
రూ.5 కోట్లతో అభివృద్ధి
► బ్రహ్మయ్యలింగం చెరువుపై సీఎం వెల్లడి
► జిల్లాలో ప్రయోగాత్మకంగా జన్‌ధన్ ఆధార్ పథకం
► వంశీకి అభినందన.. ఆపై హెచ్చరిక
గన్నవరం మండలం చెరువుల నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సాక్షి, విజయవాడ : గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని బ్రహ్మయ్యలింగం చెరువును రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంతేగాక పోలవరం కుడి కాల్వ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువుకూ పూర్తిగా నీరిస్తామని తెలిపారు. శుక్రవారం బ్రహ్మయ్యలింగం చెరువు పూడికతీత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విజయవాడలోని ఎ-కన్వెన్షన్‌లో జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. గన్నవరం సభలో మాట్లాడుతూ బ్రహ్మయ్యలింగం చెరువును రిజర్వాయర్‌గా మార్చుతామన్నారు. దీనికి గొలుసుకట్టు చెరువుల్ని, కాల్వలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. విమానాశ్రయానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఇక్కడ కొంత అటవీ ప్రాంతం ఉందని, దీనిని డీఫారెస్టేషన్ చేసి కొత్త సంస్థలను తీసుకొస్తామని వెల్లడించారు. మంచి ప్రమోటర్లను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
వంశీ చర్య చట్టవ్యతిరేకం....
పోలవరం కుడికాల్వలో నీరు ఉండటం వల్ల ఎమ్మెల్యే వంశీమోహన్ పంపులు పెట్టి నీరు తోడి పంటలు కాపాడారని, దీనికి ఆయన్ను ఒకవైపు అభినందిస్తున్నానని, ఇంకో విధంగా ఇది చట్టవ్యతిరేకమని గుర్తుంచుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఏడాది ఆ సమస్య రాకుండా పోలవరం కుడి కాల్వ ద్వారా ఈ ప్రాంతానికి పూర్తిగా నీరిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. జూన్‌లో గోదావరికి వరదలు వస్తాయని, అప్పుడు అక్కడ నుంచి 80 టీఎంసీల నీరు తీసుకువచ్చి కృష్ణాడెల్టాలోని 13 లక్షల ఎకరాలు కాపాడతామని తెలిపారు. ఎ-కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ జిల్లాలో జన్‌ధన్ ఆధార్ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని చెప్పారు.
రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా స్పెషల్ డివిజన్ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్, బ్రహ్మయ్య లింగయ్య చెరువు, దానికి గొలుసుకట్టు ఉన్న నమూనాను పరిశీలించారు. విజయవాడ ఎ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కాగిత వెంకట్రావ్, తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.