాడ 23వ డివిజన్ కృష్ణలంక ఏపీఎస్ఆర్ఎం స్కూల్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రజలు అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తారనే అనుమానంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు ఎవరువస్తున్నారో నిఘాపెట్టారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ సభ ముగిసిందని అనిపించడంతో ప్రజలు పెదవివిరిచారు. జిల్లాలో పలుచోట్ల పోలీసు బందోబస్తు నడుమే తొలిరోజు జన్మభూమి కార్యక్రమాలు జరిగాయి. రేషన్ కార్డులకు బదులు ప్రొసీడింగ్స్ .... జిల్లాలో తొలిరోజు జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో పలుచోట్ల స్థానికులు పాల్గొని తాము ఏడాది క్రితం తెల్లరేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నామని ఇప్పటి వరకు ఇవ్వలేదందటూ అధికారుల్ని నిలదీశారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కార్డుల మంజూరు ప్రొసీడింగ్స్‌ను ఇచ్చి పంపారు. బందరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనగా ఆయనకు రేషన్ కార్డులు, వృద్ధాప్య పింఛన్ల సెగ తగిలింది. పలువురు పేదలు తాము ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా పింఛన్లు, తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని చెప్పారు. దీంతో వారికి మంత్రి సర్ది చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. -
నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక
అనంతపురం అర్బన్ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం రాత్రి అనంతపురం వస్తున్నారు. రాత్రికి ఇక్కడే ఉండి గురువారం స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. -
బీసీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
పెనమలూరు : రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆ శాఖ మంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. తాడిగడప గ్రామంలో బుధవారం ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర బీసీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్ సమన్వయంతో బీసీల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. 8 ఫెడరేషన్లకు పాలకవర్గాలను నియమించామని, వాటి కార్యాలయాలను కూడా 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది వెనుకబడిన తరగతుల వారికి రూ.400 కోట్లతో 50 వేల మందికి యూనిట్ రూ.2 లక్షలు చొప్పున రుణాలు అందజేస్తామని తెలిపారు. బీసీ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చుతున్నామని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో రూ.5 కోట్లతో బీసీ భవన్లు ఏర్పాటు చేస్తున్నామని, బీసీలకు త్వరలో మేఘా జాబ్‌మేళా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ చైర్మన్ పి.రంగనాయకులు, పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్, ఎంపీపీ బొర్రా కనకదుర్గ, డైరెక్టర్ హర్షవర్థన్, డైరెక్టర్లు బొల్లా వెంకన్న, నిడుమోలు సుబ్రహ్మణ్యం, పి.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా పోర్టు నిర్మాణం
మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం(చిలకలపూడి) : మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో శనివారం ఎంఏడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల వద్దకు పూర్తి సమాచారంతో వెళ్లి వారికి అవగాహన కల్పించి ప్రాంత అభివృద్ధికి సహకరించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బందరు అభివృద్ధి అందరి బాధ్యత అని ఇందుకు సహకరిస్తే ప్రాంత అభివృద్ధి జరుగుతుందన్నారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి పోర్టు నిర్మాణం ఎంతో కీలకమన్నారు. జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, సీఆర్డీఏ ల్యాండ్ ఫూలింగ్ ఎస్టేట్ డైరెక్టర్ మోహనరావు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, ఎస్పీ విజయకుమార్‌పాల్గొన్నారు. ఇంటి నిర్మాణానికిS రుణాలు ఇవ్వటం లేదు : కర్రి నాగవెంకటదుర్గాఅశ్వని, మా భూమిని భూసమీకరణలో పొందుపరచటం వలన బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వటం లేదు. బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. -
ఆకట్టుకునే వ్యూహం
సాక్షి, విజయవాడ బ్యూరో : ఆగస్టు 4న విజయవాడలో నిర్వహించే బీసీ ఫెడరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ æస్వీకారానికి భారీ స్థాయిలో జనాన్ని సమీకరించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం తన క్యాంపు కార్యాలయంలో కసరత్తు చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు విడివిడిగా ఫెడరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో చర్చలు జరిపారు. మొత్తం 11 బీసీ ఫెడరేషన్లు ఉండగా అందులో ఆరు ఫెడరేషన్లకు ఇటీవల చైర్మన్, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వీరందరినీ శనివారం క్యాంపు కార్యాలయానికి పిలిపించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ పాల్గొన్నారు. బీసీలంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, కాపులు కాస్త అటుఇటుగా ఉన్నట్లు చెప్పారు. కార్పొరేషన్ల ద్వారా కుల సమీకరణలు చేయవచ్చునని సూచించారు. మంత్రి కొల్లు మాట్లాడుతూ టీడీపీలో బీసీలు మొదటి నుంచీ బలమైన వర్గంగా ఉన్నారన్నారు. మిగిలిన ఫెడరేషన్లకు కూడా త్వరలోనే కమిటీలు వేస్తామని చెప్పారు. సీఎంను మెప్పించేందుకు బీసీ ఫెడరేషన్లు జన సమీకరణ చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. పలు ఫెడరేషన్లలోని కొందరు మాట్లాడుతూ సొంతడబ్బులతో కుల సమీకరణ ద్వారా తీసుకురావడం సాధ్యం కాదని చెప్పడంతో విడివిడిగా మంత్రి మాట్లాడారు. ఫెడరేషన్లకు టీడీపీ అనుకూలురును చైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించుకున్న విషయం తెలిసిందే. వారి ద్వారా తమకు బలం ఉందని సీఎం వద్ద నిరూపించుకోవచ్చుననే మంత్రి ఆలోచనకు సమావేశానికి వచ్చిన వారు అడ్డుకట్ట వేస్తున్నట్లు మాట్లాడటంతో మంత్రి కాస్త ఆలోచనలో పడ్డారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్థన్ కూడా పాల్గొన్నారు. -
ఆక్వా రంగానికి అధిక ప్రాధాన్యం
కైకలూరు : ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. స్థానిక సీఎన్నార్ గార్డెన్లో శనివారం 12వ ఆక్వా టెక్ ఎక్స్ఫో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. దేశ, విదేశాలకు చెందిన వివిధ ఆక్వా మందులు, యంత్ర పరికరాల తయారీ కంపెనీలు 50 స్టాల్స్‌లో ఉత్పత్తులను ప్రదర్శించాయి. కైకలూరు ఆక్వా మందుల దుకాణదారులు ఏర్పాటు చేసిన చేప వంటకాలు ఆకట్టుకున్నాయి. మంత్రి రవీంద్ర స్టాల్స్‌ను పరిశీలించారు. ఆక్వా టెక్ చీఫ్ ఎడిటర్ కోనా జోసఫ్ ఆధ్వర్యంలో చేపలు, రొయ్యల రైతులతో సమీక్ష జరిపారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ చేపల రైతులకు రెండు హెక్టార్లకు రూ.3.75కే విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థ జలాల కారణంగా కొల్లేరు సరస్సులో సహజసిద్ధ చేపలు మరణిస్తున్నాయన్నారు. రిజర్వాయర్లలో విడిచిపెట్టే చేప పిల్లల టెండర్లలో అవినీతిని అరికట్టాలని మంత్రిని కోరారు. అంతకు ముందు జరిగిన ఆక్వా రైతుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆక్వా రైతులు ఆధునిక పద్ధతులు అలవర్చుకోవాలని కోరారు. గుడివాడకు చెందిన రొయ్యల రైతు కనుమూరి భాస్కరరాజు, ముదినేపల్లికి చెందిన చేపల రైతు రావిశెట్టి హనుమంతరావులకు ఉత్తమ ఆక్వా రైతు అవార్డులను మంత్రి అందించారు. చీఫ్ ఆర్గనైజర్ జోసఫ్ మాట్లాడుతూ ఆక్వా టెక్ మాసపత్రిక ద్వారా చేపల రైతులకు విలువైన సమాచారం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెంకట్రామయ్య, కైకలూరు, మచిలీపట్నం జెడ్పీటీసీ సభ్యులు విజయలక్ష్మి, లక్ష్మణప్రసాద్, ఎంపీపీ బండి సత్యవతి, రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు, సభ్యులు చింతపల్లి అంకినీడు, మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, ఏఎంసీ చైర్పర్సన్ వీరరాజరాజేశ్వరీ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాజు, కైకలూరు సర్పంచ్ అప్పారావు, సీఐఎఫ్ఏ అధికారి గిరి, ప్రొఫెసర్ పి.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతు లేక.. ఏరువాక!
రైతుల నుంచి స్పందన కరువు సాగునీరు ఎప్పుడిస్తారో చెప్పకుండా కార్యక్రమం నిర్వహించడంపై మండిపాటు పేలవంగా కార్యక్రమం పార్టీ నేతలు, అధికారులకే పరిమితం విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమం జిల్లాలో పేలవంగా జరిగింది. సోమవారం జిల్లాలో పలుచోట్ల జరిగిన ఏరువాక కార్యక్రమం కేవలం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే పరిమితం అయింది. జిల్లాలో రైతులకు సాగునీరు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ఏరువాక కార్యక్రమంపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో టీడీపీ కార్యకర్తలు నాయకుల మెప్పు కోసం గ్రామాల్లో రైతులను పోగు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలో, మరో మంత్రి కొల్లు రవీంద్ర బందరు మండలం చిట్టిపాలెంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ముదినేపల్లి మం డలం చిగురుకోటలో ఏరువాక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రైతులు ఆశించిన రీతిలో పాల్గొనలేదు. ప్రసంగించకుండా వెళ్లిపోయిన ఎమ్మెల్యే... నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో రైతులు ఎవరూ ఏరువాక కార్యక్రమంలో పాల్గొనకపోవటంతో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసహనం వ్యక్తం చేశారు. రైతులను సమీకరించలేకపోయారంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె ఈ కార్యక్రమంలో ప్రసంగించకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. తిరువూరు నియోజకవర్గం లక్ష్మీపురంలో కూడా ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. నూజివీడు నియోజకవర్గం తూర్పుదిగవల్లిలో అధికారులకే పరిమితమైంది. రైతులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపలేదు. -
మంత్రి ఇంటిని ముట్టడిస్తాం
పెడన : టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత రుణమాఫీ తక్షణం అమ లు చేయకపోతే చేనేత, జౌళిశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిని ముట్టడిస్తామని వైఎస్సార్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు ఆనంద్ ప్రసాద్ హెచ్చరించారు. స్థానిక 16వ వార్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆనంద్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు చేనేత రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వటం వలన చేనేత కార్మికులు రుణాలు చెల్లించలేదని చెప్పారు. రుణాలకు వడ్డీలు పెరిగిపోవటంతోపాటు బ్యాంకర్ల ఒత్తిళ్లు పెరగటం వలన రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, దావు భైరవలింగం, పార్టీ మండల పరిషత్ ప్రతిపక్ష నేత రాజులపాటి అచ్యుతరావు, పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు పిచ్చిక సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్‌పై మంత్రి పర్యటన
పారిశుద్ధ్య నిర్వహణపై ఆరా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలంటూ హెచ్చరిక మచిలీపట్నం: రాష్ట్ర బీసీసంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సైకిల్‌పై పట్టణంలో పర్యటించారు. కోనేరుసెంటర్ నుంచి సైకిల్‌పై బయలుదేరిన ఆయన బస్టాండ్‌సెంటర్, జిల్లాకోర్టుసెంటర్, లక్ష్మీటాకీస్‌సెంటర్ మీదుగా మూడో వార్డులోని పెయింటర్స్‌కాలనీ, నీలగిరికాలనీల్లో పర్యటించారు. మంత్రి పట్టణంలోని మురికివాడల్లో పారిశుద్ధ్య సిబ్బంది విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నదీ, సక్రమంగా విధులకు హాజరవుతున్నదీ లేనిదీ ఆరా తీయడంతో పాటు అభివృద్ధిపై ప్రత్యేక ఆరా తీశారు. పెయింటర్స్‌కాలనీ వాసులు తమ ప్రాంతంలో డ్రైనేజీ వసతి సరిగా లేదని, వర్షాకాలంలో కాలనీ మొత్తం తటాకంలా తయారవుతుందని మంత్రి ఎదుట వాపోయారు. కాలనీకి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి డ్రైనేజీల అనుసంధానానికి మొదటి విడతగా రూ. 18 కోట్ల నిధులు మంజూరయినట్లు కాలనీ వాసులకు చెప్పారు. మంత్రి మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులందితే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్‌చైర్మన్ పి.కాశీవిశ్వనాథం, కౌన్సిలర్లు బత్తిన దాసు, నారగాని ఆంజనేయప్రసాద్, లోగిశెట్టి వీరాస్వామి పాల్గొన్నారు. -
రూ.5 కోట్లతో అభివృద్ధి
► బ్రహ్మయ్యలింగం చెరువుపై సీఎం వెల్లడి ► జిల్లాలో ప్రయోగాత్మకంగా జన్‌ధన్ ఆధార్ పథకం ► వంశీకి అభినందన.. ఆపై హెచ్చరిక గన్నవరం మండలం చెరువుల నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్షి, విజయవాడ : గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని బ్రహ్మయ్యలింగం చెరువును రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతేగాక పోలవరం కుడి కాల్వ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువుకూ పూర్తిగా నీరిస్తామని తెలిపారు. శుక్రవారం బ్రహ్మయ్యలింగం చెరువు పూడికతీత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విజయవాడలోని ఎ-కన్వెన్షన్‌లో జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. గన్నవరం సభలో మాట్లాడుతూ బ్రహ్మయ్యలింగం చెరువును రిజర్వాయర్‌గా మార్చుతామన్నారు. దీనికి గొలుసుకట్టు చెరువుల్ని, కాల్వలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. విమానాశ్రయానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఇక్కడ కొంత అటవీ ప్రాంతం ఉందని, దీనిని డీఫారెస్టేషన్ చేసి కొత్త సంస్థలను తీసుకొస్తామని వెల్లడించారు. మంచి ప్రమోటర్లను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వంశీ చర్య చట్టవ్యతిరేకం.... పోలవరం కుడికాల్వలో నీరు ఉండటం వల్ల ఎమ్మెల్యే వంశీమోహన్ పంపులు పెట్టి నీరు తోడి పంటలు కాపాడారని, దీనికి ఆయన్ను ఒకవైపు అభినందిస్తున్నానని, ఇంకో విధంగా ఇది చట్టవ్యతిరేకమని గుర్తుంచుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఏడాది ఆ సమస్య రాకుండా పోలవరం కుడి కాల్వ ద్వారా ఈ ప్రాంతానికి పూర్తిగా నీరిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. జూన్‌లో గోదావరికి వరదలు వస్తాయని, అప్పుడు అక్కడ నుంచి 80 టీఎంసీల నీరు తీసుకువచ్చి కృష్ణాడెల్టాలోని 13 లక్షల ఎకరాలు కాపాడతామని తెలిపారు. ఎ-కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ జిల్లాలో జన్‌ధన్ ఆధార్ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ డివిజన్ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, బ్రహ్మయ్య లింగయ్య చెరువు, దానికి గొలుసుకట్టు ఉన్న నమూనాను పరిశీలించారు. విజయవాడ ఎ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావ్, తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. -
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి
మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం(చిలకలపూడి) : మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మత్స్యపరిశ్రమ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు హాలులో గురువారం జాతీయ సముద్ర మత్స్యవిధానం-2016పై తీరప్రాంత మత్స్యకారుల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి మాట్లాడుతూ రాబోయే పదేళ్ల కాలానికి జాతీయస్థాయి మత్స్యప్రణాళిక తయారుచేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గత సంవత్సరం మత్స్యరంగంలో 36శాతం వృద్ధి నమోదైనప్పటికీ సముద్రజలాల్లో అనుకున్నంత స్థాయిలో మత్స్య ఉత్పత్తులు లభించటం లేదన్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక, పర్యవేక్షణ కొరవడి మత్స్యవనరులను తగ్గుముఖం పట్టిస్తున్నాయన్నారు. అర్హులందరికీ ఆయిల్ సబ్సిడీ అందివ్వాలని సూచించారు. చేపల వేట నిషేధ కాలంలో బియ్యం మాత్రమే ఇచ్చేవారని తమ ప్రభుత్వం రూ. 4వేలు ఇచ్చేందుకు కృషి చేసిందన్నారు. మత్స్యకారుల గృహనిర్మాణ వ్యయాన్ని రూ.5 లక్షలకు పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. మత్స్యసంపద పాడవ్వకుండా కోల్డ్‌స్టోరేజీ నిర్మాణాలు చేస్తామన్నారు. సముద్రముఖద్వారం పూడికతీయటం, జెట్టీలు అదనంగా నిర్మించటంపై దృష్టి సారించినట్లు చెప్పారు. చేపల వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలను ఆదుకునేం దుకు బీమామొత్తాన్ని రూ.10లక్షలకు పెంచే యోచన చేస్తున్నామన్నారు. రేపు మునిసిపల్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన మచిలీపట్నం మునిసిపల్ కార్యాలయ నూతన భవనానికి శనివారం మునిసిపల్‌శాఖ మంత్రి పి.నారాయణ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చల్లపల్లి బైపాస్ రోడ్డును ఆర్‌అండ్‌బీశాఖ మంత్రి సిద్దా రాఘవరావు ప్రారంభిస్తారన్నారు. కలెక్టరేట్లో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి భూసమీకరణ కోసం 15 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 45 రోజుల్లో పోర్టు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మంగినపూడి బీచ్‌ను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్ల అంచనాలతో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇంకుడు గుంట పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మునిసిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణప్రసాద్, మత్స్యశాఖ డీడీ సాల్మన్‌రాజు, బందరు ఆర్డీవో పి సాయిబాబు, కాకినాడ మత్స్యశిక్షణా కేంద్రం వైస్‌ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ నారదముని, ఎంపీడీవో జీవీ సూర్యనారాయణ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మద్య నిషేధం హామీ మరచిన బాబు
► ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి , ► వెఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి పట్నంబజారు (గుంటూరు) : అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మరిచారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి విమర్శించారు. అరండల్‌పేటలోని నగర పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీఎం ప్రమాణ స్వీకారోత్సవం సంతకం సాక్షిగా నేడు రాష్ట్రంలో 40 వేలకు పైగా బెల్టుషాపులు భేషుగ్గా నడుస్తున్నాయని ఆరోపించారు. మద్య నిషేధం ఊసే మరిచి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంచినీరు దొరకని గ్రామాలు ఉన్నాయని కానీ, మద్యం దొరకని పల్లెలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క జిల్లాలో కూడా డీ అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కనీసం మద్యపాన నియంత్రణ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. బీహార్ వంటి రాష్ట్రాల్లో తాజాగా మద్య నిషేధం విధిస్తుంటే మన పాలకులు నిస్సిగ్గుగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం దుర్మార్గమని వారు ధ్వజమెత్తారు. ఏపీలో మద్య నిషేధం అమలు చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని సాక్షాత్తూ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవలే విజయవాడలో మీడియాతో వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాల్లో మద్యం అమ్మకాల ద్వార రూ.10,250 కోట్ల ఆదాయం లభించగా, ప్రస్తుతం అది రూ.12,674 కోట్లకు చేరిందని తెలిపారు. ఇది చాలదన్నట్లు పేద, మధ్యతరగతి వర్గాలను మరింతగా మద్యం మత్తులో ముంచి లక్షలాది కుటుంబాల ఉసురు తీసేలా టెట్రా ప్యాక్‌లో సరికొత్తగా చీప్ లిక్కర్ ప్రవాహానికి గేట్లు బార్లా తెరవాలని నిర్ణయించడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖకు టార్గెట్ పెట్టి మరీ వెయ్యి కోట్ల ఆదాయాన్ని అదనంగా పెంచుకోవాలని చూస్తున్న ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టారు. ఈ పద్ధతిని తక్షణం విడనాడాలని వారు హితవు పలికారు. లేదంటే మహిళా లోకం తిరగబడుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలో పోరుబాట పట్టి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు. -
కార్పొరేషన్‌పై స్పష్టత ఏదీ?
మంత్రి కొల్లును విమర్శించిన వైఎస్సార్ సీపీ నేత పేర్ని నాని మచిలీపట్నం టౌన్ : మచిలీపట్నం మునిసిపాల్టీని కార్పొరేషన్‌గా మార్చే అంశంపై మంత్రి కొల్లు రవీంద్ర పూటకో మాట, అసత్యాలు వల్లిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ డిసెంబరు 9న మునిసిపాల్టీని కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం 268 జీవోను జారీ చేసిందన్నారు.జీవో విడుదల నాటి నుంచి ప్రస్తుతం ఉన్న మునిసిపల్ పాలకవర్గం రద్దయినట్లేనని 1994 మునిసిపల్ కార్పొరేషన్ చట్టం తేటతెల్లం చేస్తోందన్నా రు. జీవో వచ్చిన నాటినుంచి కార్పొరేషన్‌కు ప్రత్యేక అధికారి నియమించడం, ఒకవేళ ప్రభుత్వం ఆయనను నియమించకుంటే అక్కడ పనిచేస్తున్న కమిషనరే ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారని ఈ చట్టంలో పేర్కొన్నారన్నారు. చట్టంలో ఇంత స్పష్టంగా ఉంటే మంత్రి రవీంద్ర మాత్రం జీవో వచ్చిన రోజున చైర్మన్ బాబాప్రసాద్ మేయర్, కౌన్సిలర్లు కార్పొరేటర్లు అయ్యారని వారికి పలువురు సన్మానాలు కూడా చేసి మిఠాయిలు పంచారన్నారు. ఇటీవల జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి రవీంద్ర మచిలీపట్నం మునిసిపల్ పాలకవర్గ పదవీకాలం ముగిసే (2019) వరకు మునిసిపాల్టీగానే ఉంటుందని చెప్పారన్నారు. ప్రభుత్వం ఒక్కసారి జీవో విడుదల చేశాక ఆ జీవోను రద్దు చేయకుండా బాధ్యతాయుతమైన, గురుతరమైన పదవిలో ఉన్న మంత్రి రవీంద్ర నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. కార్పొరేషన్‌గా జీవో వచ్చిన అనంతరం మునిసిపాల్టీలో స్తబ్దత నెలకొని కనీసం సాధారణ సమావేశాలు కూడా నిర్వహించలేని దుస్థితి ఉందన్నారు. మునిసిపాల్టీని కార్పొరేషన్‌గా చేయాలని పాలకవర్గం తీర్మానం చేసే సమయంలో తమ పార్టీ ప్రతిపక్ష నాయకుడు షేక్ అచ్చాబా, ఉప ప్రతిపక్ష నాయకుడు శీలం బాబ్జి, కౌన్సిలర్లు చేయవద్దని ఒత్తిడి తెచ్చినా తాను మేయర్ అవుతానని, మీరు కార్పొరేటర్లు అవుతారని బాబాప్రసాద్ తీర్మానాన్ని ఆమోదింపజేశారన్నారు. బందరు ప్రాంతంలో రైతుల భూములను దోచుకునేందుకే మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ యత్నాలను భూపోరాట కమిటీ ఆధ్వర్యంలో తిప్పి కొడతామన్నారు. సమావేశంలో అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుమూడి విక్టర్‌ప్రసాద్, పార్టీ జిల్లా నాయకుడు మాదివాడ రాము, పార్టీ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు తాడిబోయిన విజయలక్ష్మీ, మునిసిపల్ ఉపప్రతిపక్ష నాయకుడు శీలం బాబ్జి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
పోర్టుజాడ.. నీలినీడ
బందరు పోర్టు నిర్మాణానికి పట్టిన గ్రహణం వీడడం లేదు. 2008లో పైలాన్ వేసినప్పటి నుంచి ఇప్పటివరకు బాలారిష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తొలుత స్థల సేకరణ, ఆ తర్వాత పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట 30 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో వారు మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో నాగాయలంక మండలంలోని గుల్లలమోద వద్ద క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో పోర్టు నిర్మాణానికి లంగరు పడినట్లయింది. ఇది మచిలీపట్నంలో పోర్టు నిర్మించే ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో భద్రతాపరమైన ఆంక్షలు విధిస్తారేమోనన్న నీలినీడలు కమ్ముకున్నాయి. -
మంత్రి అనుచరుల హల్ చల్.. రైతులపై దాడి
-
మంత్రి అనుచరుల హల్ చల్.. రైతులపై దాడి
కృష్ణా: కృష్ణా జిల్లాలో టీడీపీ నిర్వహించిన జనచైతన్య యాత్ర గందరగోళానికి దారి తీసింది. ఈ యాత్రలోని టీడీపీ కార్యకర్తలు పెద్దకర అగ్రహారం రైతులపై దాడులకు పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోర్టు అనుబంధ సంస్థలకు తమ భూములు కేటాయించకుండా మినహాయింపు ఇవ్వాలని ఇక్కడి రైతులు గత కొద్ది రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరుతూ వస్తున్నారు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతోపాటు తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర ఆద్వర్యంలో మంగళవారం తమ ప్రాంతంలో జరుగుతున్న జన చైతన్య యాత్రలో తమ వాణిని వినిపించేందుకు భారీ సంఖ్యలో రైతులు చేరుకున్నారు. కానీ, అందుకు మంత్రి అనుమతించకపోవడంతో వారు నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాటిల్లో తమ డిమాండ్ పేర్కొన్నారు. దీంతో తమ యాత్రను అడ్డుకుంటారా అంటూ టీడీపీ కార్యకర్తలు వారిపై ఒక్కసారిగా దాడులకు దిగారు. ఈ దాడుల్లో తమ మెడలోని బంగారు గొలుసులు టీడీపీ కార్యకర్తలు లాక్కున్నారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి తొలిరోజే టీడీపీ జన చైతన్యయాత్ర ప్రజాగ్రహానికి గురైంది. -
బాలయ్య పవరేంటో తెలియదా?
‘‘ఫ్లూటు జింక ముందు ఊదు..! సింహం ముందు కాదు..!!’’ ఓ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ ఇది. అవే పంచ్ డైలాగ్‌లతో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ మంత్రికి సినిమా (చుక్కలు) చూపించారట. ఇంతకీ బాలయ్య ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రికి ఎందుకు సినిమా చూపించారంటే... ఇటీవల ఎకై సజ్ శాఖలో బదిలీలు జరిగాయి. బాలయ్య ఆశీస్సులతో ఉత్తరాంధ్ర జిల్లాలో పనిచేస్తున్న ఎక్సైజ్ ఉన్నతాధికారిణి ఒకరికి రాయలసీమలో ఓ జిల్లాకు బదిలీ చేశారు. ఈ బదిలీ గురించి తనకు తెలియకుండా జరిగిందని ఆ జిల్లాకు చెందిన ఇటీవల కాలంలో తరచూ యూటర్న్లు తీసుకుంటున్న రాయలసీమ ప్రాంత సీనియర్ మంత్రి ఒకరు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్రపై కినుక వహించారు. సదరు ఉన్నతాధికారికి కీలక వ్యక్తి ఒకరు సిఫారసు చేయడంతోనే అక్కడకు బదిలీ చేశామని ఎకై ్సజ్ మంత్రి వివరణ ఇచ్చుకున్నారట. ఈ బదిలీపై ఇటీవల విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు కూడా. సదరు ఎక్సైజ్ ఉన్నతాధికారిణిపై పలు ఆరోపణలున్నాయని, అందువల్లే బదిలీ చేశామని అబ్కారీ మంత్రి చెప్పుకొచ్చారు. అయితే సదరు అధికారిణి బదిలీ అయిన జిల్లాకు ఉత్తరాంధ్ర మంత్రి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. దీంతో సదరు అధికారిణిని అక్కడ్నుంచి బదిలీ చేయాలని ఉత్తరాంధ్ర మంత్రి పట్టుబడుతున్నారట. ఆమె ఉత్తరాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు అమాత్యుని ఆదేశాలను అసలు పట్టించుకోకపోవడమే ఉత్తరాంధ్ర మంత్రిగారి కోపానికి కారణమట. రాయలసీమ ప్రాంతానికి బదిలీ జరిగినా.. ఉత్తరాంధ్ర మంత్రి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తుండటంతో సదరు అధికారిణి బాలయ్యను ఆశ్రయించారట. దీంతో ఆగ్రహోదగ్రుడైన బాలయ్య ‘ఏంటి ఈ కాలిక్యులేషన్స్...!’ తమాషాలొద్దు అంటూ మంత్రిపై ఇంతెత్తు లేచారట. ‘అయిన వాళ్లకి కష్టం వస్తే అరగంట ఆలస్యంగా స్పందిస్తానేమో..! అదే ఏ ఆడపిల్లకు కష్టమొచ్చినా అరక్షణం ఆగను...!’ అంటూ వార్నింగ్ ఇవ్వడంతో మంత్రిగారు కిమ్మనలేదట. -
పోర్టు భూసేకరణం
మచిలీపట్నం : రాజధాని అమరావతి పేరుతో రైతుల నుంచి 29 వేల ఎకరాలను స్వాధీనంచేసుకున్న ప్రభుత్వం, బందరు పోర్టు పేరుతో మరో 30 వేల ఎకరాలు సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. మూడు రోజుల క్రితం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విలేకరుల సమావేశంలో 30 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించారు. శని వారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు మచిలీపట్నం మం డలంతో పాటు పెడన మండలంలో రెండు గ్రామాల్లో భూముల వివరాలను రెవెన్యూ అధికారులు కంప్యూటరీకరించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ చట్టం ఈ నెల 31వ తేదీతో ముగినుంది. ఈ నేపథ్యంలో తొలి విడత 18 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం హడావుడిగా నోటిఫికేషన్‌ను జారీ చేయనుందని తెలుస్తోంది. 30 వేల ఎకరాలు అవసరమా! బందరు పోర్టు నిర్మాణానికి 5,324 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఫిబ్రవరిలో ప్రభుత్వానికి కలెక్టర్ డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు సమర్పించారు. 524 ఎకరాలు పోర్టు భూములు ఉండగా మిగిలిన 4,800 ఎకరాలు ప్రైవేటు, ప్రభుత్వ భూమిని సేకరించాలని అధికారులు చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినా పక్కనపెట్టారు. భూసేకరణ చట్టం ఆగస్టు 31వ తేదీతో ముగియనుండటంతో తమ పంథాను మార్చుకున్న పాలకులు ఏకంగా 30వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించి రెవెన్యూ అధికారులను పరుగులు పెట్టించడం వెనుక ఏదో మతలబు ఉందనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. 19 గ్రామాల్లో... బందరు మండలంలోని పల్లెతుమ్మలపాలెం, రుద్రవరం, గుండుపాలెం, బందరువెస్ట్, పోలాటితిప్ప, గోకవరం, మంగినపూడి, తపసిపూడి, కొత్తపూడి, పొట్లపాలెం, పోతేపల్లి, కరగ్రహారం, బొర్రపోతుపాలెం, బుద్దాలపాలెం, చిలకలపూడి, గోపువానిపాలెం, కోన, పెడన మండలంలో కాకర్లమూడి, నందమూరులో 30 వేల ఎకరాల సేకర ణకు రెవెన్యూ అధికారులు రికార్డులు రూపొంది చేస్తున్నారు. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లు, ఆర్ఐలు, వీఆర్వోలను ఆర్డీవో కార్యాలయానికి రప్పించి ఆయా గ్రామాల్లో భూముల సర్వే నంబర్లు, అనుభవదారులు వివరాలు, ప్రైవేటు భూమా, ప్రభుత్వ భూమా అన్న సమచారం నమోదు చేస్తున్నారు. 24 గంటల్లో ఈ వివరాలు సేకరించి తమకు అందజేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావటంతో రెవెన్యూ సిబ్బంది యుద్ధప్రాతి పదికన ఈ వివరాలను నమోదు చేస్తున్నారు. తొలి విడతలో 18 వేల ఎకరాలకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని బందరు ఆర్డీవో పి.సాయిబాబు ‘సాక్షి’కి తెలిపారు. మడ అడవుల్లో పరిశ్రమలా..! బందరు మండలంలో సముద్రతీరం వెంబడి వేల ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో మడ అడవులు ఉన్నాయి. ఈ అడవులను దాటి మరికొంత ప్రాంతం కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జెడ్) పరిధిలో ఉంది. తుపానులు సంభవించినప్పుడు తీరప్రాంత గ్రామాలు ముంపుబారిన పడకుండా మడ అడవులు రక్షణ కవచంగా పనిచేస్తున్నాయి. సరైన రవాణా వసతిలేని, సముద్రం ఆటు, పోట్లకు గురయ్యే ఈ చిత్తడి నేలల్లో పరిశ్రమలు స్థాపించి కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందువస్తారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. స్థాపించే పరిశ్రమలు ఏవి, వాటికి ఎన్ని ఎకరాలు కావాలి అన్న వివరాలు లేకుండా భూసేకరణ చేస్తామని పాలకులు ప్రకటించడం, అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం తమ అభిప్రాయం తీసుకోరా అని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. -
రిలే దీక్ష చేస్తూ మున్సిపల్ కార్మికుడి మృతి
పుట్టపర్తిలో ఘటన సమ్మెపై సర్కారు మొండి వైఖరి మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర చర్చలు హైదరాబాద్/విజయవాడ బ్యూరో: రాష్ట్ర సర్కారు మొండి వైఖరి కారణంగా మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమ్మె ఉధృతరూపం దాల్చుతోంది. పట్టణాల్లో చెత్త సమస్య నానాటికీ పెరిగిపోతోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన కొనసాగించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రిలే నిరాహారదీక్ష చేపట్టిన మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుడు వెన్నమ నాయుడు(32) గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తాఫా, గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మద్దతు తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో భిక్షాటన, తిరుపతిలో స్కూటర్ ర్యాలీ, ధర్నాలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఆందోళనకు లోక్‌సత్తా జిల్లా శాఖ సంఘీభావం తెలిపింది. విజయనగరం జిల్లా సాలూరులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పీడిగ రాజన్నదొర కార్మికులను కలిసి మద్దతు ప్రకటించారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సీపీఎం, సీపీఐ రాష్ర్ట కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ అరెస్టు అయిన కార్మికులను పరామర్శించారు. చర్చల ద్వారా కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు నోటీసులివ్వండి: సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బందితో మనకు సంబంధం లేదని, వారిని పనిలో నియమించిన కాంట్రాక్టర్లకు నోటీసులు ఇవ్వాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులతో మంత్రి కొల్లు రవీంద్ర చర్చలు జరిపారు. వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నేడు మున్సిపల్ కార్యాలయాల ముట్టడి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్, మలేషియా, జపాన్లపై ఉన్న ప్రేమ రాష్ట్రంలో సమ్మె చేస్తున్న మున్సిపల్ సిబ్బందిపై లేదని భారతీయ కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) ధ్వజమెత్తింది. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం అన్ని మున్సిపల్ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారి తెలిపారు. -
'మత్స్యకారులను స్వస్థలాలకు చేర్చండి'
హైదరాబాద్: బంగ్లాదేశ్‌కు చేరిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్యారావుపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల్ని క్షేమంగా స్వస్థలానికి చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గల్లంతయిన మత్స్యకారులు బంగ్లాదేశ్‌లోని ఓ తీరానికి సురక్షితంగా చేరినట్లు సమాచారం తెలియడంతో స్పందించిన సీఎం ఢిల్లోని రెసిడెంట్ కమిషనర్‌తో శనివారం ఫోన్లో మాట్లాడారు. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఆ ఆరుగురిని వెంటనే కాకినాడ చేర్చేలా ఏర్పాట్లు చేయించాలని సీఎం చూచించారు. బంగ్లాదేశ్‌కు చేరిన బోటులో తొండంగి మండలం హుకుంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులను కూడా ఉన్నారు. వారందరినీ క్షేమంగా చేర్చే విషయంలో మంత్రి కొల్లు రవీంద్రకు బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వ సమాచారం సలహాదారు కార్యాలయం ఒక ప్రటకనలో తెలిపింది. -
మద్యం పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్
-
రూ.6,460 కోట్లతో బీసీ సబ్ ప్లాన్
ఎక్సైజ్‌శాఖను సంక్షేమ శాఖగా మార్చుతాం మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరి : రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి రూ.6,460 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ కమిషన్ ఏర్పాటు చేసినట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మంగళవారం పట్టణంలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి వచ్చిన ఆయన స్థానిక శివాలయంలో రెండు గంటల పాటు వినాయకహోమం నిర్వహించారు. అనంతరం నృసింహుని దర్శించుకుని ఆలయ సన్నిధిలో కొలువై వున్న శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీ ఈ నెలతో ముగియనుందని, కొత్తపాలసీని రెండు మూడు రోజులలో నిర్ణయిస్తామని చెప్పారు. ఎక్సైజ్ శాఖను సైతం సంక్షేమశాఖగా మార్చి బె ల్ట్ షాపులను లేకుండా చేయడంతో పాటు మద్యం అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా త్వరలోనే రూ.165 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఉపాధి కల్పించే పరిశ్రమలకు 40 శాతం సబ్సిడీతో బీసీలకు రుణాలు అందజేస్తామన్నారు. మంత్రి వెంట పార్టీ నాయకులు గంజి చిరంజీవి, సంకా బాలాజిగుప్తా, నందం అబద్దయ్య, వల్లభనేని సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పోర్టు భూసేకరణకు నోటిఫికేషన్...వారం రోజుల్లో
18న రైతులతో కలెక్టర్ ముఖాముఖి భూమి కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల మచిలీపట్నం / చిలకలపూడి : బందరు పోర్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు వారం రోజుల్లో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత కలెక్టర్ బాబు.ఎ, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు పోర్టు భూముల భూసేకరణ అంశంపై చర్చలు జరిపారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పోర్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. ఎటువంటి పొరపాట్లూ జరగకుండా పోర్టు నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను, ఎంపీ కొనకళ్ల పోర్టు భూసేకరణకు సంబంధించి గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. వారు భూమిని అప్పగించేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారన్నారు. ఈ నెల 18న అంబేద్కర్ భవన్లో కలెక్టర్ బాబు.ఎ పోర్టు భూసేకరణకు సంబంధించిన రైతులతో చర్చిస్తారన్నారు. రైతుల సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు కృషిచేయనున్నట్టు చెప్పారు. ఖాళీ అయ్యే గ్రామాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు... పోర్టు నిర్మాణంలో రెండు గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని క్యాంప్‌బెల్‌పేట, పల్లెపాలెం గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని రవీంద్ర చెప్పారు. ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు భూసేకరణకు సంబంధించి భూముల సర్వే పూర్తయిందన్నారు. సేకరించిన భూములకు సంబంధించి రైతులకు మంచి ధర పరిహారంగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో బందరు ఆర్డీవో పి.సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. -
మల్లి మస్తాన్‌బాబు మహోన్నత వ్యక్తి
సంగం(నెల్లూరు జిల్లా): భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మహోన్నత వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. గురువారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని గాంధీజనసంఘంలో మస్తాన్‌బాబు ఉత్తరక్రియల్లో పాల్గొన్న ఆయన.. సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పర్వతాలను సులువుగా అధిరోహించిన మస్తాన్‌బాబు దురదృష్టవశాత్తు ఆండీస్ పర్వతారోహణలో ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని మృతిచెందారన్నారు. మస్తాన్‌బాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషిచేశాయన్నారు. మస్తాన్‌బాబు కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు గాంధీజనసంఘంలోని సామాజిక భవనానికి మల్లి మస్తాన్‌బాబు నామకరణం చేయనున్నామని వెల్లడించారు. అలాగే సంగంలోని గురుకుల కళాశాలకు సైతం మస్తాన్‌బాబు పేరు పెట్టనున్నామన్నారు. -
పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం
నరసాపురం రూరల్ : ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని ఎక్సైజ్, బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం లక్ష్మణేశ్వరం గ్రామం నక్కావారిపూటలో మహాత్మా జ్యోతిరావ్ పూలే ఏపీ గురుకుల బాలికల పాఠశాల నూతన ప్రాంగణాన్ని ఆయన డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పేద విద్యార్థులు మంచి విద్యను అభ్యసించేందుకు గురుకుల విద్యాలయాలు తోడ్పడుతున్నాయని చెప్పారు. పతి నిరుపేదకూ చదువును అందుబాటులోకి తీసుకువచ్చి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు గురుకుల పాఠశాలలను ప్రారంభించినట్టు తెలిపారు. అద్దె భవనంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలకు సొంత భవనాన్ని నిర్మించేందుకు కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. స్థల సేకరణ చేయాల్సిందిగా స్థానిక ఎమ్యెల్యే బండారు మాధవనాయుడుకు సూచించారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్, పూర్తిస్థాయిలో ఫర్నిచర్‌కు అంచనాలు రూపొందిస్తే సమకూర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన విద్యాసామగ్రిని మంత్రి అందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులందరికీ ఫీజురీయింబర్స్‌మెంటును ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ యువత విలువైన కాలాన్ని వృథా చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని దేశానికి మంచి సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, మునిసిపల్ చైర్పర్సన్ రత్నమాల, ఆర్డీవో జె. ఉదయ భాస్కరరావు పాల్గొన్నారు. -
మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరు మృతి
-
మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరు మృతి
మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నం చల్లరాస్తా వద్ద సోమవారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర ఎస్‌టార్క్ వాహనం అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. మంత్రిని మచిలీపట్నంలో దించి వాహనం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.